Pages

5, ఏప్రిల్ 2011, మంగళవారం

బుర్రకథ పితామహుడు షేక్‌ నాజర్‌

భారతదేశం సకల సంపదలకు, విభిన్న సంస్కృతులకు, భిన్న కళలకు ఆలవాలమైనది. ఆంధ్రలో ప్రజాప్రదర్శనా ప్రబోధాత్మక కళారూపం ''బుర్రకథ''. కళా కుటుంబంలో పుట్టి పేదరికాన్ని లెక్కచేయక ఆంధ్ర ప్రజానాట్యమండలి మరియు ఇతర నాట్యమండలుల సహకారంతో బుర్రకథంటే 'నాజర్‌' అనే గుర్తింపు పొంది, కష్టపడి ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించి 'పద్మశ్రీ'తోపాటు 'బుర్రకథ పితామహ' బిరుదులు పొందిన మహోన్నత జానపద జాతి కళాజీవి నాజర్‌.
షేక్‌ మస్తాన్‌, బీబాబీలకు 1920 ఫిబ్రవరి 5వ తేదీన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో నాజర్‌ జన్మించారు. హార్మోనిస్టు ఖాదర్‌ ఆయనను స్కూలు వార్షికోత్సవంలో 'ద్రోణ' పాత్రకు జీవం పోశాడని ప్రశంసించారు. మరియు బాలరత్న సభలో చేర్చారు. 'కృష్ణలీల'లో 'దేవకి', 'శ్రీ కృష్ణ తులాభారం'లో 'రుక్మిణి', 'భక్త రామదాసు'లో 'ఛాందిని' వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. సంగీతంపై మక్కువతో 'మురుగుళ్ళ'వారి వద్ద సంగీతం నేర్చుకోవాలని 'ఖాదర్‌' అప్పగించారు. పేదరికం వల్ల జోలె కట్టినా ఎంతోకాలం ఉండలేకపోయారు.
'బాల మహ్మదీయ సభ' పేరిట మళ్ళీ నాటకా లాడి మంచిపేరు గడించారు. దర్జీగా మారారు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. 'పాదుకా పట్టాభిషేకం'లో 'కైకేయి', 'ఖిల్జీ రాజ్యపతనం'లో 'కమలారాణి' పాత్రలు పోషించారు. నాస్తికుడయ్యారు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తుళ్ళూరు' పాటల పోటీలో ప్రథమ బహుమతి పొందారు. 'కొండపనేని బలరామ్‌, వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. 'వేపూరి రామకోటి' కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.
ప్రప్రధమ బుర్రకథా రచయిత, కథకులు 'కాకుమాను సుబ్బారావు' గారి సోవియట్‌ వీర వనిత టాన్యా కథను ప్రదర్శించారు. సహృదయులు రామకోటి కమిటీకి చెప్పి నాజర్‌ని కథకునిచేసి తాను హాస్యానికి మారి తాటికొండలో టాన్యా ప్రదర్శిస్తే ప్రముఖ కథకులు దొడ్డవరపు వెంకటస్వామిని గుర్తుచేశారని మెచ్చుకున్నారు. 'సుంకర వాసిరెడ్డి' వారి 'కష్టజీవి' బుర్రకథను మాభూమి నాటకంలో జమిందారు, క్రిప్స్‌ రాయబారంలో లాబు, వీధి భాగవతంలో భూపాల వంటి వేషాలు వేస్తూ రాష్ట్ర ప్రజానాట్యమండలి సభ్యులుగా నాజర్‌ దళం సామ్యవాదాన్ని ప్రచారం చేసింది. రాజకీయ తరగతుల ప్రభావంతో రచనలు చేయ సంకల్పించారు. బెంగాల్లో తుఫానొచ్చిన సంగతి పేపర్లో చూసిన నాజర్‌ కళ్ళల్లో నీళ్ళు నిండి అక్షరాలు కన్పించలేదు. 'బెంగాల్‌ కరువు' బుర్రకథకు ఆ కన్నీళ్ళే ప్రేరణ. ప్రదర్శన చూసిన పుచ్చలపల్లి సుందరయ్య 'నా బిడ్డ ఎంతో ఎత్తు ఎదిగాడని' అభినందించారు. ఆంధ్ర దేశానికే గర్వకారణమై తన నటనతో ప్రపంచాన్ని మెప్పించిన బళ్ళారి రాఘవగారు 'భళా! నాజరూ నీ వంటి ఉత్తమాభిరుచిగల కళాకారులు దేశానికి ఎంతో అవసరం' అని అభినందించారు. 'మా భూమి' నాటకంలో 'కమల' పాత్రకు జమున గారికి తర్ఫీదు ఇచ్చి దర్శకత్వం వహించారు.
మద్దుకూరి చంద్రంగారు పార్టీపై నిషేదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజానాట్యమండలిని వేరుచేశారు. ఏర్వాక కమిటీలు స్థాపించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని పెంచారు. పల్లెల్లో వ్యవసాయ పనులు చేస్తున్నవారినుద్దేశించి 'వలియవలియ', రైతు కూలీలనుద్దేశించి 'ఏనాటికానాడు ఎండవానల్లో', పస్తులుంటున్న కూలీలను దృష్టిలో ఉంచుకుని 'ఎండల్లో వానల్లో నీడనక నిద్రనక', కూలీ చాలనీ జనాన్ని చూసి 'ఎన్నాళ్ళీ కాపురాలు', కమతగాళ్ళని చూసి 'ఏరన్నరాకముందె ఏర్వాక వచ్చెరన్న' పాటలు రాస్తే పక్కఊరి పెద్ద రైతు మురికితిట్టు తిట్టి చెంపపైన కొట్టి పెన్ను లాక్కెళ్ళగా, ఆ సంగతి తెలిసిన జనం నిలదీయగా అబద్దమాడాడు. ప్రజలలో తానాశించింది ఇదేనని సంతోషించారు. ప్రజాకళాకారులపై నిషేధం విధించిన సమయంలో పోలీసులు ఇంటికొచ్చి అన్నీ చిందరవందరచేసి, రచనలన్నీ తీసుకుని ఆయన తల్లితో 'ఒసే! ముసలిదానా! కోర్టుకి నీ కొడుకురాకపోతే ముందువాడు తర్వాత నువ్వూ చస్తారని' తిట్టి వెళ్ళారు. పక్కనుండి చూస్తూన్నా సమయం కాదని మారువేషంతో వారు కొండపై ఉన్నారు. అటు కాంగ్రెస్‌ వాళ్ళు ఇటు పోలీసుల బెడద భరించలేక రామిరెడ్డి గారు చెప్పినట్లు పోలీసులకు పొన్నెకల్లులో దొరికిపోగా వాళ్ళు ఆయనను మిలటరీ వ్యానులో మంగళగిరి తీసుకెళ్ళారు. జైలు నుండి వచ్చాక రామకోటి 'నాజర్‌ దళం' స్వతంత్రంగానే ఉంటే బావుంటుందన్నారు.
విజయవాడ ఆకాశవాణిలో 'భక్తప్రహ్లాద' బుర్రకథ చెప్తే బావుందన్నారు. గరికపాటి రాజారామ్‌ మద్రాసు పిలిచి సుంకర, రుద్రమదేవి బుర్రకథను 'పుట్టినిల్లు' సినిమాలో చెప్పించారు. రామకోటి హాస్యనటుడుగా ఉండిపోయారు. ప్రఖ్యాత సంగీత దర్శకులు 'సాలూరి రాజేశ్వరరావు' గారు సినిమాకో పాటైనా ఇస్తానంటే నేనిక్కడ ఇమడలేను నాలోకం వేరని సర్ధిచెప్పి వచ్చేశారు.
మద్రాసు ఆంధ్ర మహాసభలో 'బెంగాల్‌ కరువు' కథ చెప్పినపుడు, 'గూడవల్లి రామబ్రహ్మం' గారు 'పల్నాటి యుద్ధం' స్క్రిప్టు ఇచ్చారు. పలువురి సలహాలు తీసుకుని చాపకూటి సిద్ధాంతం, నిమ్నజాతులకు ఆలయ ప్రవేశం, మాలకన్నమను సేనా నాయకుని చేయటం వంటి స్వతంత్ర విధానాలు నిండి ఉన్న బుర్రకథను సమర్ధవంతంగా పూర్తిచేశారు.
'బొబ్బిలి యుద్ధం'లో కోడిపోరు కాక నీటి తగాదా అని కొత్త విషయం చెప్పారు. విజయనగరం వాళ్ళు నీటికి కట్టవేస్తే నిల్వ ఉంటాయి. కట్టలేకపోతే బొబ్బిలి వాళ్ళకు నీళ్ళు పుష్కలం కనుక ఆ విషయమై తగాదా అని ఎంతో వివరంగా వివరించారు. మొదటి కథ విజయనగరంలో చెప్పి ప్రశంసలు పొందారు. 'అభిమన్య యుద్ధం'లో అభిమన్యుని ప్రాణభీతి లేని యుద్ధ సన్నద్ధ ఉత్సాహాన్ని యువతకు ప్రేరణ కలిగిస్తుందనే ఆశయంతో రచించారు. 'నేటి రాయలసీమ'లో ఒక నాటి రతనాల సీమ నేడు రాళ్ళ సీమగా మారిన రాయలసీమ, వడ్డీ వ్యాపారుల మోసాలకు రైతు కూలీలుగా మారిన సన్నకారు రైతుల ఇక్కట్లను గూర్చి హృదయం కరిగేలా కరుణ రసాత్మకంగా రాశారు.
'శ్రీ రామరాజు యుద్ధం'లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు విద్య నచ్చక తల్లిని, తన కుటుంబాన్ని వదలి సాయుధపోరాటం సల్పి స్వాతంత్య్ర దీక్షను పూని దేశంకోసం అసువులు బాసిన అల్లూరి వారి జీవితాన్ని అందరికీ ఆదర్శం కావాలనే ఆకాంక్షతో అద్భుతంగా రాశారు.
'ఆసామి నాటకం' దున్నేవాడిదే భూమి కావాలనే ముఖ్యోద్దేశంతో రచించారు. 'అగ్గిరాముడు' సినిమాలో అల్లూరి సీతారామరాజు కథ చెప్పి రష్యా కళాకారుని సలహా మేరకు తానింకా నేర్చుకోవాలని, వృత్తి కళాకారులని కలసి, కరీంఖాన్‌, బిస్మిల్లాఖాన్‌, ఓంకారనాథ్‌, ఠాగూర్‌ మొదలగువారి సంగీత రికార్డులు సేకరించి కరీంఖాన్‌ గారి సంగీతం జానపద బాణీలకు దగ్గరగా ఉన్నాయని తర్ఫీదై 'భలే బావ' సినిమాలో పాత-కొత్త కలిపి కథ పూర్తిచేసి సంతృప్తిగా తిరిగివచ్చారు.
బుర్రకథకు వేషం, రంగులు, దుస్తులు, వాద్యాలు, సంగీతం, సమాజ సాహిత్యం ఇలా కావలసిన అన్నింటినీ సమాయత్తపరచి తనదైన బాణీని ఏర్పరచుకొని తనకుతానే సాటి ఇది 'నాజర్‌ యుగం' అని సాహితీవేత్త, సంపాదకులు, విమర్శకు లైన 'శ్రీనివాస చక్రవర్తి' గారు 'ఆంధ్రదర్శిని'లో ప్రశంసించారు. రాష్ట్ర నాటక సంగీత అకాడమీ కలకత్తాలో కథలకు, ఢిల్లీలో జానపద భావాల్లో స్పెషల్‌ ప్రోగ్రామ్‌ ఉందని కర్నాటి లకీëనర్సయ్య రమ్మన్నా తానురానని చెప్పి వెళ్ళిపోయారు. కంబం అభిమాని ఈదుల నారాయణరెడ్డి గారు నాజర్‌ గారికి సొంతంగా డాబా కట్టుకోవడానికి సహాయం చేయగా యక్షగాన నిలయం ఏర్పడింది. అలా అభిమానులు ఆయన ఉంటానికో ఇంటిని ఏర్పాటుచేశారు.
అగ్ర నిర్మాత లయన్‌ యు.వి.విశ్వేశ్వరరావు 'నిలువుదోపిడీ' సినిమాలో నాజర్‌ గారిచే పాడించి, అనుభవం ఉన్న రాజబాబుచే కథ చెప్పించారు. 'పెత్తందార్లు' సినిమాలో ఘంటసాల చే పాడించి ఎన్టీఆర్‌తోకథ చెప్పించారు. భారతదేశంలో పలు ప్రదేశాల్లో బుర్రకథలు చెప్తూ ఉంటే, భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య విభేదాల వల్ల ఆపి మళ్ళీ వస్తానని గుంటూరు చేరారు.
కూచిపూడి నాట్యం యక్షగానం అంటున్నారని శ్రీనివాస చక్రవర్తిని నాజర్‌ అడిగారు. జానపద కళారూపాలైన జానపద సాహిత్య శాస్త్రాలు చదివితే 'బుర్రకథే యక్షగానం' అని అర్ధం అవుతుందన్నారు. సాంబశివరావు, థామస్‌ వంతలు అన్న విషయం మరచి, రాగాలాపనలో మునిగిపోయి దరువు మర్చిపోయి లీనమైపోతే చేతితో కొట్టి స్పృహలోకి తెచ్చేవారు.
నాజర్‌ గారికి ఇద్దరబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు. అందరికీ సంగీతజ్ఞానం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తెలుగు మహాసభలో సన్మానం అంటే ఒప్పుకున్నా కథలైన తర్వాత వస్తానని తన కళాతృష్ణను తెలియజేశారు. రవీంధ్రభారతిలో కథ చెప్పగా, సన్మానించి కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యత్వమిస్తున్నాం అని సభాముఖంగా 'కళాభారతి' జమున ప్రకటించారు. ముఖ్యమంత్రి అంజయ్య వృద్ధ కళాకారులకు నెలకు నూటయాభై రూపాయలు ప్రకటించారు. యువ కళాకారులను తయారు చేయాలని సాంస్కృతిక శాఖ నాజరుకి పదివేలు నగదు ఇచ్చారు. ఆరు దళాలను తయారుచేసి రవీంధ్రభారతిలో ప్రదర్శనలు ఇప్పించారు. 1986 రిపబ్లిక్‌ డే రోజున రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్‌సింగ్‌ రాష్ట్రపతి భవన్‌లో 'పద్మశ్రీ' అవార్డును నాజర్‌కు అందించారు. తరువాత శ్రీ యన్‌.టి.రామారావు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా నాజర్‌గారు ఆయన చేతులమీదుగా చాలాసార్లు నగదు బహుమతి తీసుకొని సన్మానింపబడ్డారు.
ఉత్తమ రాజకీయవేత్త వావిలాల గోపాల కృష్ణయ్య నాజర్‌ గారిని గుంటూరులో సత్కరించి హృదయానికి హత్తుకొనగా, మీరిచ్చిన పరిజ్ఞాన ఫలితమిదని నాజర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆ సభలో ప్రధానవక్త ఆచార్య ఎస్‌.గంగప్ప, నాజర్‌ బుర్రకథకు చేసిన కృషిని, ఆయన విశిష్టతను ప్రశంసించారు.
అనారోగ్యంతో ఉన్నా ''జాతి జీవితం- కళా పరిణామం'' అనే జానపదుల, జానపదకళల జీవితాలకు సంబంధించిన గొప్ప గ్రంథం అచ్చువేస్తూ ఒకరోజు తప్పొప్పులు చూస్తూ బాగా నీరసంరాగా వారి పిల్లలు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. తలలో రక్తం గూడుకట్టిందని డాక్టర్లు చెప్పారు. ఫిట్స్‌లా వచ్చి 1997 ఫిబ్రవరి 21వ తేదీ తెల్లవారకముందే ఆయన పరమపదించారు.

uzz up!

- డా|| ఎ.వి.ఆర్‌.మూర్తి
Sun, 27 Jun 2010, విశాలాంధ్ర సౌజన్యంతో
Read More !