Pages

5, ఏప్రిల్ 2011, మంగళవారం

బుర్రకథ పితామహుడు షేక్‌ నాజర్‌

భారతదేశం సకల సంపదలకు, విభిన్న సంస్కృతులకు, భిన్న కళలకు ఆలవాలమైనది. ఆంధ్రలో ప్రజాప్రదర్శనా ప్రబోధాత్మక కళారూపం ''బుర్రకథ''. కళా కుటుంబంలో పుట్టి పేదరికాన్ని లెక్కచేయక ఆంధ్ర ప్రజానాట్యమండలి మరియు ఇతర నాట్యమండలుల సహకారంతో బుర్రకథంటే 'నాజర్‌' అనే గుర్తింపు పొంది, కష్టపడి ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించి 'పద్మశ్రీ'తోపాటు 'బుర్రకథ పితామహ' బిరుదులు పొందిన మహోన్నత జానపద జాతి కళాజీవి నాజర్‌.
షేక్‌ మస్తాన్‌, బీబాబీలకు 1920 ఫిబ్రవరి 5వ తేదీన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో నాజర్‌ జన్మించారు. హార్మోనిస్టు ఖాదర్‌ ఆయనను స్కూలు వార్షికోత్సవంలో 'ద్రోణ' పాత్రకు జీవం పోశాడని ప్రశంసించారు. మరియు బాలరత్న సభలో చేర్చారు. 'కృష్ణలీల'లో 'దేవకి', 'శ్రీ కృష్ణ తులాభారం'లో 'రుక్మిణి', 'భక్త రామదాసు'లో 'ఛాందిని' వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. సంగీతంపై మక్కువతో 'మురుగుళ్ళ'వారి వద్ద సంగీతం నేర్చుకోవాలని 'ఖాదర్‌' అప్పగించారు. పేదరికం వల్ల జోలె కట్టినా ఎంతోకాలం ఉండలేకపోయారు.
'బాల మహ్మదీయ సభ' పేరిట మళ్ళీ నాటకా లాడి మంచిపేరు గడించారు. దర్జీగా మారారు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. 'పాదుకా పట్టాభిషేకం'లో 'కైకేయి', 'ఖిల్జీ రాజ్యపతనం'లో 'కమలారాణి' పాత్రలు పోషించారు. నాస్తికుడయ్యారు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తుళ్ళూరు' పాటల పోటీలో ప్రథమ బహుమతి పొందారు. 'కొండపనేని బలరామ్‌, వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. 'వేపూరి రామకోటి' కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.
ప్రప్రధమ బుర్రకథా రచయిత, కథకులు 'కాకుమాను సుబ్బారావు' గారి సోవియట్‌ వీర వనిత టాన్యా కథను ప్రదర్శించారు. సహృదయులు రామకోటి కమిటీకి చెప్పి నాజర్‌ని కథకునిచేసి తాను హాస్యానికి మారి తాటికొండలో టాన్యా ప్రదర్శిస్తే ప్రముఖ కథకులు దొడ్డవరపు వెంకటస్వామిని గుర్తుచేశారని మెచ్చుకున్నారు. 'సుంకర వాసిరెడ్డి' వారి 'కష్టజీవి' బుర్రకథను మాభూమి నాటకంలో జమిందారు, క్రిప్స్‌ రాయబారంలో లాబు, వీధి భాగవతంలో భూపాల వంటి వేషాలు వేస్తూ రాష్ట్ర ప్రజానాట్యమండలి సభ్యులుగా నాజర్‌ దళం సామ్యవాదాన్ని ప్రచారం చేసింది. రాజకీయ తరగతుల ప్రభావంతో రచనలు చేయ సంకల్పించారు. బెంగాల్లో తుఫానొచ్చిన సంగతి పేపర్లో చూసిన నాజర్‌ కళ్ళల్లో నీళ్ళు నిండి అక్షరాలు కన్పించలేదు. 'బెంగాల్‌ కరువు' బుర్రకథకు ఆ కన్నీళ్ళే ప్రేరణ. ప్రదర్శన చూసిన పుచ్చలపల్లి సుందరయ్య 'నా బిడ్డ ఎంతో ఎత్తు ఎదిగాడని' అభినందించారు. ఆంధ్ర దేశానికే గర్వకారణమై తన నటనతో ప్రపంచాన్ని మెప్పించిన బళ్ళారి రాఘవగారు 'భళా! నాజరూ నీ వంటి ఉత్తమాభిరుచిగల కళాకారులు దేశానికి ఎంతో అవసరం' అని అభినందించారు. 'మా భూమి' నాటకంలో 'కమల' పాత్రకు జమున గారికి తర్ఫీదు ఇచ్చి దర్శకత్వం వహించారు.
మద్దుకూరి చంద్రంగారు పార్టీపై నిషేదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజానాట్యమండలిని వేరుచేశారు. ఏర్వాక కమిటీలు స్థాపించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని పెంచారు. పల్లెల్లో వ్యవసాయ పనులు చేస్తున్నవారినుద్దేశించి 'వలియవలియ', రైతు కూలీలనుద్దేశించి 'ఏనాటికానాడు ఎండవానల్లో', పస్తులుంటున్న కూలీలను దృష్టిలో ఉంచుకుని 'ఎండల్లో వానల్లో నీడనక నిద్రనక', కూలీ చాలనీ జనాన్ని చూసి 'ఎన్నాళ్ళీ కాపురాలు', కమతగాళ్ళని చూసి 'ఏరన్నరాకముందె ఏర్వాక వచ్చెరన్న' పాటలు రాస్తే పక్కఊరి పెద్ద రైతు మురికితిట్టు తిట్టి చెంపపైన కొట్టి పెన్ను లాక్కెళ్ళగా, ఆ సంగతి తెలిసిన జనం నిలదీయగా అబద్దమాడాడు. ప్రజలలో తానాశించింది ఇదేనని సంతోషించారు. ప్రజాకళాకారులపై నిషేధం విధించిన సమయంలో పోలీసులు ఇంటికొచ్చి అన్నీ చిందరవందరచేసి, రచనలన్నీ తీసుకుని ఆయన తల్లితో 'ఒసే! ముసలిదానా! కోర్టుకి నీ కొడుకురాకపోతే ముందువాడు తర్వాత నువ్వూ చస్తారని' తిట్టి వెళ్ళారు. పక్కనుండి చూస్తూన్నా సమయం కాదని మారువేషంతో వారు కొండపై ఉన్నారు. అటు కాంగ్రెస్‌ వాళ్ళు ఇటు పోలీసుల బెడద భరించలేక రామిరెడ్డి గారు చెప్పినట్లు పోలీసులకు పొన్నెకల్లులో దొరికిపోగా వాళ్ళు ఆయనను మిలటరీ వ్యానులో మంగళగిరి తీసుకెళ్ళారు. జైలు నుండి వచ్చాక రామకోటి 'నాజర్‌ దళం' స్వతంత్రంగానే ఉంటే బావుంటుందన్నారు.
విజయవాడ ఆకాశవాణిలో 'భక్తప్రహ్లాద' బుర్రకథ చెప్తే బావుందన్నారు. గరికపాటి రాజారామ్‌ మద్రాసు పిలిచి సుంకర, రుద్రమదేవి బుర్రకథను 'పుట్టినిల్లు' సినిమాలో చెప్పించారు. రామకోటి హాస్యనటుడుగా ఉండిపోయారు. ప్రఖ్యాత సంగీత దర్శకులు 'సాలూరి రాజేశ్వరరావు' గారు సినిమాకో పాటైనా ఇస్తానంటే నేనిక్కడ ఇమడలేను నాలోకం వేరని సర్ధిచెప్పి వచ్చేశారు.
మద్రాసు ఆంధ్ర మహాసభలో 'బెంగాల్‌ కరువు' కథ చెప్పినపుడు, 'గూడవల్లి రామబ్రహ్మం' గారు 'పల్నాటి యుద్ధం' స్క్రిప్టు ఇచ్చారు. పలువురి సలహాలు తీసుకుని చాపకూటి సిద్ధాంతం, నిమ్నజాతులకు ఆలయ ప్రవేశం, మాలకన్నమను సేనా నాయకుని చేయటం వంటి స్వతంత్ర విధానాలు నిండి ఉన్న బుర్రకథను సమర్ధవంతంగా పూర్తిచేశారు.
'బొబ్బిలి యుద్ధం'లో కోడిపోరు కాక నీటి తగాదా అని కొత్త విషయం చెప్పారు. విజయనగరం వాళ్ళు నీటికి కట్టవేస్తే నిల్వ ఉంటాయి. కట్టలేకపోతే బొబ్బిలి వాళ్ళకు నీళ్ళు పుష్కలం కనుక ఆ విషయమై తగాదా అని ఎంతో వివరంగా వివరించారు. మొదటి కథ విజయనగరంలో చెప్పి ప్రశంసలు పొందారు. 'అభిమన్య యుద్ధం'లో అభిమన్యుని ప్రాణభీతి లేని యుద్ధ సన్నద్ధ ఉత్సాహాన్ని యువతకు ప్రేరణ కలిగిస్తుందనే ఆశయంతో రచించారు. 'నేటి రాయలసీమ'లో ఒక నాటి రతనాల సీమ నేడు రాళ్ళ సీమగా మారిన రాయలసీమ, వడ్డీ వ్యాపారుల మోసాలకు రైతు కూలీలుగా మారిన సన్నకారు రైతుల ఇక్కట్లను గూర్చి హృదయం కరిగేలా కరుణ రసాత్మకంగా రాశారు.
'శ్రీ రామరాజు యుద్ధం'లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు విద్య నచ్చక తల్లిని, తన కుటుంబాన్ని వదలి సాయుధపోరాటం సల్పి స్వాతంత్య్ర దీక్షను పూని దేశంకోసం అసువులు బాసిన అల్లూరి వారి జీవితాన్ని అందరికీ ఆదర్శం కావాలనే ఆకాంక్షతో అద్భుతంగా రాశారు.
'ఆసామి నాటకం' దున్నేవాడిదే భూమి కావాలనే ముఖ్యోద్దేశంతో రచించారు. 'అగ్గిరాముడు' సినిమాలో అల్లూరి సీతారామరాజు కథ చెప్పి రష్యా కళాకారుని సలహా మేరకు తానింకా నేర్చుకోవాలని, వృత్తి కళాకారులని కలసి, కరీంఖాన్‌, బిస్మిల్లాఖాన్‌, ఓంకారనాథ్‌, ఠాగూర్‌ మొదలగువారి సంగీత రికార్డులు సేకరించి కరీంఖాన్‌ గారి సంగీతం జానపద బాణీలకు దగ్గరగా ఉన్నాయని తర్ఫీదై 'భలే బావ' సినిమాలో పాత-కొత్త కలిపి కథ పూర్తిచేసి సంతృప్తిగా తిరిగివచ్చారు.
బుర్రకథకు వేషం, రంగులు, దుస్తులు, వాద్యాలు, సంగీతం, సమాజ సాహిత్యం ఇలా కావలసిన అన్నింటినీ సమాయత్తపరచి తనదైన బాణీని ఏర్పరచుకొని తనకుతానే సాటి ఇది 'నాజర్‌ యుగం' అని సాహితీవేత్త, సంపాదకులు, విమర్శకు లైన 'శ్రీనివాస చక్రవర్తి' గారు 'ఆంధ్రదర్శిని'లో ప్రశంసించారు. రాష్ట్ర నాటక సంగీత అకాడమీ కలకత్తాలో కథలకు, ఢిల్లీలో జానపద భావాల్లో స్పెషల్‌ ప్రోగ్రామ్‌ ఉందని కర్నాటి లకీëనర్సయ్య రమ్మన్నా తానురానని చెప్పి వెళ్ళిపోయారు. కంబం అభిమాని ఈదుల నారాయణరెడ్డి గారు నాజర్‌ గారికి సొంతంగా డాబా కట్టుకోవడానికి సహాయం చేయగా యక్షగాన నిలయం ఏర్పడింది. అలా అభిమానులు ఆయన ఉంటానికో ఇంటిని ఏర్పాటుచేశారు.
అగ్ర నిర్మాత లయన్‌ యు.వి.విశ్వేశ్వరరావు 'నిలువుదోపిడీ' సినిమాలో నాజర్‌ గారిచే పాడించి, అనుభవం ఉన్న రాజబాబుచే కథ చెప్పించారు. 'పెత్తందార్లు' సినిమాలో ఘంటసాల చే పాడించి ఎన్టీఆర్‌తోకథ చెప్పించారు. భారతదేశంలో పలు ప్రదేశాల్లో బుర్రకథలు చెప్తూ ఉంటే, భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య విభేదాల వల్ల ఆపి మళ్ళీ వస్తానని గుంటూరు చేరారు.
కూచిపూడి నాట్యం యక్షగానం అంటున్నారని శ్రీనివాస చక్రవర్తిని నాజర్‌ అడిగారు. జానపద కళారూపాలైన జానపద సాహిత్య శాస్త్రాలు చదివితే 'బుర్రకథే యక్షగానం' అని అర్ధం అవుతుందన్నారు. సాంబశివరావు, థామస్‌ వంతలు అన్న విషయం మరచి, రాగాలాపనలో మునిగిపోయి దరువు మర్చిపోయి లీనమైపోతే చేతితో కొట్టి స్పృహలోకి తెచ్చేవారు.
నాజర్‌ గారికి ఇద్దరబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు. అందరికీ సంగీతజ్ఞానం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తెలుగు మహాసభలో సన్మానం అంటే ఒప్పుకున్నా కథలైన తర్వాత వస్తానని తన కళాతృష్ణను తెలియజేశారు. రవీంధ్రభారతిలో కథ చెప్పగా, సన్మానించి కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యత్వమిస్తున్నాం అని సభాముఖంగా 'కళాభారతి' జమున ప్రకటించారు. ముఖ్యమంత్రి అంజయ్య వృద్ధ కళాకారులకు నెలకు నూటయాభై రూపాయలు ప్రకటించారు. యువ కళాకారులను తయారు చేయాలని సాంస్కృతిక శాఖ నాజరుకి పదివేలు నగదు ఇచ్చారు. ఆరు దళాలను తయారుచేసి రవీంధ్రభారతిలో ప్రదర్శనలు ఇప్పించారు. 1986 రిపబ్లిక్‌ డే రోజున రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్‌సింగ్‌ రాష్ట్రపతి భవన్‌లో 'పద్మశ్రీ' అవార్డును నాజర్‌కు అందించారు. తరువాత శ్రీ యన్‌.టి.రామారావు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా నాజర్‌గారు ఆయన చేతులమీదుగా చాలాసార్లు నగదు బహుమతి తీసుకొని సన్మానింపబడ్డారు.
ఉత్తమ రాజకీయవేత్త వావిలాల గోపాల కృష్ణయ్య నాజర్‌ గారిని గుంటూరులో సత్కరించి హృదయానికి హత్తుకొనగా, మీరిచ్చిన పరిజ్ఞాన ఫలితమిదని నాజర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆ సభలో ప్రధానవక్త ఆచార్య ఎస్‌.గంగప్ప, నాజర్‌ బుర్రకథకు చేసిన కృషిని, ఆయన విశిష్టతను ప్రశంసించారు.
అనారోగ్యంతో ఉన్నా ''జాతి జీవితం- కళా పరిణామం'' అనే జానపదుల, జానపదకళల జీవితాలకు సంబంధించిన గొప్ప గ్రంథం అచ్చువేస్తూ ఒకరోజు తప్పొప్పులు చూస్తూ బాగా నీరసంరాగా వారి పిల్లలు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. తలలో రక్తం గూడుకట్టిందని డాక్టర్లు చెప్పారు. ఫిట్స్‌లా వచ్చి 1997 ఫిబ్రవరి 21వ తేదీ తెల్లవారకముందే ఆయన పరమపదించారు.

uzz up!

- డా|| ఎ.వి.ఆర్‌.మూర్తి
Sun, 27 Jun 2010, విశాలాంధ్ర సౌజన్యంతో
Read More !

29, జనవరి 2011, శనివారం

పరపతి

------------------------------------------------------------------ - అరిపిరాల సత్యప్రసాద్

‘‘ఏవమ్మా వెంకటలక్ష్మీ! మీ వారేరీ? రాలేదా?’’ అడిగింది వసంత.
‘‘ఎక్కడ అక్కయ్యా! ఆఫీసు పనుల్లో తీరిక చిక్కితేనా?’’ అంటూ సర్ది చెప్పింది వెంకటలక్ష్మి.

ఆమె మనసులో మాత్రం భర్తమీద కోపంగానే ఉంది. రెండు రోజులు సెలవులు కూడా కలిసొచ్చాయి కదా. వస్తే ఆయన సొమ్మేం పోయింది. ‘పెళ్లీడుకొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఇలాంటి ఫంక్షన్లకి రాకపోతే, మంచి సంబంధాలు ఎలా వస్తాయ’ని శతవిధాల పోరింది. అయినా ఫలితం లేకపోయింది.
‘‘ఇది నీ కూతురేనా? ఏం అమ్మాయి... నీ పేరు మర్చిపోయానే... మందారమా?’’ అడిగింది వసంత.
‘‘కాదు అత్తయ్యా! పారిజాతం’’ చెప్పింది కూతురు.

‘‘ఏమ్మా! వెంకటలక్ష్మీ! పిల్లకి సంబంధాలేమైనా చూస్తున్నారా?’’
‘‘నీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పరాదు.’’
‘‘నా ఎరుకలు, సోదులు ఎందుకులే గాని, ఇప్పుడంతా ఇంటర్‌నెట్టు సంబంధాలేగా’’ అంటూ మూతి వంకర్లు తిప్పింది.
‘‘అదేమిటొదినా మీ అన్నయ్య కొడుక్కి సంబంధాలు చూస్తున్నారట కదా!’’ అంటూ గుర్తుచేసింది వెంకటలక్ష్మి.

‘‘చూస్తున్నారే. కానీ వాళ్లతో మీరు తూగగలరా? వాడేమో ఫారిన్ వెళ్లి వచ్చాడు. మళ్లీ వెళ్తాడట. అయినా మా వదిన సంగతి తెలుసుగా. నీ కూతురి వల్ల కాదు దానితో వేగడం’’ అంటూ చక్కాపోయింది వసంత.
వెంకటలక్ష్మి ఆలోచనలో పడిపోయింది. భర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. సంపాదనకేమీ లోటు లేదు. గవర్నమెంట్ ఇచ్చే జీతంతోపాటు అడపాదడపా వచ్చే పైడబ్బుతో బాగానే సంపాదించాడు. ఒక్కగానొక్క కూతురు. అంతా దానికి కాక ఇంకెవరికి? అయినా వసంత వదిన ఇలా అంటుందేమిటి? మేము వాళ్లన్నయ్య సంబంధానికి తూగలేమా?

పెళ్లి హడావుడి జోరందుకుంది. పట్టుచీరల ప్రదర్శన మొదలైంది.
‘‘చూశావా? చూశావా? సూరమ్మత్త స్టైలు. ఇంత వయసొచ్చినా లిప్‌స్టిక్‌తో సహా మేకప్ వెయ్యాల్సిందే. ఆ నగలు దిగెయ్యడం చూడు. అంతా ఏం చేసుకుంటుంది? పెద్దాడు ఎవత్తినో దొరసానిని చేసుకున్నాడటగా’’ రాగం తీసింది వనజ.
‘‘దొరసాని కాదులే. తెలుగువాళ్లే. అక్కడికి వెళ్లి చాలాకాలం అయ్యిందట’’ చెప్పబోయింది వెంకటలక్ష్మి.
‘‘ఎవరైతేనేంలే పిన్నీ! రెండోవాడికి మా చెల్లెలి సంబంధం అడిగితే, ఎంత పొగరుగా మాట్లాడిందని. అక్కడికేదో ఆమె, ఆమె కొడుకు పైనుంచి దిగి వచ్చినట్లు. అన్నీ కలిపి ఒకటి ఇస్తామన్నాం. తెలుసా?’’ చెప్పింది వనజ.

‘‘లక్షా?’’ వెంకటలక్ష్మి అన్న తరువాత నాలిక కరుచుకుంది.
అప్పటికే వనజ నవ్వేసింది - ‘‘ఇంకా ఏ కాలంలో ఉన్నావు పిన్నీ?’’ అంది.
‘‘అదే అనుకున్నాలే’’ అంది వెంకటలక్ష్మి సర్దుకొని. ‘‘మరి ఇంతకీ ఏమైంది?’’ అడిగింది కుతూహలంగా.
‘‘ఆ సూరమ్మత్త కంటికి మేమెక్కడ ఆనుతాం చెప్పు పిన్నీ. ఆవిడే వద్దనింది.’’
‘‘అయితే మన పారిజాతానికి అడుగుదామే’’ అంటుంటేనే తాను చేసిన రెండో తప్పు అర్థం అయ్యింది వెంకటలక్ష్మికి.
వనజ మళ్లీ గట్టిగా నవ్వింది - ‘‘కొంచెం చూసుకో వదినా. మమ్మల్నే వద్దంటే...’’ అంటూ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయింది.

ముహూర్తం దగ్గర పడింది. స్టేజ్‌మీద ఉన్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకునే బంధుమిత్రులతో నిండిపోయింది. వాళ్ల చొక్కాలు తప్పించి ఇంకేమీ కనిపించక పోవడంతో, పెళ్లికొడుకు బహుశా తాళిబొట్టు కట్టి ఉంటాడని అనుకుంటున్నారు జనం అంతా.
‘‘అత్తయ్యా! వెంకటలక్ష్మి అత్తయ్యా...’’ అరుచుకుంటూ వచ్చింది ప్రణీత. భజంత్రీల హడావిడిలో ఆ అమ్మాయి గొంతు వెంకటలక్ష్మిని చేరనేలేదు. చివరికి వెతికి వెతికి ప్రణీత వెంకటలక్ష్మిని పట్టుకుంది.
‘‘అత్తయ్యా! అత్తయ్యా! త్వరగా రా. టీవీలో మామయ్యని చూపిస్తున్నారు.’’

‘‘ఏ మామయ్యే?’’ ఆశ్చర్యంగా అడిగింది.
‘‘ఇంకెవరు? మన మూర్తి మామయ్యే. రా త్వరగా’’ చెయ్యి పట్టుకుని లాగుతోంది ప్రణీత. వెంకటలక్ష్మి ఆశ్చర్యం కాస్త ఆందోళనగా మారింది.
‘‘ఎందుకే... ఏం చూపిస్తున్నారు? ఏం చెప్తున్నారు?’’ హడావిడిగా నడుస్తూనే అడుగుతోంది.
బంధుమిత్రులు మాత్రం తలంబ్రాల పేరుతో రంగు కాగితాలు, తళుకులు, బెండు ముక్కలు తలపైన పోసుకునే ప్రహసనాన్ని చోద్యంగా చూస్తున్నారు.

‘ఇన్‌కంటాక్స్ వలలో పెద్ద చేప’ ఇదీ టీవీలో వస్తున్న వార్త.
అప్పటికే పారిజాతం అక్కడ చేరి నోరు తెరిచి చూస్తోంది. వెంకటలక్ష్మి వచ్చి పారిజాతం పక్కనే స్థాణువులా నిలబడిపోయింది.
‘‘సెక్రటేరియట్లో పనిచేసే ఒక మామూలు ఉద్యోగి కె.పి.మూర్తి ఇంట్లో, ఈ రోజు ఉదయం నుంచీ ఇన్‌కమ్‌టాక్స్ దాడులు జరుగుతున్నాయి. గత ఐదు గంటల నుంచి అధికారులు లోపలే ఉన్నారు. ఇంతవరకూ దాడిలో బయటపడ్డ ఆస్తుల వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇంత చిన్న ఉద్యోగిపైన ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు కన్నెయ్యడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు...’’ చెప్పుకుంటూ పోతోంది న్యూస్‌రీడర్. తరువాత అదే వీధిలో ఉండే కనకయ్యతో అభిప్రాయం చెప్పించారు.

‘‘చాలా సాదాసీదాగా ఉండేవాడండి. మరి ఇంత ఎత్తున దాడి జరిగేంత సంపాదించాడంటే, మాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. గణేష్ చందాకి అయిదు వేలు ఇచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి’’ చెప్తున్నాడతను.
మొదట తేరుకుంది పారిజాతం. ‘‘అదేమిటమ్మా! ఆ కనకయ్యే కదా బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నాడు.’’
వెంకటలక్ష్మి మాట్లాడలేదు. ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చినట్లు చుట్టూ చూసి, అవమానంతో కుంచించుకుపోయింది.
‘‘ఏమిటే ఇది?’’ అడిగింది వసంత.
‘‘ఏమిటో వదినా! తెలియటం లేదు’’ అంది వెంకటలక్ష్మి కంగారుగా. హ్యాండ్ బాగ్‌లో నుంచి మొబైల్ తీసి ఫోన్ చెయ్యాలని ప్రయత్నం చేసింది. అందరూ టీవీని, తనని మార్చి మార్చి చూస్తున్న విషయం తెలుస్తూనే ఉంది.

‘‘ఫోన్ కలవటం లేదు’’ జనాంతికంగా చెప్పింది రెండుసార్లు ప్రయత్నించి.
‘‘ఇన్‌కంటాక్స్ రైడ్ అంటే ఫోన్లు అవీ మాట్లాడనివ్వరనుకుంటా’’ దూరపు బంధువొకాయన చెప్పాడు.
వెంకటలక్ష్మి అప్పటికే భోరున ఏడ్చేస్తూ కింద కూలబడింది. పారిజాతం ఏం చెయ్యాలో తోచక, తల్లి పక్కనే భుజం పట్టుకొని కూర్చుంది.

అక్కడ పెళ్లిలో చదివింపులు పూర్తవడంతో అతిథులంతా పెళ్లి ఐపోయిందనే నమ్మకంతో భోజనాలకి బయల్దేరి, దారిలో ఈ టీవీ ప్రహసనం దగ్గర ఆగిపోయారు. ఇంకా పెళ్లి అయిపోలేదన్న సంగతి తెలిసిన ఏకైక వ్యక్తి పురోహితుడు నాగవెల్లికి ఏర్పాటు చేసుకుంటున్నాడు.
‘‘అరెరె..రె.. మన మూర్తి గురించేనా టీవీలో చెప్తా... ఎంత పని జరిగింది?’’ గుంపులో ఎవరో అన్నారు. వెంకటలక్ష్మికి చాలా ఇబ్బందిగా తోస్తోంది.

‘‘మొత్తానికి అసాధ్యుడే వీడు. ఏం ఎరగనట్టు ఉంటాడు కానీ, ఉత్త దొంగ’’ ఇంకెవరో ముసలావిడ అంది.
‘‘అదుగో... అదుగో మన మూర్తి’’ సూరమ్మ అంది టీవీ చూస్తూ. మూర్తి ముఖం వేలాడేసుకొని ఉన్నాడు.
ఇంతలో టీవీలో మరో ఫ్లాష్ న్యూస్.
‘‘గత ఆరు గంటలుగా జరిగిన ఆపరేషన్ ముగిసినట్లు ఇన్‌కంటాక్స్ అధికారులు తెలియజేశారు. అయితే ఎంత డబ్బు రికవరీ అయినది చెప్పకుండా గోప్యంగా ఉంచారు. మూర్తి మాట్లాడటానికి నిరాకరించారు’’ టీవీలో మళ్లీ మళ్లీ అదే విషయం చెప్తున్నారు. వెంకటలక్ష్మికి మొదటిసారి చెప్పినదే మళ్లీ చెప్పే చానల్స్ మీద కోపం వచ్చింది.
చుట్టూ ఉన్న బంధువులని చూస్తే ఆమెకి బాధ ఇంకా రెట్టిపవుతోంది.
‘‘రాబర్ట్ అంకుల్ ఇన్‌కమ్‌టాక్స్‌లోనే ఉన్నారు కదమ్మా’’ అంది పారిజాతం.

‘‘ఉండీ ఏం లాభం? ఇహ మా పరువు, పరపతి మొత్తం పోయినట్లే’’ భోరుమంది వెంకటలక్ష్మి.
‘‘పోనీలేవే! పరపతి కోసం ఎందుకంత బాధపడతావు?’’ ఓదార్చడానికి వచ్చింది సూరమ్మొదిన.
ఆమె అంతమాత్రం ఓదార్పు మాటలు చెప్పడం కనీ వినీ ఎరుగని వనజ, నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉంది.
‘‘చూశావా వొదినా! లక్షణంగా ఈ పెళ్లికి వచ్చి ఉన్నా ఇది తప్పేది కదా’’ మళ్లీ భోరుమంది వెంకటలక్ష్మి.
వసంత కూడా చేరి, ‘‘ఊర్కో... ఊర్కో... ఇప్పుడేమైందని?’’ అంటోంది అనునయంగా.

‘‘ఇంకా ఏం జరగాలి అక్కయ్యా! ఇంత అవమానం జరిగిన తరువాత, మా పారిజాతాన్ని ఇంకెవరు చేసుకుంటారు చెప్పు’’ అంది పారిజాతం వైపు చూస్తూ.
విషయం తిరిగి తిరిగి తన పెళ్లి మీదకు రావడంతో, ఇబ్బందిగా అనిపించింది పారి జాతానికి. అందరూ ఆ పిల్లవైపే చూశారు.
‘‘నిక్షేపం లాంటి పిల్ల. ఎవరైనా ఎందుకు కాదంటారు’’ సూరమ్మ అంది.
‘‘అవునవును. మా అన్నయ్య కొడుకున్నాడు. నేను మాట్లాడతాను. నీకెందుకు?’’ వసంత ధైర్యం చెప్పింది. వెంకటలక్ష్మి ఏడుపాపి చూసింది.

‘‘మీ అన్నయ్యదాకా ఎందుకొదినా? మా అబ్బాయి లేడూ. ఇదుగో నేను చెప్తున్నాను. ఈ గొడవలన్నీ అయ్యాక, అన్నయ్యగారిని మంచిరోజు చూసుకొని ఇంటికి రమ్మనమను చెప్తాను’’ సూరమ్మ ఈ మాట అనగానే కళ్లు తిరిగినంత పనైంది పారిజాతానికి, ఇంకా అక్కడ ఉన్న సగం మంది బంధువులకి.
వెంకటలక్ష్మి కాస్త తేరుకుంది.

హడావుడి ముగియటంతో అంతా భోజనాల వైపు ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ బయల్దేరారు. భోజనం అవగానే పెట్టె సర్దుకొని తల్లీకూతుళ్లు ప్రయాణమయ్యారు. అక్కడ ఇన్‌కంటాక్స్ రైడ్ జరిగిందన్న బాధ ఒకవైపు, పారిజాతానికి సంబంధం-అదీ వాళ్లు ఊహించిన దానికన్నా మంచి సంబంధం కుదిరేట్టు కనపడటంతో సంతోషం ఒకవైపు... ఇలా ఉంది పరిస్థితి బస్టాండుకు చేరేసరికి. సరిగ్గా అప్పుడే ఫోను మోగింది మూర్తి దగ్గర్నుంచి.

‘‘ఏమండీ! ఏమిటండీ ఇదీ’’ ఫోను ఎత్తుతూనే ఏడ్చేసింది. పారిజాతం తల్లిని పట్టుకొని ఇబ్బందిగా చుట్టూ చూసింది.
‘‘అబ్బా! అనవసరంగా ఏడవకే. ఇక్కడేం జరగలేదు’’ చెప్పాడు మూర్తి.
‘‘మరి టీవీలో అలా చెప్తున్నారు. మీ ఫ్రెండ్ రాబర్ట్ ఉన్నాడు కదా. అతనేం సహాయం చెయ్యలేదా?’’ అడిగింది వెంకటలక్ష్మి.
‘‘ఈ రైడ్ చేయించిందే వాడు’’ అతను చెప్తుంటే మధ్యలోనే అందుకుంది వెంకటలక్ష్మి.
‘‘అయ్యో! ఎంత పని చేశాడండీ.’’
‘‘చెప్పేది వినవే. ఇంతకీ అక్కడ పెళ్లి ఎలా జరిగింది?’’

‘‘పెళ్లికేం బాగానే జరిగిందిలెండి. అంతకన్నా మన కథే చెప్పుకున్నారంతా. అందరూ కలిసి మమ్మల్ని ఓదార్చడమే సరిపోయింది’’ అని, కళ్లు తుడుచుకొని కొనసాగించింది వెంకటలక్ష్మి.
‘‘కాకపోతే గుడ్డిలో మెల్లన్నట్లు, మా సూరమ్మొదిన లేదూ ఆమె పారిజాతం సంబంధం మాట్లాడటానికి రమ్మంది. వసంతక్కయ్య, వాళ్ల అన్నయ్యతో మాట్లాడతానంది.’’
‘‘హమ్మయ్య! అయితే ప్లాను పనిచేసిందన్నమాట.’’
‘‘ప్లానేంటండీ?’’
‘‘నేను, రాబర్ట్ కలిసే ఈ ఇన్‌కమ్‌టాక్స్ ప్లాన్ వేశాం. అక్కడ రైడ్‌లో దొరికేదేమి లేదు. ఊరికే రైడ్ చేశారు అంతే.’’

‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా?’’
‘‘పిచ్చేమిటే? అలా రైడ్ జరిగే సరికి నేనేదో తెగ సంపాదించానని అందరూ అనుకుంటారు. దాంతో మన పరపతి ఎలా పెరిగిపోతుందో చూడు. మీ సూరమ్మొదిన, వసంతక్కయ్యలాగా మన పారిజాతానికి ఎంతమంది సంబంధం వెతుక్కుంటూ వస్తారో’’ చెప్తూనే ఉన్నాడు మూర్తి.
వెంకటలక్ష్మి సగం అయోమయం, సగం సంతోషంతో పారిజాతం వైపు చూస్తోంది.


................. అరిపిరాల సత్యప్రసాద్

 30/01/2011
ఆదివారం అనుబందం నుండి...
Read More !

ఊహాలోకం

.------------------------------------------------------------ - జుజ్జూరి వేణు
రెడీ... స్టార్ట్... యాక్షన్... అన్న పదాలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి, కలలో కూడా. సినిమా నా రంగుల కలల ప్రపంచం. దాన్ని చేరాలంటే రచనలనే వారధుల మీద మాత్రమే సాధ్యం.
నా రచనా ప్రపంచం అదో స్వాప్నిక లోకం. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నేను సృష్టించుకున్న పాత్రలు, నేను మాత్రమే ఉండే ఊహాలోకం.

పైరసీ వీడియో షాపు కాంతారావు దగ్గర రోజూ కూర్చొని సినిమాల్ని విశ్లేషించి, విమర్శిస్తూ, ప్రశంసిస్తూ గడిపేసేవాణ్ని. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి నాకు. ఒక రోజాయన ఒక డీవీడీ ఇచ్చారు. వాటిమీద రెండు థ్రిల్లర్ సినిమాల పేర్లున్నాయి. వాటిని చూసి అభిప్రాయాలు చెప్పమన్నారాయన. అందులో మొదటిదైన ‘డైరీ’ సినిమా చూస్తున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ ఒక డైరీలో రాసుకున్న కథని హీరో చదువుతూ, అదో యథార్థ గాథ అనుకుని, దెయ్యమనుకుని ఒక అమ్మాయిని హత్య చేసేస్తాడు.

సినిమా క్లైమాక్స్‌లో యండమూరి వచ్చి, ‘దెయ్యాలన్నీ మన భయాలు, భ్రమలు’ అని చెప్పి, సైకలాజికల్ ఫీలింగ్ అయిన హాల్యూసినేషన్ (ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు భ్రమించడం) గురించి చెప్పడంతో, కథ ముగుస్తుంది. సినిమానంతా పూర్తి అలౌకిక స్థితిలో ఉండి చూశాను. గది తలుపులన్నీ మూసేసి 29॥కలర్ టీవీలో అతి దగ్గర్నుండి చూస్తూ, నా ముందే పాత్రలున్నట్టు ఊహించుకుంటూ పాత్రల భావోద్వేగాలు, స్వభావాలు, వాటి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇమాజిన్ చేసుకోవడం నాకు అలవాటు. తరువాత సినిమా ప్లే చేశాను. టైటిల్స్ పడేటప్పుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. డీవీడీ మీద పేరుని చూశాను.

‘డైరీ’ తరువాత సినిమా ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’. కానీ వేరే సినిమా టైటిల్స్ పడుతున్నాయి. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అంతలోనే నా హాల్యూసినేషన్ (భ్రాంతి) స్థితికి నాకే నవ్వొచ్చింది. అది ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమానే. మళ్లీ అంతలోనే, కాదు కాదు ఆ సినిమా కాదనిపిస్తోంది. పిచ్చెక్కిపోతోంది నాకు. రెండు చేతుల్తో తల పట్టుకుని చీకట్లో నిశ్శబ్దంగా తిరుగుతున్న ఫ్యాన్‌ని చూశాను.
వెంటనే నా ఫ్రెండ్‌కు ఫోన్‌చేసి పిలిపించి, ‘‘ఇది ‘ఎ ఫిల్మ్ బై అరవిందే’ కదూ?’’ అని ప్రశ్నించాను. అతను నావైపు ఓ పిచ్చివాణ్ని చూసినట్టు చూసి, ‘‘కాదు. ‘అనసూయ’’ అన్నాడు.

జరిగిన హాల్యూసినేషన్ సీన్‌ను పైరసీ కాంతారావుకి చెప్పాను. ఆయన ఊపిరి గాఢంగా పీల్చి, ‘‘అది హాల్యూసినేషన్ కాదు, పవర్‌ఫుల్ ఇమాజినేషన్’’ అన్నాడు. నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమని, ఆయనకంటే ముందే నా రచయిత బుర్ర ఊహించింది. ‘‘ఇలాంటివి 10 డీవీడీలు తెప్పించి, నీలాంటి 10 కస్టమర్లకు ఇచ్చాను. వాళ్లంతా నాదగ్గరకొచ్చి, నీలా సినిమాల్ని విశ్లేషించేవారే.

నిజానికి మీ 10 మందికి ఆ అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నమే ఇది’’ అన్నాడు. నేను ఊహించనిదిది. ‘‘సినిమాని విశ్లేషణ చేసి విమర్శించాలన్నా, ప్రశంసించాలన్నా ఉండాల్సిన అర్హత పవర్‌ఫుల్ ఇమాజినేషన్. బాహ్య ప్రపంచాన్ని మరచి చూస్తున్న సినీలోకంలోకి వెళ్లి, విశేషానుభవంతో పాత్రల స్వభావాలను, పరిస్థితులను, కథాకథనాల్ని పరిశీలించి మాత్రమే నిజానిజాలు వెల్లడించాలి.

అంతేగానీ, నోటికి ఏదొస్తే అది వాగడం కాదు. మిగిలిన 9 మంది డీవీడీలో 2వ సినిమా మారిందని చెప్పారే గాని, ‘డైరీ’ సినిమాలో లీనమై 2వ సినిమా విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యామని చెప్పలేదు. అంటే, వాళ్లందరూ సినిమాని ఏ ఎమోషన్ లేకుండా, కనీసం కొద్దిగా కూడా ఇమాజినేషన్ లేకుండా చూసేశారు. కానీ, నువ్వు మాత్రం పవర్‌ఫుల్ ఇమాజినేషన్‌తో చూశావు. కాబట్టి విశ్లేషించి విమర్శించడానికైనా, ప్రశంసించడానికైనా నీకు మాత్రమే హక్కు ఉంది.

‘‘గొప్పగా ఊహించేవాడు, గొప్పగా బతకగలడు’’ అని కూడా అన్నాడాయన. గొప్పగా బతకడమంటే అన్నాన్నేను. ‘‘సాధించిన దానితో సంతృప్తి పడకపోవడం’’ అన్నారాయన. ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయ్యి, చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న విషయాలన్నీ మరిచి, ఆలోచనంతా ఆ వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత, ఫన్‌డేలో రామ్‌గోపాల్ వర్మని ఒకతను ఇలా అడిగాడు.

‘‘మిమ్మల్ని చాలా భయపెట్టిన సినిమా ఎగ్జారిస్ట్ అన్నారు. అందులో అంతగా భయపడే సన్నివేశాలేమీ లేవే?’’ అందుకాయన సమాధానంగా ‘‘భయపడటానికి ఇమాజినేషన్ ఉండాలి. అది మీకు లేదు’’ అని బదులిచ్చారు.

- జుజ్జూరి వేణు
30/01/2011
ఆదివారం అనుబందం నుండి...

Read More !

శ్రమే దైవం

అనంత మహర్షి వద్ద సుందరుడు, గుణనిధి అనే ఇద్దరు శిష్యులుండేవారు. ఓనాడు మహర్షి వారిద్దరినీ పిలిచి, ‘‘ఈనాటితో నావద్ద మీ శిష్యరికం పూర్తి అయ్యింది. మీరు అన్ని పరీక్షల్లో ఉత్తమంగా నిలిచారు. కాని, జ్ఞానం కన్నా అనుభవం, ఆచరణ గొప్పవి. అవి మిమ్మల్నే కాదు, సమాజాన్నీ ప్రభావితం చేస్తాయి. అందుకే మీరిద్దరూ చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామానికైనా వెళ్లి, ఆరు నెలలు నివసించి, తిరిగి ఆశ్రమానికి రండి. మీరు గ్రహించిన విషయాల్నిబట్టి, మీ శిక్షణ పూర్తి అయ్యిందో లేదో నిర్ణయిస్తాను’’ అన్నాడు.
గురువు ఆజ్ఞ ప్రకారం శిష్యులు బయలుదేరి వెళ్లారు.

సుందరుడు క్రిష్ణాపురం అనే గ్రామం చేరి, ఊరి మధ్యలో ఉన్న రావిచెట్టును నివాసంగా చేసుకుని, ప్రజల్ని తన ప్రవచనాలతో ప్రభావితం చేయసాగాడు. క్రమక్రమంగా అతని ఉపన్యాసాలకి ఆకర్షితులైన ప్రజలు ధ్యానమార్గంలో పయనిస్తూ, భక్తిభావాలు పెంపొందించుకుంటూ ఉన్నతంగా జీవించసాగారు.
గుణనిధి చేరిన చిత్రాపురం గ్రామంలోని ప్రజలు, వర్షాలు పడక, పంటలు పండక దారిద్య్రంతో బాధపడుతూ ఉన్నారు.

ఆ గ్రామస్తుల్లోని అనైక్యత కారణంగా ఒకరినొకరు నిందించుకుంటూ, అకారణంగా శత్రుత్వాలు పెంచుకుంటూ వైషమ్యాల్లో జీవించడం గుర్తించిన గుణనిధి, ముందుగా వారందరిలో ఐకమత్యాన్ని పెంపొందించటానికి కృషి చేశాడు.

ఆ ఊరి జమిందారును కలిసి, ఊరి మధ్యలో చెరువు తవ్వించడానికి ధనాన్ని ఇవ్వడానికి ఒప్పించాడు. ఓరోజు ప్రజల్ని సమావేశపరిచి, ‘‘మీరంతా ఒకే తాటిపై నిలిచి, సహకరిస్తే ఈ చెరువు నిర్మాణం పూర్తవుతుంది. అందరూ తలో చేయి వేసి, ఈ కార్యాన్ని పూర్తి చేస్తే, నీటి సమస్య పరిష్కారమవుతుంది’’ అన్నాడు.

ప్రజలంతా సరేనన్నారు. గుణనిధి నాయకత్వ స్ఫూర్తితో గ్రామస్థులందరూ కలిసి చెరువు తవ్వుకుని, నీటి ఎద్దడిని నివారించుకున్నారు.
ఆరు నెలల అనంతరం, శిష్యులిద్దరూ అనంతమహర్షిని కలిసి తమ అనుభవాలను వివరించాడు.
ఆయన ఆనందంతో ఉప్పొంగి పోయాడు.

‘‘సుందరుడు ప్రజల్ని ధర్మ మార్గంలో, గుణనిధి ప్రజల్ని శ్రమ మార్గంలో నడిపించారు. ఏ దేశానికైనా శ్రమ, ధర్మం రెండూ రెండు కళ్ల లాంటివి. అవి ఆచరించే ప్రజలు ఎప్పుడూ ఉన్నతంగా ఎదుగుతారు. నాయనలారా! ఈనాటితో మీ శిక్షణ పూర్తయ్యింది. ఇలాగే మానవాళికి ఉపయోగపడే విధంగా మీ మీ మార్గాల్లో పయనించండి’’ అంటూ శిష్యుల్ని ఆశీర్వదించారు.
- కె.వాసవదత్త రమణ
Read More !

28, జనవరి 2011, శుక్రవారం

ఇలాంటి తగాదా వస్తే?

చెరువులో పాములు పడినట్టు గభీమన్నాడు సోమయాజులు. ఉదయం పూట, ప్రశాంతంగా చెరువులో దిగి, స్నానం చేస్తూ, మరి కాసేపటిలో మైల అంటకుండా భోజనం చేద్దామనుకుం
టున్నవాడల్లా ఈ ఉదంతానికి కట్టెపేడులా నీళ్లపైకి తేలాడు. కోపంతో నీలుక్కుపోయాడు. ఆవేశంతో రాగిబిందెలా మారి
గభీమని మళ్లీ పెద్ద పెద్ద కెరటాలు వచ్చేలాగా నీళ్లల్లో మునిగి
అడావిడిగా ఒడ్డుకి చేరాడు.
అతడికి సంభవించిన ఉపద్రవం ఏమిటి?
దూరంగా ఒక ఇరవై ముప్పయి మంది మాదిగ వనితలు గట్టు మీద బిందెలు, కడవలు పట్టుకొని నీళ్ల కోసం నిలుచుని ఉన్నారు. నీళ్లు కావాలన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. వాళ్లు
చెరువులో దిగితే ఇంకేమైనా ఉందా?

ఇంతకుముందే చెరువులో ఒక కమ్మ స్ర్తీ నీళ్లు ముంచుకుపోయింది. యాజులుకి అభ్యంతరం అనిపించలేదు. ఒక వైశ్యుడు వచ్చి కాళ్లు కడుక్కున్నాడు. అడ్డంకి చెప్పేదానికి ఏమీ లేదు. చాకళ్లు దూరంగా రేవులో దిగి మాసిన బట్టల మూటలు విప్పారు. ఇది మామూలే. ఒక సాయెబుగారైతే యాజులు పక్కనే నీళ్లలోకి దిగి, యాజులుతో సమానంగా థుస్కు థుస్కుమని నీళ్లు పుక్కిలించి ఊశాడు. నోరెత్తడానికి లేదు. ఇక ఇతర కులాల వాళ్లు ఎప్పుడైనా చెరువులోకి దిగవచ్చు, అవసరమైనన్ని నీళ్లు ముంచుకోవచ్చు. కాని, మరీచోద్యంగా మాదిగ వనితలు దిగడం అంటే....
ఇటువంటి అఘాయిత్యం ఇంతకుముందెన్నడైనా ఉందా!
మీ చెరువు ఏమైంది? అడిగాడు యాజులు.
కుష్టు వెంకడు పడి చచ్చిపోయాడండీ... అన్నారు మాదిగ
వనితలు.

ఊరికి ఉన్నది ఒకటే పెద్ద చెరువు. అది మాదిగలది తప్ప తక్కిన అందరిదీ. మాదిగలు ఆ పెద్ద చెరువుపై ఆధారపడిన చిన్న చెరువు నీళ్లు తాగుతారు. ఇప్పుడు ఆ చిన్న చెరువు పనికి రాకుండా పోయింది కనుక మాదిగ వనితలు వేరే గతి లేక, పెద్ద చెరువుకు వచ్చి, ఎవరైనా ముంచి పోస్తే పోయించుకోవడానికన్నట్టుగా గట్టు మీద నిలుచుని ఉన్నారు. వేరెవరైనా పోస్తారు సరే, రోజూ వాళ్ల గాలి సోకడం ఎంత పాపం. వారి ముఖం చూడాల్సి రావడం ఎంత ఖర్మం. దీనిని సహిస్తారా ఎవరైనా?

ఆ రాత్రే యాజులు, కరణం, ఇతర పెద్ద కులాల పెద్దలు పంచాయితీ పెట్టారు. మాదిగ పెద్దల్ని పిలిపించారు. ఏం
జరుగుతుందో చూద్దామని ఊళ్లో ఉన్న సాయెబులు కూడా వచ్చారు. మాదిగలకు సాయెబుల మద్దతు. దేముడు కటాక్షించిన చెరువుకు కులం హేమ్టీ మతం హేమ్టీ పంతులు గారూ అని ఊరి పెద్దల్ని నిలదీశారు సాయెబులు. కాని కులపెద్దలు ఒప్పుకోలేదు. చాలా ఉపాయాలు చేశారు. చాలా మార్గాలు చూపారు. చాలా ప్రత్యామ్నాయాలు సూచించారు. అన్నింటి అర్థం ఒకటే- మాదిగలు చెరువులో మాత్రం దిగకూడదు.

మాదిగ పెద్దలు మౌనంగా తల ఒంచారు. కాని మాదిగల్లో కొత్త తరం ఒకటి వచ్చింది. ఈ మధ్య ఆ తరం
ఎందుకనో అసంతృప్తిగా ఉంటోంది. కిరస్తానీ మతంలోకి మారితే తమ బతుకులు మారతాయని వారిలో కొందరు కిరస్తానీ మతం తీసుకున్నారు. ఫాదరీలు వారికి ఇంగ్లీషు నేర్పారు. క్రాఫులు చేయించారు. వెట్టి నుంచి విముక్తం చేసి ప్యాంటూ షర్టూ వేసుకొనే యోగ్యుల్ని చేసి చిన్న చిన్న ఉద్యోగులుగానైనా మార్చగలిగారు. కాని, చాల్లేదు. ఇక్కడ వేలాదిఏళ్లుగా పాతుకొని పోయిన వ్యవస్థ కిరస్తానీలుగా మారిన మాదిగలను స్వీకరించలేదు. మాదిగలు కిరస్తానీలుగా మారినా సరే, వాళ్లు అంటరానివాళ్లే!

అందుకే- మాదిగ యువకుడు- విస్సన్నకు- కోపం వచ్చింది. తమను గాలికీ నీటికీ నిప్పుకీ దూరం చేసిన వర్ణవ్యవస్థ మీద చాలా కోపం వచ్చింది. దీని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలా?
ఇస్లాంలోకి మారితే? ముస్లింగా మారిపోతే? అప్పుడు తాను మాదిగ కాకుండా పోతాడు. అంటరానివాడు కాకుండా పోతాడు. వర్ణవ్యవస్థ చట్రంలో లేకుండా పోతాడు. అప్పుడిక తాను
స్వేచ్ఛాజీవి. సర్వస్వతంత్రుడు. పెద్దచెరువులోకి దిగకుండా తనను ఎవ్వరూ ఆపలేరు.
వెంటనే విస్సన్న- భార్యతో సహా మతం మారాడు. ఇస్మాయిల్‌గా మారిపోయాడు. ఇప్పుడు అతడి మతంలో చావు దగ్గర- పెళ్లి దగ్గర- మసీదు
దగ్గర- నమాజు దగ్గర- ఉచ్ఛం నీచం అంటూ ఏమీ లేదు. తాకరానిదీ తాకకూడనిదీ అంటూ ఏమీ లేదు. అతడు ప్రతి ముస్లింతో సమానం. ప్రతి హిందువుతోనూ సమానమే.
ఇంతకు మించి ఏమి కావాలి?

ఇస్మాయిల్ పొందిన స్వేచ్ఛను చూశాక మాదిగలందరూ ఊరి పెద్దలపై పెద్దస్థాయిలో తిరుగుబాటు చేశారు. తమ అంటరానితనాన్ని శాశ్వతంగా పీడ విరగడ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు ఉదయం- అగ్రహారంలోని పెద్ద కులాల వాళ్లందరూ చెరువులో దిగి స్నానాలు చేస్తూ ఉండగా ఊళ్లోని సాయెబులందరూ కరల్రు చేతబూని మాదిగలకు మద్దతుగా గట్టు మీద నిలబడ్డారు.
మరోవైపు మాదిగలు నిలబడ్డారు. ఇరుపక్షాలు ముందే నిశ్చయించుకున్నట్టుగా సంకేతాలిచ్చుకున్నారు. అల్లా హో అక్బర్ నినాదం ఒక్కసారిగా పిక్కటిల్లింది. మాదిగలంతా ఏక్‌దమ్మున ముస్లింలుగా మారిపోయారు. తరతరాలుగా తమను పీడిస్తున్న వేధిస్తున్న హీనపరుస్తున్న కాలరాస్తున్న అంటరానితనం కోరల నుంచి విముక్తం చెందారు. ఆ వెంటనే, ఏమాత్రం ఆలస్యం
చేయకుండా, పాముల్లాగా కాదు, ప్రాణమున్న మనుషుల్లాగా చెరువులోకి దభీమని దూకారు. సంతోషంగా దూకారు. చెరువును కావలించుకుంటూ సంబరంగా దూకారు.

చెరువు- ఆ వేళ- అందరినీ
తడిపినట్టే వారినీ సమానంగా తడిపింది.
కథ ముగిసింది.
మహా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తి 1932లో రాసిన- ఇలాంటి తవ్వాయి వస్తే- కథ ఇది.
మతాలని ఎవరూ ఆక్షేపించరు.
మతాలని ఎవరూ తప్పు అని చెప్పరు.
కాని మతాన్ని అడ్డుపెట్టుకొని కొందరిని పెమైట్టులో కొందరిని కింది మెట్టులో ఉంచడాన్ని మాత్రం ప్రతి ప్రవక్తా వేలెత్తి చూపాడు. ప్రతి కళాకారుడు రాళ్లెత్తి కొట్టాడు. ప్రతి రచయితా తన అక్షరాలతో ఆ దుర్మార్గాన్ని ఖండఖండాలుగా ఖండించాడు.
వైదికమతం తనలోని లోపాల వల్ల తన శ్రేణులకే ఎలా దూరం అవుతున్నదో అన్న ఆవేదనను శ్రీపాద ఈ కథలో వ్యక్తపరుస్తారు. మనిషిని మనిషి నుంచి వేరు చేసే కులం వద్దని శక్తిమంతంగా చూపుతారు.
****************************************************************************
త్వరలో ఈ కథకు వందేళ్లు నిండుతాయి.
అయినా సరే- ఇంకా- దళితుడన్న కారణంగా బట్టలూదీయించిన వైనం, దళితులన్న కారణంగా ఇళ్లు తగలబెట్టిన వైనం, దళితుడన్న కారణంగా మంత్రగాడన్న నెపంపెట్టి పళ్లు రాలగొట్టిన వైనం- అనే వార్తలు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి.
ఎందరు శ్రీపాదలు వస్తే ఇది పోతుంది?
ఇంకా ఎన్నాళ్లు గడిస్తే ఈ తగదా ముగుస్తుంది?

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తి: తెలుగు కథకుల కులదైవం. తెలుగు కథకు గర్వకారణం. తెలుగు కథలో ధ్రువతార. తన వందలాది కథల ద్వారా వచనం ద్వారా తెలుగు భాషకూ నుడికారానికీ ఎనలేని సేవ చేశారు. పాఠకుల హృదయాల ప్రక్షాళనకు దోహదపడ్డారు. స్వస్థలం తూ.గో.జిల్లా. 1961లో మృతి చెందారు. వీరి రచనలన్నీ విశాలాంధ్రలో అందుబాటులో ఉన్నాయి. 
 
శనివారం : 29/01/2011
సాక్షి ఫ్యామిలీ, ప్రతి రోజూ ఓ కథా పరిచయం నుండి...
Read More !

27, జనవరి 2011, గురువారం

ఒకరి రక్తం మరొకరికి క్షీరం

ఆయన ఇంటికి వచ్చేసరికి ఇల్లు కోపంగా ఉంది. మాటాపలుకూ లేనట్టుగా...
రుసరుసలాడుతున్నట్టుగా... బుసబుస పొంగుతున్నట్టుగా...
కూతురు ఎదురు వచ్చి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది.
తమ్ముడి ఉత్తరం ఏమైనా వచ్చిందా అమ్మా... అన్నాడాయన కాళ్లు కడుక్కుంటూ.
అవున్నాన్నా.. అందా అమ్మాయి.
ఆయనకు తెలుసు ఇల్లు కోపంగా ఉండేది అప్పుడే. తమ్ముడి ఉత్తరం వచ్చినప్పుడు. అందులో ఏముంటుందో అందరికీ తెలుసు. ఆమాట కొస్తే దానిని ఎవరూ చింపి చదవరు కూడా. ఎందుకు చింపడం? డబ్బు కోసమే కదా ఆ ఉత్తరం.
ఊళ్లో ఉంటాడు తమ్ముడు. వ్యవసాయం చేస్తాడు. కడప జిల్లాలో ఏదో ఒక మూల కాసింత పొలం... కాసింత సేద్యం... కాసిన్ని గింజలు... కాని అవి నోటికి అందేదాకా ప్రతిసారీ తిప్పలే. వానలు పడవు. నీళ్లు అందవు.
విత్తనాలు కల్తీ. ఎరువులు కల్తీ. పురుగు మందులు కల్తీ. ఒక్కోసారి తట్టుకుంటాడు. ఒక్కోసారి- అన్నయ్యా... కష్టంగా ఉంది... కాసిన్ని డబ్బులు పంపు... అని ఉత్తరం రాస్తాడు.

ఆ ఉత్తరం వచ్చిందంటే ఇంట్లో కోపం. భార్యకు కోపం. ఇక్కడ ఏం ముల్లె ఉందని వేలకు వేలు పంపుతున్నావు నీ తమ్ముడికి అని జగడం. అందుకే తమ్ముడి ఉత్తరం వచ్చినప్పుడు ఆయన ఇంట్లో దానిని చింపడు. ఏమీ మాట్లాడడు. వివరాలు ఎత్తడు. తమ్ముణ్ణి గుండెలకు హత్తుకున్నట్టుగా ఆ ఉత్తరాన్ని గుండె మీద జేబులో పెట్టుకొని
తిరుగుతూ ఉంటాడు.
ఉపాధ్యాయుడు ఆయన. రెండ్రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. ఇద్దరు పిల్లలు. బాగా చదివించుకున్నాడు. అబ్బాయి హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమ్మాయికి పెళ్లి చేయాలి. రిటైర్ అయితే బెనిఫిట్స్ వస్తాయి. పెన్షన్ వస్తుంది. రైతుకు- తన తమ్ముడికి- ఏమొస్తుంది?

చిన్నప్పుడు తండ్రి దగ్గర రెండు ఎద్దులుండేవి. అవి రెండూ సమానంగా కష్టపడితే పంట పండేది. తండ్రి తననూ తమ్ముణ్ణి సమానంగా కష్టపడనివ్వలేదు. తనని చదివించాడు. తమ్ముణ్ణి సేద్యంలో పెట్టాడు. అప్పటి నుంచి తమ్ముడు ఒక్కడే కాడిని భుజాన మోస్తూ కష్టపడ్డాడు. తాను ఊరికి ఎప్పుడైనా వెళ్లి ఇంగ్లీషు పేపర్ చదువుతూ కనిపిస్తే తమ్ముడు గర్వంగా నలుగురికీ చూపించుకొని సంబర పడతాడు. తన పిల్లలు వస్తే వాళ్లను గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాడు. తాను బాగుంటే వాడు బాగున్నట్టు. కాని వాడు నిజంగా బాగున్నట్టా?

భార్య బీరువా తీసి పదివేలు ఎంచి ఎవరికో ఇవ్వడం కనిపించింది. తాను ఎల్లుండి రిటైర్ అవుతున్న సందర్భంగా పెద్ద ఫంక్షన్ చేయాలట. అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలట. ఎంత ఖర్చయినా పర్వాలేదట. తల్లీ కొడుకూ కలిసి ఏర్పాట్లు చూస్తున్నారు. వృధా ఖర్చు. ఆ డబ్బు తమ్ముడికి పంపితే వాడికి ఎంత అక్కరకొస్తుందో కదా!
ఆయన గుండె తమ్ముడూ తమ్ముడూ అని కొట్టుకుంటూ ఉంది. కొట్టుకున్న
ప్రతిసారీ ఆ చప్పుడు జేబులో ఉన్న ఉత్తరాన్ని తాకుతూ ఉంది.
అన్నానికి కూచున్నాడు. తినబుద్ధి కాలేదు. తినకపోతే భార్యకు కోపం వస్తుంది. తిన్నట్టు నటిస్తున్నాడు. తాను అన్నం పెట్టాల్సిన తల్లిదండ్రులు ఊళ్లోనే ఉన్నారు. వాళ్ల బాధ్యతను తానేమీ తీసుకోలేదు. తమ్ముడికే
వదిలిపెట్టాడు. తమ్ముడి ఎదన అదో బరువు. తను మాత్రం ఇక్కడే చక్కగా పెళ్లాం బిడ్డలతో.
తమ్ముడూ... తమ్ముడూ... ఆయన హృదయం మొత్తుకుంటోంది.
లేచి చేయి కడుక్కున్నాడు. వరండాలోకి వచ్చి పడక్కుర్చీలో కూచున్నాడు. భార్య ఏదో పని మీద పక్కింటికి వెళ్లింది. కాసేపటి వరకూ రాదు. ఆయన- కూతురిని పిలిచి- దగ్గర కూచోబెట్టుకుని జేబులో నుంచి ఉత్తరం తీసి- కాస్త చదివి పెట్టమ్మా అన్నాడు. కూతురు చదివింది-

అన్నయ్యా. నువ్వు రిటైర్ అవుతున్నావని విన్నాను. ఇంత కాలం నువ్వు కష్టపడ్డావు. ఇక మీదైనా నీకు కాసింత విశ్రాంతి దొరికితే నాకదే సంతోషం. పంటల సంగతి పొలాల సంగతి ఎప్పటిలాగే ఉంది. చేతిలో డబ్బు ఆడటం లేదు. నీటి కరువుతో మన చింతతోపు ఎండిపోయేలా ఉంది. ఇంకొన్నాళ్లు గడిస్తే నిలువెండిపోతుంది. అందుకే దానిని అమ్మేశాను. యాభై వేలు వచ్చాయి. త్వరలో నీ భాగం పాతిక వేలు తెచ్చిస్తాను. అన్నయ్యా... టీచరుకు
రిటైర్మెంటు ఉండొచ్చు. కాని రైతుకు రిటైర్మెంట్ ఉండదు. కడవరకూ చేనులో నడుం వంచి పని చేసే వాడే ధన్యుడు. కాని మన ప్రాంతంలోని సేద్యం మనల్ని బతకనివ్వదూ చావనివ్వదూ కదా. ఉంటాను. నీ తమ్ముడు.
కూతురు ఉత్తరం ముగించేటప్పటికి ఆయన కళ్లు తడిసి ఉన్నాయి. తమ్ముడి సంగతి ఆయనకు తెలుసు.
అక్కరలేకుండా పూచికపుల్ల కూడా అమ్మడు. అలాంటిది తరాలుగా తమకు అంది వచ్చిన చింతతోపు అమ్మేశాడంటే ఎంత కష్టం వచ్చిందో. ఎంత బాధలో ఉన్నాడో. ఇంత బాధలో కూడా తన వాటా తనకు తెచ్చిస్తాడట.

ఈ ఉత్తరం చింపెయ్యమ్మా. అమ్మకు చూపించకు అన్నాడాయన.
ఎందుకు నాన్నా... అంది కూతురు.
నీకు తెలియదమ్మా. అమ్మకు తెలిస్తే మన వాటా పాతికవేలు కాకుండా పాతబాకీల కింద వాడి చేతిలో ఉన్న మిగిలిన డబ్బు కూడా ఇమ్మంటుంది. వద్దు. నాకు తెలిసి నా భార్యాపిల్లలకు నేనేమీ తక్కువ చేయలేదు. ఏ ఒక్క లోటూ రానివ్వలేదు. కాని వాడు నా రక్తం పంచుకుపుట్టినవాడమ్మా. నా తోబుట్టువు. వాడికి కూడా నన్నేమైనా సాయం చేయనీయమ్మా...
కూతురు తండ్రినే చూస్తుండిపోయింది.
ఏ పేగు కదిలిందో చిన్నాన్న కష్టం ఏమర్థమయ్యిందో ఓదార్పుగా తండ్రి భుజం మీద చేయి వేసి ఉత్తరం చింపేసింది.
కథ ముగిసింది.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన అర్ర్దమైన కథ- తమ్ముడి ఉత్తరం- ఇది.
ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు మన కోసం నిలబడతారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు తమ రక్తాన్ని కరిగించి మనకు క్షీరం తాగిస్తారు. ఇవాళ మనం ఎదిగిపోయి ఉండొచ్చు. పైస్థాయిలో నిలుచుని ఉండొచ్చు. గతంలో మన కుటుంబ సభ్యులు మనకోసం పడిన కష్టాన్ని మర్చిపోయినట్టుగా నటిస్తుండొచ్చు. కాని- మన ఒంట్లో ఉన్న వాళ్ల కష్టం, మన ఒంట్లో ప్రవహిస్తున్న వాళ్ల రక్తం ఊరికే ఉండనిస్తుందా? స్థిమితంగా
కూచోనిస్తుందా?
మరి- మీ కోసం కష్టపడిన మీ అన్నయ్య, తమ్ముడు, మేనమామ, చిన్నాన్న... వాళ్ల కోసం మీరేం
చేయబోతున్నారు?
సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి: రాయలసీమ నుంచి స్థిరంగా నిలకడగా కథారచన సాగిస్తున్న మంచి కథకుడు. రైతుజీవితాన్ని, స్ర్తీల సంక్షోభాలని కథలుగా మలచి గురితప్పని బాణాల్లా సంధించారు. ‘కొత్తదుప్పటి’, ‘బతుకుసేద్యం’ వీరి కథాసంపుటాలు. ఐదు నవలలు రాశారు. స్వస్థలం కడపజిల్లా. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఫోన్: 9441287865.
 
శుక్రవారం :28/01/2011
సాక్షి ఫ్యామిలీ, ప్రతి రోజూ ఓ కథా పరిచయం నుండి...
Read More !

26, జనవరి 2011, బుధవారం

తప్పని ప్లాస్టిక్ పూల జోక్యం

ఆ రోజు వాళ్ల పెళ్లిరోజు. అతడు ఆఫీసుకు లీవ్
పెట్టేశాడు. ఆమె రోజువారీ పనులను పక్కన పెట్టేసింది. అతడు తలస్నానం చేసి వీలున్నంతలో మంచి బట్టలు తీసి కట్టుకున్నాడు. ఆమె శ్రద్ధగా తయారై కంటికి కాటుక పెట్టుకొని ఆ కళ్ల నిండుగా అతణ్ణి చూసుకుంది.
మూడేళ్లయ్యింది వాళ్ల పెళ్లయ్యి. ఒక బాబు. చిన్న కుటుంబం వాళ్లది. రోజూ అతడు వెళ్లి ఉద్యోగం చేసి నెలకు ఎంతోకొంత తెస్తే ఆమె ఇంటద్దె కట్టి వెచ్చాలు తెచ్చుకొని ఊళ్లో ఉన్న అత్తామామలకు ఐదొందలో వెయ్యో పంపి మిగిలిన పైసా పైసా పొదుపు చేసి ఒకటో తేదీ వచ్చే నాటికి ఇబ్బంది రాకుండా చూస్తుంది.
మళ్లీ ఒకటో తారీకు. మళ్లీ అదే సర్దుబాటు.
పైకి అంతా బాగున్నట్టే ఉంది. నిజంగా అంతా బాగున్నట్టేనా?
అతడు- బాబును భుజాన వేసుకొని జోలపాడి నిద్ర పుచ్చాడు. ఆమె వంటిల్లు సర్ది వాకిట తలుపు వేసి కిటికీలకున్న కర్టెన్లు జరిపి అతడి దాపున కూచుంది.
మూడేళ్ల క్రితం ఇదే రాత్రి- అతడు తత్తరపడుతుంటే... ఆమె తబ్బిబ్బవుతుంటే... దిండు మీద సాంప్రదాయానికి చల్లిన మల్లెమొగ్గలు ముచ్చటగా చూస్తుంటే...

అదంతా గుర్తుకొచ్చింది వాళ్లిద్దరికి. అతడి పెదాలు నవ్వుతూ విచ్చుకున్నాయి. ఆమె బుగ్గల మీద సిగ్గు సింగారమై కదలాడింది. తాంబూలం నిండిన ఆమె పెదవులను అతడు చుంబించాడు. ఎదను దాటిన కోరిక ఆమె పవిటను బరువెక్కించింది. అతడు ఆమెను
అందుకున్నాడు. ఆమె అతడిలోకి ఒదిగిపోయింది.

భార్యాభర్తల నడుమ మరే అడ్డంకీ ఉండకూడని సమయమది. భార్యాభర్తల నడుమ మరే కృత్రిమత్వమూ చోటు చేసుకోకూడని
తరుణమది. భార్యభర్తల నడుమ మరే భయాలూ సందేహాలూ జాగురూకతలూ అప్రమత్తతలూ ఉండకూడని లిప్త అది. సంగమ లిప్త. దివ్యత్వపు లిప్త. ఆ లిప్తలో ఆమె కరుగుతుండగా మునుగుతుండగా మైమరపుతో నలుగుతుండగా....
అతడు ఆగాడు. హటాత్తుగా ఆగాడు. ఆగి, ఆమెను ఆపి, కోరికను ఆపి, ఆలింగనాన్ని ఆపి, తాపాన్ని ఆపి, ఆవేశాన్ని ఆపి, ఆపి?
వెళ్లి అల్మారా నుంచి చిన్న పాకెట్‌ను తెచ్చాడు. దానిని చింపి, లోపల ఉన్నది తీసి, వాళ్లిద్దరి మధ్య కృత్రిమత్వాన్ని తెచ్చి, అడ్డంకిని తెచ్చి...

ఆమెకు కోపం వచ్చింది. కంపరం వచ్చింది. ఎందుకో తెలియని ఆవేశం వచ్చింది.
ఛీ... ఎందుకండి ఇది... ఎందుకు... ఎందుకు? ఇలా భయపడుతూ బతకవలసిందేనా మనం? ప్రేమను నిరోధిస్తూ బతకవలసిందేనా మనం? అడ్డంకులు ఏర్పరుస్తూ బతకవలసిందేనా మనం? ఛీ.. ఛీ.. ఛీ... ఏమండీ.. ఇవాళ మన పెళ్లిరోజండీ. మనరోజు. ఈరోజు కూడా భయమేనా? ఈ రోజు కూడా
పిరికితనమేనా? ఈ రోజు కూడా మన మధ్య అడ్డంకేనా? ఏం
బతుకండీ ఇది. ఇలా బతక్కపోతే ఏమి? సర్దుకుని బతుకుతూ...
సర్దుకుని బతుకుతూ... జీవితాంతం సర్దుకొని బతుకుతూ...
ఆపై, పట్టలేక, ముఖాన్ని చేతుల్లో దాచుకొని ఏడ్చింది.
అతడు దెబ్బ తిన్నట్టుగా చూశాడు. నిస్సహాయంగా చూశాడు. చేతగానివాడిలా చూశాడు. తన దైన్యాన్ని ఎవరో ఎత్తి చూపినట్టుగా చూశాడు. చూసి, మోకాళ్ల మధ్య దిగులుగా చుబుకాన్ని ఉంచుకొని ఆమెనే చూస్తూ కూచున్నాడు.
ఆమె తేరుకుంది. భర్తను చూసింది. గాయపడ్డ కుందేలిని సాటి కుందేలు చూసినట్టుగా చూసింది. ఆమెలో ఏడ్వడం వల్ల వచ్చిన తెరిపి అయినా ఉంది. అతడిలో ఆ ధైర్యం కూడా లేదు.

అతడు అన్నాడు- నేను బీదవాణ్ణి. పేదవాణ్ణి. పిల్లల్ని పోషించుకోలేనేమోనన్న భయంతో ఉన్న పిరికివాణ్ణి. నాకు సెంటిమెంట్లు లేవు. అనుబంధాల ఊసు లేదు. భయంతో తల వొంచుకొని బతకడమే నాకు తెలుసు. ఇష్టాలను కోరికలను ఆశలను చంపుకొని బతకడమే తెలుసు.... యింతకు మించి నాకు మార్గం లేదు....
ఆమె ఏమీ మాట్లాడలేదు. దగ్గరకు జరిగి- క్షమించేసినట్టుగా అతడి చేతిని తాకింది.
ఎంత సుందరమైన రేయి ఇది. తమ జీవితంలో ఏడాదికి ఒకసారి వచ్చే రేయి. ఈ రేయిని అభాసుపాలు చేయడం ఆమెకు ఇష్టం లేదు.
ఆమె అతడి నుదుటి మీద ముద్దు పెట్టింది. ఎదలోకి తీసుకొని లాలించింది. అతడు చలించి, కదిలి, ఆమెను పెనవేసుకుంటూ ఉండగా- దేని కోసమో వెతుకుతున్నట్టుగా అటూ ఇటూ చూసి- ఇందాకటి పాకెట్‌ను వెతికి- అతడి చేతిలో పెట్టింది.
కథ ముగిసింది.
కిలో ఉల్లిపాయలు అరవై రూపాయలు. అల్లం వెల్లుల్లి కలిపి కొనాలంటే వంద రూపాయలు. అద్దె ఒకటి. కరెంటు బిల్లు ఒకటి.
మెయింటెనెన్స్ గొడవ ఒకటి. నీళ్లు అయిపోయాయని చీటికి మాటికి తెప్పించే ట్యాంకర్ల ఖర్చు ఒకటి. స్కూలు ఫీజు. ఆస్పత్రి పీడింపు.
ఊహించని ఉత్పాతాలు..
మనిషి వీటికి భయపడి కడుపు నిండా అన్నం తినడమే మానేస్తున్నాడు.
ఇక పిల్లల్ని ఏం కంటాడు?

కనకపోతే ఏమవుతుంది? ఏమో. మన లోలోపల ఉన్న జగాలకు తెలుస్తుంది ఆ వెలితి. మన అంగాంగాల్లో ఉండే చీమూ నెత్తురులకు తెలుస్తుంది ఆ నొప్పి. ఏ ధర్మం కోసం అవయవాలు జనించాయో ఆ ధర్మం నెరవేరకపోతే వాటికే తెలుస్తుంది ఆ నొప్పి.
విరజాజి తీగ నేను ఇన్ని పూలనే పూస్తాను అని లెక్కేసుకొని పూయదు. మందలోని గొర్రె నాకు పిల్లలు పుడితే నా గతేంకాను అని ఏడ్వదు. సముద్రంలోని చేప- గుడ్లు విడిచే క్షణాన వీటి భవిష్యత్తు ఏమిటో అని క్షణం సేపు కూడా బెంగటిల్లదు. వీధికుక్క నేను వీటికి అన్నం పెట్టగలనో లేదో అని హైరానాపడుతూ పిల్లల్ని పెట్టదు. అవి ప్రకృతి ధర్మానికి లోబడి ప్రవర్తిస్తున్నాయి. మనిషి మాత్రం- సుఖానికి సౌకర్యానికి లోబడి ప్రవర్తిస్తున్నాడు.
మనం ఇవాళ ఒక్క పిల్లాణ్ణే కనే స్థాయికి ఈ సమాజాన్ని తీసుకొచ్చాం.
ఇక మీదట అసలు పిల్లలే వద్దు అనుకునే స్థాయికి ఈ సమాజం వెళుతుంది.
అదే గనుక జరిగితే ఇక్కడ ఉండేది పిల్లాపాపలతో కళకళలాడే జగత్తు కాదు. సహారా.


కెఎన్‌వై పతంజలి: ఇంగ్లాండులో పుట్టి ఉంటే ఈసరికి ‘సర్’ గౌరవం దక్కి ఉండే రచయిత. అనూహ్యమైన ఊహాశిల్పి. అనుపమాన రచనా శక్తి కలిగినవారు. హాస్యం, వ్యంగ్యం, కత్తి అంచున జారే కన్నీరు ఈయన సాహిత్యంలో కనిపిస్తుంది. క్షత్రియుల జీవన సౌందర్యానికి తెలుగు సాహిత్యంలో సింహాసనం వేసి కూచోబెట్టారు. రాజుగోరు, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, వీరబొబ్బిలి... ప్రతి రచనా ప్రసిద్ధమే. స్వస్థలం విజయనగరం జిల్లా. 2009లో మృతి చెందారు.
 
గురువారం : 27/01/2011
సాక్షి ఫ్యామిలీ, ప్రతి రోజూ ఓ కథా పరిచయం నుండి...
 
Read More !

సావు కూడు


Read More !