స్తంభం మీద గాలిపటం ఒకటి చిక్కుకు పోయింది. గాలి వీచినప్పుడల్లా ఎగరాలని ప్రయత్నిస్తోంది. చాలా సేపట్నుంచి సుమ దాన్నే చూస్తోంది. నిన్న లేదు. ఎప్పుడొచ్చి చిక్కుకుందో తెలీదు.
పగటి ఎండ ఇప్పుడిప్పుడే వేడిమిని పుంజుకుంటోంది. ఆ వేడికి గది చుట్టూ ఇటుకల కొలిమి పెట్టినట్టయింది. ఆ కాక భరించలేక వచ్చి వాకిట్లో చతికిలబడింది సుమ. బైటకొచ్చి కూర్చుని పదినిమిషాలు కాలేదు, ముంచుకొచ్చింది దగ్గుతెర. దగ్గి దగ్గి కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. పైట చెంగుతో కళ్లొత్తుకుని మెడ పైకెత్తి చూసింది.
చుట్టూ నిర్మాణంలో వున్న ఆకాశ హర్మ్యాలు. సగంలో ఆగిపోయినవి కొన్ని. తప్పదన్నట్టు అనాసక్తంగా నెమ్మదిగా పని జరుగుతున్నవి కొన్ని. సిటీ బయట పల్లెలా పచ్చగా ప్రశాంతంగా వుండే కాలనీ మొత్తం ధూళిమయమైపోయింది.
కాలనీలో తాముంటున్న ఇల్లొక్కటే పాతది. ఓనరు ఎక్కడో విదేశాల్లో వుండి పట్టించుకోక ఇదిలా వుండిపోయింది. అతని తాలూకు బంధువునని నెలకోసారి ఒక బట్టతల మీసాలాయన అద్దెకోసం వస్తుంటాడు. అవతలి పక్క గది, వాకిలి వాడుకుంటున్న తాపీ పనివాళ్లు అద్దె కరెక్టుగా ఇచ్చేస్తారు. అతనొచ్చే వేళకి కరుణ ఎప్పుడూ ఇంట్లో వుండడు. సుమ దగ్గర డబ్బులుండవు. అతను తాపీ పనివాళ్ల్ల వంటామె సుబ్బమ్మతో కాస్సేపు కబుర్లు చెప్పి, వెళ్లేటప్పుడు "అడుక్కు తినే వాడికి అరెసెల్తో భోజనం పెట్టినట్టు ఆడి బాబు చూడు ఆడికెలాంటి పేరెట్టాడో కరుణామూర్తంట. అడుక్కుతినే మూర్తి'' అని సాగదీసి తిట్టుకుంటూ వెళ్తాడు. మొదట్లో సుమకి చాలా కోపం వచ్చేది. పోగా పోగా ఆ కోపం స్థానాన్ని దైన్యం ఆవరించుకుంది. అప్పుడప్పుడూ తామిచ్చే వంద, నూటేభై పుచ్చుకుని ఖాళీ చేసి పొమ్మని అననందుకు ఇప్పుడు అతనే నిజమైన కరుణామూర్తి అనుకుంటోంది.
సుమ పాలిటి మరో కరుణామూర్తి సుబ్బమ్మ. పాతికమంది పనివాళ్లకి వండే గుండిగలో మరో దోసెడు బియ్యం పోసి వీళ్ల కడుపులూ నింపుతుంది. ఈ మధ్య బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయిందని ఏ పూట కాపూటే కొని తెచ్చి ఇస్తున్నారట. అన్నం మిగిలిన రోజు మిగుల్తుంది, లేని రోజు లేదు.
గాలికి కొట్టుకొచ్చిన ఎండుటాకులా సంధ్యవాలే సమయానికి కరుణ వేళ్లాడిపోతూ వచ్చాడు. వాకిట్లో చాప మీద చతికిలబడి సుమ గ్లాసుతో నీళ్లు తెచ్చిచ్చేవరకూ ఆగలేక వెనక్కి వాలిపోయాడు. సుమ వచ్చేసరికి అతను కరెంటు స్తంభం మీది గాలిపటాన్ని చూస్తున్నాడు. నీళ్లు తెచ్చిన సుమ రెండు నిమిషాలు అతన్నే చూస్తూ ఉండిపోయింది. మాసిన గడ్డం, లోపలికి పోయిన చెంపలు, ఆర్చుకుపోయిన కాలర్ బోన్స్, ఉతికి ఉతికి బూడిద రంగు తేలిన బట్టలు. ఎలాంటి వాడు ఎలాగైపోయాడు! అందంగా మెరిసిపోయే కరుణ తెరపైన హీరోగా కనపడాలనే కలల్తో ఉన్న ఊరినీ, అయిన వాళ్లనీ విడిచిపెట్టి నగరానికొచ్చి పడ్డాడు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దగ్గరున్న తమ చిన్న పల్లెటూరు గుర్తుకొచ్చి ఆ పచ్చదనానికి దూరమైపోయినందుకు పశ్చాత్తాపంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి సుమకి.
తెలిసీ తెలీని ఇంటర్మీడియట్ రోజులు. లోకమంతా అందం, ఆనందం వెల్లువెత్తుతున్నట్టు కన్పించేది. ఆర్థికపరమైన తమ అవసరాలు అడగక ముందే తీరుస్తున్న పెద్దవాళ్ల కారణంగా తాము ఆనందంగా జీవిస్తున్నామనే సంగతి తెలీని అమాయకత్వం. ఎక్కడున్నా ఎలా ఉన్నా అంతే ఆనందంగా జీవించగలమనే మూర్ఖపు నమ్మకం.
పంపా రిజర్వాయరు దగ్గర అన్నవరం కొండపైన జరుగుతున్న సినిమా షూటింగ్ చూడ్డానికి కాలేజ్ ఎగ్గొట్టి రోజూ వెళ్లేటప్పుడు తెలీదు తమ ఇద్దరి జీవితాల్ని ఆ షూటింగ్ ఇంత మలుపు తిప్పుతుందని. పరీక్షలు దగ్గరకొస్తున్నా లెక్క చెయ్యకుండా సినిమా వాళ్లకి అవీ ఇవీ అందిస్తూ అక్కడే ఉండిపోయేవాడు కరుణ. వాళ్లతో పెంచుకున్న పరిచయం వల్ల ఒక్క నిమిషం తెరపైన కన్పించే పాత్ర ఒకటి దొరికింది. ఆ సినిమా రిలీజైన రోజున ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టాల్సిన తమ ఇద్దరి డబ్బుల్తో స్నేహితులందర్నీ తీసుకెళ్లి సినిమా చూపించాడు. ఫోన్ చేస్తే అప్పటి అసిస్టెంట్ డైరెక్టరు "నువ్వు స్క్రీన్ మీద బలే అందంగా కన్పించావయ్యా, ఫీల్డుకి కొత్త హీరోల అవసరం బోల్డంతుంది. వచ్చెయ్'' అన్నాడట. అప్పటికే తమ ఇద్దరి మధ్యా చిన్న చిన్న ఉత్తరాలు ఇచ్చుకోవడం లాంటి ప్రేమాయణం నడుస్తోంది. కరుణ తనతో సంప్రదించినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా అతన్తో వస్తాననేసింది.
హోరున కురుస్తున్న వర్షపు రాత్రి తండ్రి వ్యవసాయపు పనుల కోసం తెచ్చిపెట్టుకున్న డబ్బుతో కరుణ, ఒంటిమీద నగానట్రాతో సుమ సామర్లకోట వెళ్లి హైదరాబాదు బండెక్కేసారు. తీరా ఇక్కడికొస్తే పట్టించుకునే నాథుడే లేడు. కరుణ తెచ్చిన డబ్బు, సుమ వొంటి మీద నగలు కరిగిపోడానికెంతో సమయం పట్టలేదు.
డబ్బుతో బాటు ధైర్యం కూడా కరిగిపోయాక ఇంటికి ఫోన్ చేస్తే సుమ ఇంటి వాళ్లు ఊళ్లో అడుగుపెడితే చంపేస్తామన్నారు. కరుణ తండ్రి బడుగు రైతు. అతన్ని నమ్ముకుని ఊరు వెళ్లలేక అలవికాని పరిస్థితుల మధ్య ఇక్కడే ఉండిపోయారు.
"ఏంటలా నిలబడి పోయావు. నీళ్లివ్వవా'' అంటున్నాడు కరుణ జాలిగా నవ్వుతూ.
క్షణాల్లో సంధ్య వెడలి చీకట్లు ముసురుకున్నాయి. చుట్టూ ఉన్న భవంతుల్లో లైట్లు వెలిగాయి. కరుణ కాళ్ల దగ్గర చతికిల పడింది సుమ. లేచి అటు తిరిగి సుమ వొళ్లో తల పెట్టుకున్నాడు కరుణ. అతని జుట్టులో చేతిని జొనిపి నిమురుతూ ఉండిపోయింది సుమ. ఏ ఎండన పడి తిరిగాడో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు కరుణ. కరెంటు స్తంభం మీది గాలిపటం చీకట్లో కన్పించడం లేదు కానీ, దాని రెపరెపలు మాత్రం విన్పిస్తున్నాయి. ఉదయం నుంచి సుమకి మళ్లీ కడుపులో ఏదోగా తెములుతున్నట్టుంది. ఎంత జాగ్రత్తపడినా ఎలా తగులుకుందో ఈ పీడ! క్రితంసారి సుబ్బమ్మ అన్నట్టు 'తాను దూర కంతలేదు మెడకో డోలా'. బలహీనంగా పుట్టిన పాపాయిని బతికించుకోవాలని తాపీపని వాళ్లని బతిమలాడి పని సంపాదించాడు కరుణ. కాని, రెండు రోజులు పనికెళ్తే నాలుగు రోజులు పడకేసేవాడు.
"ఈ సదువులొచ్చాక నాజూకు తేలిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు కుర్రనా కొడుకులు. పల్లెటూళ్లో పుట్టినోడు ఎంత చేవగా ఉండాల? అమ్మా బాబూ ఏ గడ్డి కరిసినా ఈళ్లు మాత్రం ఇడ్డిన్లు తిని, కాపీలు తాగి పెరుగుతారు. బతుకంటే సినిమా తెర మీద గెంతులనుకుంటన్నారు. పనికిమాలిన్నా కొడుకులు'' అంటూ ఒకరోజు ఆపకుండా తిట్టిపోసింది సుబ్బమ్మ. పాపాయి పోయాక మళ్లీ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు కరుణ.
ఈ రోజు అన్నం మిగల్లేదల్లే ఉంది. సుబ్బమ్మ గిన్నెలు కడుగుతున్న చప్పుడు విన్పిస్తోంది. మధ్యాహ్నం తినబుద్ధిగాక సుబ్బమ్మ ఇచ్చిన అన్నం, చారు అలాగే ఉంచేసింది. లేచివెళ్లి అన్నంలో చారు వొంపుకొచ్చింది. పలుకు మీద వార్చిన కొత్త బియ్యపన్నం ఆరిపోయి మేకుల్లా తగుల్తోంది చేతికి. కరుణని లేపి నాల్గు ముద్దలు తిన్పించి, తనో రెండు ముద్దలు తిన్నానన్పించి కడుపునిండా నీళ్లు తాగింది. అతనికో చెంబుతో నీళ్లిచ్చింది.
మర్నాడు అతను బైటకెళ్లేక సుబ్బమ్మను వెంటబెట్టుకుని పబ్లిక్ హెల్త్ సెంటరుకు వెళ్లింది సుమ. యూరిన్‌టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అబార్షన్ చేయించుకుంటానంటే డాక్టరు తిట్టిపోసింది. "ఇంత బలహీనంగా ఉన్నావు. ముందే జాగ్రత్త తీసుకోవడం తెలీదా?'' అంటూ. సుమ అభావంగా ఉండిపోయింది. "సర్లే, రేపురా'' అంది డాక్టరు కొంత చల్లబడి.
ఆ రాత్రి "ఈ బిడ్డనైనా దక్కించుకుందామా మన ఊరెళ్లిపోయి'' ఒక చిన్న ఆశతో అడిగింది.
"మీ వాళ్లు?'' అన్నాడు కరుణ.
"మా వాళ్లు మనల్ని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు''.
చాలాసేపు మౌనం తర్వాత "చిరంజీవిగారు సినిమా ఛాన్స్ కోసం ఎంతకాలం నిరీక్షించేరో తెలుసా?'' అన్నాడు.
'ఇంకా ఈ పిచ్చి వదల్లేదు' అనుకుంది సుమ. 'అసలు ఈ జీవితానికి వదుల్తుందా?'
"షూటింగ్స్ దగ్గర వాళ్లు పెట్టిందేదో తిని కడుపు నింపుకుంటున్నాను. సుబ్బమ్మగారు పెట్టింది నా కోసం దాచిపెట్టి నువ్వు కడుపు మాడ్చుకోకు'' అన్నాడు.
కరెంటు స్తంభం మీది గాలిపటం గాలిలేక అణకువగా తీగల్ని కౌగిలించుకొని ఉంది. తోక మాత్రం కిందికి వేలాడుతోంది. కాళ్లీడ్చుకుంటూ నడుస్తున్న కరుణనీ, గాలిపటాన్నీ మార్చి మార్చి చూస్తూ వుండిపోయింది సుమ. మధ్యాహ్నం ఎవరో ఇద్దరు కరుణని వెతుక్కుంటూ బైక్ మీద వచ్చారు. సుమ ఎదుట నిలబడి కరుణని బూతులు తిట్టారు. మలేషియా టౌన్‌షిప్ నుండి వచ్చేరట. "మూడు నెలల క్రితం నా పెళ్లామూ నేనూ ఆకల్తో చచ్చిపోతున్నాం బాబూ, ఏదన్నా పనుంటే ఇప్పించండని వచ్చేడు. పోన్లే కదా అని నమ్మి గుమాస్తాగా పెట్టుకున్నాం. ఇటిక బట్టీల వాళ్లకి అడ్వాన్సు ఇచ్చిరమ్మని అయిదు వేలిచ్చి పంపిస్తే రెండు వేలు నొక్కేసేడు. అప్పట్నుంచి అయిపులేకుండా పోయేడు. కనపడనియ్ చెప్తాను'' అంటూ ఏమిటేమిటో అన్నాడు అందులో ఒకతను. కరుణ ఆ మధ్య పదికేజీల బియ్యం, ఒక వాయిలు చీర కొనుక్కొచ్చేడు. ఓ వారం రోజులు కొంచెం ధీమాగా తిరిగేడు. ఆ డబ్బుల్తోనే కాబోలు.
సుమ నమ్మలేకపోయింది - కరుణ అలా చేసేడంటే. మర్నాడు సుమ డాక్టర్ని కలిసినప్పుడు ఏవేవో పరీక్షలు చేసింది.
"తల్లీ, నీకేమైనా అయితే నా మెడకి చుట్టుకుంటుంది. నాలుగురోజుల్లో మునిగిపోయేదేం లేదు కానీ, బలానికి నా దగ్గరున్న విటమిన్ కేప్స్యూల్స్ ఇస్తున్నాను. కాస్త ఓపిక పుంజుకున్నాక అప్పుడురా'' అని పంపించేసింది.
ఆ సాయంకాలం కరుణ మూడువేలు తెచ్చి ఇచ్చేడు. "బలమైన తిండి తిను. ఈసారి పాపాయిని తప్పకుండా కాపాడుకుందాం'' అన్నాడు. సుమకేమీ ఆనందం కలగలేదు. "ఈ డబ్బు ఎక్కడిది?'' మొహం గంటు పెట్టుకుని అడిగింది.
కరుణ చేతిలో ఉన్న మాంసం పొట్లాన్ని విసిరికొట్టాడు. "ఏం ఎక్కడైనా ఎత్తుకొచ్చేననుకున్నావా? ఆరాలెక్కువయ్యాయే'' అని గయ్యిమని అంతెత్తున లేచేడు.
అలిగి బైటికెళ్లిపోతూ "నా మెడకు నువ్వొక గుదిబండవి. లేకపోతే ఇవాళ ఎక్కడుండేవాణ్నో తెలుసా'' అన్నాడు. ఆ మాట సుమ మనసుకి ముల్లులా గుచ్చుకుంది.
రెండోరోజు ఎక్‌స్ట్రా ఆర్టిస్టు సప్లయిర్ వచ్చేడు ఇల్లు వెతుక్కుంటూ. "నా పెళ్లాం మెళ్లో గొలుసు తెచ్చి ఇస్తాను. హఠాత్తుగా ఆమెకి ప్రాణం మీదికొచ్చిందని ఫోనొచ్చింది'' అని కరుణ నిన్న అయిదువేలు పుచ్చుకున్నాడట అతన్దగ్గర.
వాడకుండా పెట్టెలో పెట్టిన మూడువేలు తీసి అతని చేతిలో పెట్టి చేతులు జోడించింది సుమ.
"ఎదుటివాళ్ల కడుపో కాళ్లో పట్టుకుని పని సంపాదించుకుని బతకాలిగాని ఇలాగ ఎందర్ని మోసం చేసి ఎంతకాలం బతుకుతారమ్మా'' అని వాకిట్లో కాండ్రించి ఉమ్మేసి వెళ్లేడు అతను.
ఆ సాయంకాలం హఠాత్తుగా మొదలైన గాలివాన రాత్రి పొద్దు పోయేవరకూ కురుస్తూనే ఉంది. ఆ రాత్రి కూడా కరుణ ఇంటికి రానేలేదు. రాత్రంతా సుమ ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారి లేచి బయటకొస్తే వాకిలి నిండా రాలిన చెట్ల ఆకుల్తో బాటు గాలిపటం పడివుంది. చీపురు, చేట తీసుకుని బైటకొచ్చేసరికి సుగాలీల కుర్రాడొకడు తెగిన గాలిపటం దారాన్ని పట్టుకుని పరుగెడుతున్నాడు. అది వాడి తలపైన రెక్కలు విప్పుకోడానికి ప్రయత్నిస్తోంది.
సుమ వాకిలంతా శుభ్రంగా తుడిచి చెత్తకుండీలో పోసింది. స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుంది. రెండు నెలలుగా కరుణకి తెలీకుండా కాలనీలో రెండు ఇళ్ల పిల్లల్ని దగ్గర్లో ఉన్న స్కూలుకి దిగబెట్టి తిరిగి సాయంకాలం తీసుకొస్తోంది. ఆ రోజు పిల్లల్ని దిగబెట్టి రేపట్నించి ఇక రాలేనని చెప్పేసింది. వాళ్లు చెరో నాలుగొందలూ చేతిలో పెట్టేరు. మధ్యాహ్నం సుబ్బమ్మ పెట్టిన వేడి వేడి అన్నం తిని, పెట్టెలో కట్టుకోకుండా దాచిన వాయిలు చీర తీసి ఆమె చేతిలో పెట్టి కాళ్లకి దణ్ణం పెట్టింది. మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి లేచింది. గదికి గొళ్లెం పెట్టి, పెట్టె తీసుకుని బైటకి నడిచింది. కాలనీలో సిటీబస్సెక్కి రైల్వేస్టేషన్ చేరుకుంది. మర్నాడు ఉదయం అన్నవరం స్టేషనులో దిగింది.
రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చిన కరుణ తన పెట్టెమీద సుమ రాసిపెట్టిన చీటీని విప్పేడు.
"పుట్టిన ఊళ్లో కట్టెలమ్ముకున్నా మేలే కదా'' అని ఉంది చీటీలో.
*
ఇప్పుడెవరైనా అన్నవరం వెళ్తే కాలి దారి దగ్గర మెట్లకి దిగువన కొత్తగా వెలిసిన పెద్ద కొబ్బరికాయల దుకాణంలో ఒక వైపు సుమ, మరోవైపు కరుణ ఉండి బేరం చూస్తూ కన్పిస్తారు. జీతానికి పెట్టుకున్న నలుగురు కుర్రాళ్లు వాళ్లకి సాయం చేస్తూ ఉంటారు. మీరు పలకరించాలనుకున్నా వాళ్లకి పలికే తీరిక ఉండదు.
...............................................
రచయిత్రి సెల్ : 98664 ౬౭౦౬౨
05-12-10, ఆంధ్రజ్యోతి, ఆదివారం అనుబంధం నుండి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి