ఒళ్లంతా మెత్తగా తగులుతోన్న సుతిమెత్తటి స్పర్శ. ఆ స్పర్శ వల్లనే కలవైపునించి మెలకువ వైపుకి వచ్చి ఉంటాను. చూస్తే కదులుతోన్న నా భార్య శరీరం. అప్పుడే లేచినట్టుంది.
రోజూ లేవగానే నాకో ముద్దుపెట్టడం ఆమెకి అలవాటు.
నా ఒంటిమీది దుప్పటి సరిగ్గా కప్పి, ఆమె మంచం దిగింది. నా చుట్టూ గిరికీలు కొడుతున్న నిద్ర పిట్ట, మళ్లీ నా రెప్పల మీద వాలింది.
మళ్లీ కమ్మటి కల...
చిన్నగా వీపు మీద తడుతోన్న స్పర్శకి మెలకువ వచ్చింది.
ఆమే. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. రాత్రంతా మంచుకి తడిసిన నందివర్ధనం పువ్వులా ఫ్రెష్‌గా, అందంగా ఉందామె. చేతిలో కాఫీ కప్పు.
నిద్రకీ, కాఫీకి పడదు. కాఫీ వాసనకీ ఎటో చక్కాపోయింది నిద్ర.
లేచి కూర్చుని కాఫీ తాగాను. అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్లేసరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయనుకోండి.
కమోడ్, టూల్ బ్రష్, టంగ్ క్లీనర్, షాంపూ, సబ్బు, రెండు బక్కెట్ల నీళ్లు, టవల్... అన్నీ వాడి బయటకొచ్చేసరికి మంచం మీద వేసుకునే డ్రెస్ సిద్ధం. డ్రెస్ చేసుకుని వచ్చేసరికి టిఫిన్ సిద్ధం. నాకన్నీ పద్ధతి ప్రకారం, టైమ్ ప్రకారం అమరిపోవాలి. లేకపోతే అసహనం నాకు.
ఆ అసహనాన్ని ఎవరూ భరించలేరని నాకు తెలుసు. నా భార్యక్కూడా తెలుసు కాబట్టే, ముందే ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఉంచిన కంప్యూటర్‌లా చకచకా చేసుకుపోతుంటుంది పనులు. టిఫినూ, కాఫీ కానిచ్చి పేపరు తిరగేసి, కాసేపు టీవీ చూసేసరికి ఆఫీసు టైమైంది. బైక్ మీద ఆఫీసు చేరేసరికి పది.
అయిదింటికి ఆఫీసునుంచి బయటకొచ్చేసరికి జోరుగా కురుస్తోన్న వర్షం. మొత్తం నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ఏక పాత్రాభినయం చేసి చూపిస్తోంది వాన.
బైక్ ఆఫీసులో పడేసి, వర్షంలో ఆటోలో ఇంటికి వెళ్లిపోవడం బెటర్. ఈ వెదర్ ఇలా ఉండగానే ఇంటికి పోయి, వేడివేడిగా పకోడీలో, మిరపకాయ బజ్జీలో చేయించుకుని తింటూ, వెచ్చటి కాఫీ తాగుతూ, హోమ్ థియేటర్లో మంచి సినిమా చూస్తూ ఉంటే... ఆ ఊహే ఎంతో బావుంది నాకు.
చినుక్కీ, చినుక్కీ మధ్య తడవకుండా వెళ్లిపోయే వాడంట నకులుడో ఎవరో. మనకా విద్య రాదు కాబట్టి నాలుగైదు చినుకులు ఆక్షింతల్లా నెత్తిమీద పడ్డాయి ఆటోలో ఎక్కేసరికి.
తాపీగా నడుస్తోన్న ఆటోలోకి, చల్లగా వీస్తోన్న గాలిని ఆస్వాదిస్తున్నాను. రోడ్డు మీద వాన సృష్టించిన అలజడి... జనంలో.
ఆటోవాడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నాడు. చూస్తే నా పక్కన ఒక అమ్మాయి. ఒకే ఒక సహ ప్రయాణికురాలు.
ఆటోవాడి పంచేంద్రియాల్లోనూ వాడి కళ్లొక్కటే రోడ్డుమీద. మిగతావన్నీ ఆ అమ్మాయి మీదే.
వాడి ప్రతి మాటలోనూ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్న తపన. ఆ అమ్మాయి మాటల్లో నీ తపనని నేను గుర్తించాను సుమా అన్న సూచన.
వాళ్లిద్దరి మధ్యా చకచకా నడచిపోతున్న సంభాషణ.
నాకు నవ్వొచ్చింది. ఉత్తి మామూలు నవ్వు కాదది. కాస్త వెటకారం మిళితమైన వంకర నవ్వు. కారణం, ఆ అమ్మాయి నల్లగా ఉంది. నలుపు కూడా కాదు. నల్లగా ఉండేవాళ్లు కూడా కొంతమంది బావుంటారు. ఆ నలుపులో కళ ఉంటుంది. ఈ అమ్మాయిలో అలాంటివేమీ లేవు.
అబ్బాయి కూడా అంతే. రోడ్డు క్లియర్‌గా ఉన్నప్పుడు మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆ అమ్మాయిని చూసి నవ్వుతుంటే మెరిసే పళ్లు, అంతకన్నా ఎక్కువగా మెరిసే కళ్లు తప్ప, అంతా కారు నలుపు.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఈ జంటే కాబోలు అనుకుంటుంటే మళ్లీ నవ్వొచ్చింది.
నలుపు మీద కామెడీ తీసే సినిమావాళ్లకి రాస్తే మంచి కామెడీ సీనవుతుందిది. ‘అమ్మ బ్రహ్మదేవుడో! కొంప ముంచినావురో. ఎంత గొప్ప సొగసురో. ఏడ దాచినావురో’ లాంటి పాటని పెడితే సీను బాగా పండుతుంది.
ఆలోచనలు ఒక పక్క ఇలా సాగిపోతుంటే మరోపక్క గిల్టీ ఫీలింగ్ లోలోపల్నించి తన్నుకొస్తోంది.
చాలా పురాతనమైన... ఊహూ! పరమ ప్రాచీనమైన వివక్ష. నల్లజాతి జెండా అమెరికా శ్వేతసౌధం మీద ఎగిరినా కూడా మనిషి మనసులోంచి పోని వర్ణ వివక్ష.
నిజానికి నలుపైతేనేం, తెలుపైతేనేం. తెల్లవాళ్లనేమీ కొరుక్కుని తినం కదా. అలా అనుకుంటుంటే నా భార్య గుర్తొచ్చింది. తను కూడా నాలాగే మంచి ఛాయ. ఆ రంగూ, రూపూ చూసే చేసుకున్నాన్నేను. ఆ రంగు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ, అంత అందగత్తె కదాని నిత్యం నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నానా?
కనీసం ఆమె ఒంటి రంగు రోజు మొత్తం మీద ఏ క్షణమైనా గుర్తొస్తుందా నాకు? ఇంకెందుకు పనికొస్తుందా రంగు? వర్ణాంధత్వంతో కళ్లు మూసుకుపోయి, తెలుపుని తప్ప నలుపుని గుర్తించలేని నాలాంటి వాళ్లతో నిండిపోయిన సమాజానికి ప్రదర్శించడానికి తప్ప.
- వెంకటేష్ పైడికొండల
05-12-10, సాక్షి, ఆదివారం అనుబంధం నుండి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి