"నా తమ్ముడు రవీంద్రకి నలభై ఏళ్లు. ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పను కానీ, నిన్ను చూశాక ... మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుందనిపిస్తోంది. ఇప్పటి కన్నా నీ జీవితం బావుంటుందే తప్ప దిగజారదని నేను గట్టిగా చెప్పగలను. మావాడి ఇంటికి ఒకసారి వచ్చి మంచీ చెడూ నువ్వే చూసుకో. ఆ తర్వాత నీ ఇష్టం''.
ఆవిడ మాటలు సూటిగానే కాదు, నిజాయితీగా కూడా అనిపించాయి ఈశ్వరికి.
రవీంద్రకి పదిహేనేళ్ల కొడుకున్నాడు. పేరు కృష్ణ. ఈశ్వరికి పదమూడేళ్ల కూతురు ... జాహ్నవి.
మేనత్తతో వేదవతితో కలిసే వెళ్లింది ఈశ్వరి. ఓ గంటో రెండు గంటలో కాదు. రవీంద్ర వాళ్లింట్లో రెండు రోజులు వుంది.
ఆ ఇల్లు, వాళ్ల జీవితం ఈశ్వరి ఊహించని లోకం. ఇంట్లోని వ్యక్తులందరికీ తలో కారు కాకుండా అదనపు అవసరాలకి మరో రెండు కార్లున్నాయి. అలాగే అదనపు సామాన్లు, పడక గదులు ... ఆ ఇంట్లో అంగుళం, అంగుళం ఐశ్వర్యం కనిపిస్తోంది. కేవలం డబ్బుకోసమని కాదుగానీ, రవీంద్ర చెప్పిన ఒకమాట ఎంతగానో నచ్చి ఈశ్వరి పెళ్లికి ఒప్పుకుంది.
"అసలు మళ్లీ పెళ్లి అన్న ఉద్దేశమే లేదు నాకు. కానీ వేదవతి అక్కయ్య ఒప్పించింది. ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ నా ఉద్దేశం మాత్రం నాలాంటి ... అంటే నాలా సంతానం వుండి భాగస్వామి లేని స్త్రీ అయితే ఇద్దరికీ నయం అనిపించింది. మీరు నాకు నచ్చారు. మనం ఒకళ్లకొకరం నచ్చటమే కాదు మన పిల్లలకీ మనం నచ్చాలి... ఆ తర్వాతే పెళ్లి ...'' అన్నాడు. అతనన్నట్టుగానే పిల్లలతో కలిసే, వారికి చెప్పే పెళ్లి చేసుకున్నారు. పిల్లలిద్దరికీ విషయం పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అలా అని అస్సలు అర్థం కాకపోవటం కూడా లేదు.
పెళ్లయిన పదిహేను రోజుల తర్వా త, ఓ వారంరోజులు పిల్లలిద్దరితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లివచ్చారు. అక్కడ మం చు, చలి కొత్తదనంతో పాటు, ఆప్యాయతగా వుండే తోడులోని వెచ్చదనపు కొత్తరుచి ఈశ్వరి అనుభవంలోకి వచ్చింది. ఆ వారం పూర్తయ్యేలోపే ఈశ్వరి రవీంద్ర కుటుంబానికి తనని తాను మానసికంగా పూర్తిగా అర్పించుకుంది.
రవీంద్ర కుటుంబంలో అన్ని రకాల పనులకి పనివాళ్లు వున్నారు. ఈశ్వరి ప్రత్యేకంగా చెయ్యాల్సిన పనులేం లేవు. అలా అని, చెయ్యాలనుకుంటే పనులకేం లోటులేదు. ఇంటి వ్యవహారాలు, కొన్ని వ్యాపారపు పనులు ఈశ్వరి ఇష్టంగానే కల్పించుకుంది. కుటుంబంలో మంచిస్థానం, అధికారం, ఆర్థికబలం, పై వర్గపు జీవిత సుఖం ... ఇవన్నీ వచ్చాక ఈశ్వరి ఒక కొత్త ఉత్సాహంలా మారింది.
కృష్ణ ఎప్పట్నించో రెసిడెన్షియల్ స్కూల్లో వున్నాడు. ఇప్పుడు జాహ్నవిని కూడా మరో రెసిడెన్షియల్‌లో చేర్చారు.
పరిస్థితులు బావుంటే చేసే పనులు కూడా ఉత్సాహంగా వుంటాయి. కుటుంబంలోని అందరికీ ఈశ్వరి, ఈశ్వరి పను లూ అనుకూలంగా వున్నాయి. ముఖ్యంగా కృష్ణ విషయంలో ఆమె చూపించే శ్రద్ధ అందరికీ అపురూపంగా వుంది. రవీంద్ర విషయం చెప్పనే అక్కర్లేదు. కొంచెం తీరుబడిగా కూర్చున్నప్పుడూ, గతం గుర్తొచ్చినప్పుడూ, ఈశ్వరికి ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు ఇంత ధైర్యం ఉండేది కాదు. జాహ్నవి తండ్రి పోయినప్పుడు కూతురు తనతోటే వుంటుందని బంధువులతో గట్టిగా చెప్పటానికి జంకింది. అత్తింటివేపు దగ్గరి బంధువులు ఎవ్వరూ లేరు. దూరపు బంధువులు అవకాశం చూసుకుని పెత్తనం చెయ్యాలనుకున్నారు. అయ్యో భర్త పోయాడే, కూతురు భవిష్యత్తేమిటన్న దిగులులో ఆమె వుంటుందన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. సొంతిల్లుంది. తల్లీ కూతురు వుంటే ఏదో చాకిరీ అప్పచెప్పొచ్చు. ఎప్పటికైనా ఇల్లు స్వాధీనం చేసుకోవచ్చన్న ఆలోచనే అందరిదీ.
చివరికి ఎలాగైతేనేం కూతురి మీద, తన మీద మరెవ్వరి నీడ పడకుండా జాగ్రత్త పడగలిగింది ఈశ్వరి. ఇప్పుడున్న ధైర్యం అప్పుడుంటే అసలు జంకేది కాదేమో ... ఏ పరిస్థితినైనా ఎదిరించగల ధైర్యం దానంతట అదే తనకి వచ్చేసినట్టుంది. బతుకు సజావుగా వుండటమంటే ఇదే కాబోలు. చీరలు, నగలు ఏమైనా కావాలంటే కొనుక్కోమని నాలుగైదుసార్లు అన్నాడు రవీంద్ర. వద్దంది ఈశ్వరి. పెళ్లికి రవీంద్ర, అతని ఇంటివాళ్లు కొన్నవే చాలా వున్నాయి. నాలుగు చీరలతో సర్దుకోటం అలవాటున్న ఈశ్వరికి ఇంకేం కావాలనిపించలేదు. ఇంట్లో దేనికీ లోటు లేదు. ఈశ్వరి ఆ ఇంటికి వచ్చేటప్పటికే ఆమె కోసం ఒక కారు, డ్రైవరు సిద్ధంగా ఉన్నాయి. ఆమె బేంక్ ఎకౌంటులో డబ్బులోటు లేకుండా చూస్తున్నాడు రవీంద్ర. అన్నిటికీ మించి ఎవరూ దేనికీ ఏమీ అనని స్వతంత్రం వుంది.
తాను కల్పించుకుని చేస్తున్న వ్యాపారపు పనులు రాను రాను మరింత ఆసక్తిగా వున్నాయి ఈశ్వరికి. ఖాళీ లేకుండా పని చెయ్యటంలో రుచి తెలుస్తోంది. తన శక్తి పూర్తిగా ఉపయోగపడటంలో ఎవరికైనా ఓ చిత్రమైన తృప్తి ఉంటుంది.
ఆ రోజూ ఎప్పట్లానే ఉత్సాహంగా తయారవుతోంది ఈశ్వరి ... ఆ సమయంలో వచ్చిన ఫోన్ ఒక్క క్షణంలో అంతా తల్లకిందులు చేసింది. వెంటనే కారులో ప్రయాణమైంది. తట్టుకోలేనంత కంగారు ... జాహ్నవి ఎలా వుందోనన్న బెంగ. డ్రైవర్ ఎంతో స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నా, మరింతగా తొందరపెట్టింది.
అర్జెంటుగా రమ్మనమని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి క్లుప్తంగా వివరాలు చెప్పింది.
జాహ్నవి తల్లిలాగే ఎత్తరి - పదమూడేళ్ల వయసుకి మించి కనిపిస్తుంది. ఆ కుర్రాడెవరో తెలియదు. పిల్లని ఏం చేశాడో తెలియదు. జాహ్నవి పూర్తిగా భయపడిపోయి పిచ్చిచూపులు చూస్తూ ఏడుస్తోందని ప్రిన్సిపాల్ చెప్పింది. ఎంతగా అడిగినా అంతకు మించి వివరాలేం చెప్పలేదు.
క్షణమొక యుగంలా వుంది. మనసు పరిపరి విధాల పోతోంది. ఆతృతగా కిలోమీటర్లని లెక్కపెడుతూనే వుంది ఈశ్వరి. ఇక పది కిలోమీటర్ల దూరంలో స్కూలు వుందనగా ఈశ్వరి సెల్ మోగింది - రవీంద్ర ఫోన్.
"కృష్ణ ఇంటికి వస్తానని ఫోన్ చేశాడు. ఎల్లుండి మా నాన్నగారి బర్త్‌డే కదా ... వెళ్లి తీసుకురా ...'' నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని ... "నేను వెళ్లలేనండీ ... జాహ్నవి దగ్గరికి వచ్చాను ...'' అంది. రవీంద్ర మరో మాట లేకుండా ఫోన్ కట్ చేశాడు.
ఉన్న కంగారుకి తోడు ఇది మరో ఒత్తిడి.
ఈశ్వరి వెళ్లిన తర్వాత జాహ్నవి కొద్దిగా కోలుకుంది. కూతుర్ని తరచి తరచి వివరాలడిగింది. ప్రమాదమేం జరగలేదు కానీ, జాహ్నవి బాగా భయపడిపోయింది. స్కూలు గార్డెన్‌లో తిరుగుతూ ఉండగా కాంపౌండ్ గోడ దూకి వచ్చి ఒక కుర్రాడు ఆకస్మాత్తుగా మీద పడ్డాడు. జాహ్నవి కేకలు పెట్టటంతో పారిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ వచ్చే లోపే ఇదంతా జరిగిపోయింది. జరిగిన దానికి ప్రిన్సిపాల్ ఎంతగానో బాధపడింది.
ఎనిమిది ప్రాంతంలో రవి హడావిడిగా వచ్చాడు. "నిన్న ఏం జరిగిందంటే ...'' అని ఈశ్వరి వివరాలు చెప్పబోయింది. "అవన్నీ తర్వాత ... నేను అరగంటలో అర్జెంటుగా వెళ్లాలి. నిన్న నానా యాతన అయింది. కృష్ణని తీసుకురావటానికి ఎరేంజ్ చెయ్యటం పెద్ద తలనొప్పి అయింది. అయినా జాహ్నవి దగ్గరికి వెడుతున్నానని చెప్పకుండా వెళ్లటమేమిటి?'' అన్నాడు విసుగ్గా. ఆ విసుగు ఆ రకంగా రవీంద్ర దగ్గర ఈశ్వరికి కొత్త. ఒక్క దెబ్బతో రెండు రెక్కలూ విరిగిపోయినట్టు విలవిలలాడింది ఈశ్వరి. మరో మాటకి అవకాశం లేకుండా రవీంద్ర అరగంటలో వెళ్లిపోయాడు.
***
రాత్రి పదకొండు దాటింది. ఈశ్వరి ఎదురు చూస్తూనే వుంది. రవీంద్ర దగ్గర నుంచి ఫోన్ లేదు. ఈశ్వరికీ చెయ్యాలనిపించలేదు. జాహ్నవి తాలూకు దిగులుతో పాటు, రవీంద్ర దగ్గర తన స్థితి ఇలా అయిందేమిటన్న ఆందోళన. తను తట్టుకోలేనిదేదో జరిగినట్టుంది ఈశ్వరికి. తన నమ్మకం మీద అపనమ్మకం కలిగింది. దేన్నో ఎవరినో ప్రత్యేకించి నిందించటం కాదు కానీ బాధ స్పష్టంగా గుండెల్ని పిండుతోంది. రవీంద్రతో మాట్లాడితేనే గానీ తగ్గని బాధ.
మరో అరగంటకి వచ్చాడు రవీంద్ర. అతన్ని కొంచెం స్థిమితపడనిచ్చి "జాహ్నవి దగ్గరికి అకస్మాత్తుగా ఎందుకు వెళ్లానో, అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. మీ ఒత్తిడి ఏమిటో చెప్పలేదు. కానీ చాలా కేజువల్‌గా జాహ్నవి దగ్గరికి చెప్పకుండా వెళ్లటం ఏమిటన్నారు ...'' ఓ క్షణం ఆగింది.
ఈశ్వరి గొంతులో మార్దవం లేదు. అటువంటి గొంతు రవికి కొత్తగా వుంది. ఆశ్చర్యంగా చూశాడు ...
"కృష్ణ దగ్గరికి మీకు చెప్పకుండా ఎన్నోసార్లు వెళ్లాను. అప్పుడు ఎప్పుడూ చెప్పకుండా ఎందుకు వెళ్లావు అనలేదు. కాని జాహ్నవి దగ్గరికి వెళ్లిన ప్రతిసారీ మీకు చెప్పే వెళ్లాను. ఈ ఒక్కసారి తప్ప. మీకు చాలా వ్యాపకాలున్నాయి. బాధ్యతలున్నాయి. కానీ నాకున్న ఒకే ఒక్క వ్యక్తిగత బాధ్యత జాహ్నవి''.
ఈశ్వరి మాటలు స్పష్టంగా ధ్వనించాయి. ఆమె గొంతులో తల్లితనపు నిబ్బరం తెలుస్తోంది.
మరి కాసేపటికి రవీంద్రే, నిన్నటి రోజు ఆఫీసులో తను ఎదుర్కోవాల్సి వచ్చిన ఒత్తిడి గురించి చెప్పాడు. ఆ హడావిడిలో కృష్ణని తీసుకురావటానికి ఏర్పాట్లు చెయ్యటం ఎంత చికాకు కలిగించిందో చెప్పాడు.
అంతా ఓపిగ్గా విన్న ఈశ్వరి ఏం మాట్లాడలేదు. మౌనంగా అక్కడ్నించి వెళ్లిపోయి జాహ్నవి దగ్గర పడుకుంది. నిన్నటి కన్నా జాహ్నవి పరిస్థితి కొంచెం మెరుగు. ఈ పిల్ల విషయం ఏం చెయ్యాలి? సంవత్సరం మధ్యలో వేరే స్కూల్లో ఎడ్మిషన్ దొరుకుతుందా? రవీంద్రతో ఇకముందు ఎలా వుంటుంది? తను చెప్పింది అతనికి అర్థమైందా? జాహ్నవిని మించిన ప్రాముఖ్యత తనకి మరొకటి లేదని అతను గ్రహిస్తే ... ఆ తర్వాత పరిస్థితులేమిటి? ఘర్షణలు ఎదుర్కోవాల్సి వస్తుందా? మళ్లీ తన జీవితం పూర్వ స్థితికి చేరుతుందా? తన బాధ సరే ... తమ జీవితాలకి ఇన్ని చేసిన, చేస్తున్న రవీంద్ర పరిస్థితి ఏమిటి ... కృష్ణ పరిస్థితి ఏమిటి?
ఎన్నో ఆలోచనలు ... అయినా ఒక్కటే ధైర్యం ... ఒక్కటే నిర్ణయం ... జాహ్నవి తర్వాతే ఏదైనా. కలత కలతగానే గడిచింది ఆ రాత్రి ఈశ్వరికి ...
***
నాలుగు రోజులు గడిచాయి. రవీంద్ర, ఈశ్వరి పరస్పరం మాట్లాడుకుంటున్నా మధ్యలో ఏదో అడ్డు వున్నట్టే వుంది. ఎంతో హాయిగా వున్న జీవితం మసకబారినట్టు తయారైంది.
ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తున్నా ఏమిటో ఎబ్బెట్టుగా వుంది.
ఆ రోజు రాత్రి పది దాటాక ... "ఈశ్వరీ ...'' అని పిలిచాడు రవీంద్ర. ఏమిటన్నట్టు చూసింది.
"మనం ఎంత తెలివైన వాళ్లం అనుకున్నా, ఎంత సబబుగా ప్రవర్తిస్తున్నామనుకున్నా, కొన్ని విషయాలు మన ఆలోచన వరకూ కూడా రావేమో ... కారణం ఏమిటన్నది కాదు ... నువ్వన్నదీ నిజమే ... కృష్ణ విషయంలో రాని ప్రశ్న జాహ్నవి విషయంలోనూ రాకూడదు. పిల్లలిద్దరూ వేరు వేరు కాదు. ఐయామ్ సారీ ... ఇక్కడే గౌతమి స్కూల్లో జాహ్నవికి ఎడ్మిషన్ తీసుకున్నాను. రేపే వెళ్లి జాయిన్ చేద్దాం ...'' అన్నాడు.
ఈశ్వరి ఏదో చెప్పబోయింది. రవీంద్రతో హాయిగా వున్న తమ జీవితం గురించి ... నచ్చిన అతని పద్దతుల గురించి ... జాహ్నవి విషయంలో తను పడిన కంగారుతోపాటు అతని ఆ మాటలకి కలిగిన ఆవేశం గురించి చెప్పబోయింది ... కానీ అవి మాటలుగా మారలేదు.
స్థిమితపడి, ఊరట చెందాక ఈశ్వరి చూపు మారింది. గొంతూ మారింది. నవ్వుతూ రవీంద్ర చెయ్యి అందుకుంది. ఆ స్పర్శలో తల్లితనం రవీంద్రకి మరోసారి అనుభవంలోకి వచ్చింది.
...............................................
రచయిత సెల్ నెం: 093947 ౩౮౮౦౫
ఆంధ్రజ్యోతి, 28-11-2010, ఆదివారం అనుబందం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి