Pages

7, డిసెంబర్ 2010, మంగళవారం

మూడు కతలు నావీ, నాలుగోది శిష్ట్లాదీ!

మా ఊరి గెమిని దగ్గర చెరువు కాలవ దాటతా వుండా, అప్పుడినిపించింది నాకు యెంగట్లచ్చిం నోటమ్మట వొచ్చిన ఆ మాట. ఒకే మాట, అదిదీ, అచ్చిరం పొల్లు బోకుండా!
‘‘నా కూలిపొయ్‌న బతుక్కిప్పుడదొక్కటి తక్కవ!’’

నా మెల్లకన్నుతో యెంగట్లచ్చిం యింటికల్లా అట్ట జూసినా. ఆ రోజు శుక్రోరం. శుక్రోరం శుక్రోరం ఒకాయన మల్లెపూలూ, చామంతి పూలూ, చెండు మల్లిపూలూ తట్టలో పెట్టుకోని తిరప్తి యేశాలమ్మ యీది నుంచి మా వూరికి సైకిల్లో వొచ్చి- యాపారం జేసుకునేవోడు. యెంగట్లచ్చిం యింటి ముందర సైకిలు నిలబెట్టుకోని ఆయనుండాడు. యెంగట్లచ్చిం వాళ్లమ్మ కిష్టమ్మత్త తిన్నెమింద కుచ్చో నుండాది. యెంగట్లచ్చిం చలికాలం గాబట్టి రేపటెండలో కూచ్చోని చలి కాంచుకుంటా వుండాది, ముడుక్కోని.

చెరువు కాలవ దాటక ముందు కిష్టమ్మత్త అన్న మాట కూడా నా చెవల్లో పడిందిగానీ అంతగా పట్టించుకోలా. అదిదీ, అచ్చిరం పొల్లు బోకుండా!
‘‘ఈ రోజు శుక్రోరం గదా. తలకు పోసుకోని పూలు బెట్టుకో. దుడ్డు నేనిస్తాన్లే!’’

ఈ కాసింతా నా కండ్లల్లో, చెవల్లో పడేదానికి వక్క కొరికినంత సేపయినా పట్టిందో లేదో! ఎట్ట యేసినానో గానీ 40, 50 అడుగులేసే సరికి మా వూరి దింపుడు కళ్లం వొచ్చింది. తెల్లారి ఎనిమిది గెంటలైనా ఒక పిట్టికోడి లేదు. అప్పుడు నేను యూనివర్శిటీలో ఎమ్మెస్సీ ఫస్టియర్ చదవతుండా (1981). ఇంక నాలుగు బారలేస్తే బస్సు బాట వొచ్చేస్త్తింది.


నా ఆవజీవాలన్నీ అణిగిపొయ్‌నాయి. దింపుడు కళ్లం దగ్గర టెంకాయ కొట్టుకునే దానికి ఒక బండరాయి పడుంటే దానిమింద కుచ్చోని మోకాళ్ల సందన తల బెట్టుకోని ఓ అని ఏడ్చేసినా. నా కండ్ల ముందర్నే నేనె క్కాల్సిన బస్సు తిరప్తికి పూడిసింది. పూడిస్తే పూడిసింది, నేను దింపుడు కళ్లం కాడ కూచ్చోని ఏడస్తా ఉండడం చూసి మా వూళ్లో ఒకాయన మాయమ్మకూ, మా అక్కకూ చెప్పేసినాడు!

మాయమ్మా మాయక్కా ఏందో జరిగిపోయినట్టు లబలబా నోరు కొట్టుకుంటా దింపుడు కళ్లం కల్లా పరిగెత్తతా వుండారు. వూరంతా వుడ్డ జేరిపోతారేమోనని బిత్తరపోయ్‌నా. ముక్కుల్లో వున్న చీమిడినంతా చీదేసి ప్యాంటుకు తుడుచుకుని పైకిలేచి నిలబడుకొనే సరికి మాయమ్మా మాయక్కా ఇద్ద్దురూ నన్ను చెరొక రెక్కా పట్టుకొని దింపుడు కళ్లానికి దూరంగా జవు రుకొని పోయినారు ఓ అని ఏడ్చుకుంటా.

‘ఇంకెట్ట కొడకా!’ అంటా మాయమ్మా, ‘ఇంకెట్ట సినబ్బా!’ అని మాయక్కా ఏడ్చేదానికి పెట్టుకున్నారు.
నేనెంత తప్పు చేసినానో తెలిసే సరికి నాకు గుండికాయలు నీళ్లయిపోయినాయి. దింపుడు కళ్లం రాయి మింద నరమానుడెవుడూ కుచ్చోడు. పైగా ఆడికొచ్చేసరికి ఆ రాయి మింద తుపుక్కు తుపుక్కు అని మూడుసార్లు ఎంగిలి కూడా వూంచతారు.

‘‘అమా, నువ్వు అబ్బ దగ్గిర్నే వుండు. నేను యింటికి పొయ్ ఇన్నూర్రూపాయలెత్తుకోనొస్తా. అబ్బను రూంతసేపట్లో డాకట్ర దగ్గ్గిరికి తీసకపోకపోతే చచ్చిపోతాడు!’’ అంటా మా అక్క వూళ్లోకి పరిగెత్తబోయింది. మా అక్క నాకంటే ఎనిమిదేండ్లు పెద్దది. మా మేనత్త కొడుక్కే యిచ్చినాం. మా మేనత్తోళ్లు మా వూరికే మహరాజులు కావడం వల్ల మా అక్కకు ఇన్నూర్రూపాయలంటే రెండ్రూపాయల్తో సమానమే. ‘‘నా సిన్న కొడుకుని, నా చక్రవర్తి కొడుకుని దెయ్యం తొక్కేసిందమ్మా.

అందుకే సోదీనం తప్పి దెయ్యం బట్టి ఏడ్చుకుంటా వుండాడు!’’ అని మాయమ్మ ఎదుర్రొమ్ము గుద్దుకునేదానికి మొదులైంది. నేను తెంపుగా నా కందగెడ్డ మొకం మిందికి నవ్వు తెచ్చుకోని, ‘‘అకా అకా! ఇట్రా, నిజ్జం జెప్తా. ఇట్రా. మంచి మద్యానమైనా దెయ్యాలుంటాయి గానీ తెల్లారి పూట దెయ్యంలా గియ్యంలా’’ అనన్నా. మా అమ్మ ఏడుపు ఆపలేదుగానీ, మా అక్క ఆపి, ‘‘ఏమి కొండా! మా గుండికాయలు నీళ్లయిపోయినాయి గదరా. నిన్ను నమ్ముకోని బతకతా వుండాం గదరా.

నీకేమి సంకటం వొచ్చిందిరా? నీ వొగిసు బిడ్డ దింపుడుకళ్లం కాడ కుచ్చోని గుండెలు పట్టుకోని ఏడస్తావుంటే దెయ్యం తొక్కేసిందనుకోక ఏమనుకోమంటావురా?’’ అని అంటా కండ్ల నీళ్లు తుడుచుకొనింది. నా ఏడుపుకు ఏం అపద్దం చెప్పాలిప్పుడు? టకీమని చెప్పేసినా: ‘‘అకా! నీకు ముగ్గురు తోడికోడాండ్లు గదా. అందరూ బిడ్డా పాపతో వుంటే నీ కడుపునింకా ఒక కాయ కాయలేదు గదా. అందుకని దుఃక్కమొచ్చింది.’’

అమ్మయ్య! మా అక్కకు ఏనుగంబారీ మింద ఎక్కినంత కుశాలేసింది. నిజంగానే నేను మా అక్కకు పెండ్లయినప్పటి నుంచి ఏ తేదీన ముట్టవుతుందో తెలుసుకుని, అదే తేదీకి ఈ ఏడెనిమిదేండ్లుగా అడగతానే వుండా. ‘‘అకా! ఈ నెలన్నా అంటు తప్పినావా?’’ అని! మా అక్కకు ఈ సంగతి బాగా తెలుసు (నా బాద చూళ్లేక నేను ఎమ్మెస్సీ రెండో సంవత్సరంలో వుండంగా మా అక్క అంటుతప్పి నా చేతుల్లో తులసిని పెట్టింది).

‘‘నా తమ్ముడికి నేనంటే ఎంత గ్నేపకమో!’’ అని నా మూతి చుట్టూ మెటికలిరిచి నా చేతి కేరీరు పెరుక్కోని, ‘‘ఈ రోజు ఈ చద్ది కేరీరొద్దు. శీనయ్య మెస్సులో మటను బోజనం తిను. కాలేజీక్కూడా పోబాక. సిల్మా చూడు’’ అంటా నూర్రూపాయలు చేతిలో పెట్టింది. నేను కాలేజీకి నడవలూరు బస్సు ఎక్కేసినాను.

దింపుడుకళ్లం కాడ నేనెందుకేడ్చినానో చూసి రమ్మంటే కాల్చి వచ్చే పాఠకులకు చెప్పాల్సిన పనిలేదు. కానీ, చూసి రమ్మంటే ఒకటి సగంగా చూసి వచ్చేసే పాఠకులకు మాత్రం చెప్పాల్సిందే:
నేను ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నానంటే 20 నిండి, 21లోకి వచ్చినట్టు గదా లెక్క. యెంగట్లచ్చిం నాకంటే రెండేండ్లు చిన్న. యెంగట్లచ్చిం మేకలు తోలుకోని అడివికి పోతే నేను ఇస్కూలు సెలవుల్లో ఎనపగొడ్లు తోలుకోని పొయ్యేవాణ్ని.

చేసిపెట్టిన బొమ్మ మాదిరుండే యెంగట్లచ్చిం అడివంతా తిరుగుతూ నేనెంత వెదికినా దొరకని నెమటాయిల్నీ, ఎలికింజివ్వల్నీ ఏరుకొచ్చి దోసిట్లో పోసేది. పిడికిళ్లు పిడికిళ్లుగా కలిమి కూడు తెచ్చి పెట్టేది. అవి తిన్నాక, ‘‘ఈ నీళ్లు తాగు, నోరంతా ఎంత తియ్యంగా అయిపోతుందో చూడు.’’ అని సొరకాయ బుర్ర అందించేది. మొగ పిలకాయలందరితో కబాడీ ఆడేది. గుడ్డలిప్పి కడగా పారేసి, చెరువులోకి దూకి, ‘‘ఈత నేర్పిస్తాన్రారా సిన్నోడా!’’ అని పిలిచేది. అడివిలో వుండే తెల్లరాళ్ల మిట్ట కాడా, నూగుజేను మిట్ట కాడా, అండా సామిగెండి కాడా సొర్గం చూపించేది. ఇదంతా ఎప్పుడు?

ముందు జల్మంలోనా? ఏడెనిమిదేండ్లకు ముందర్నే! సమర్తాడిందో లేదో పద్నాలుగేండ్లకొక యింటిదై పొయ్యింది. పజ్జెనిమిదేండ్లకంతా ఆ చంకనొక కొడుకూ, ఈ చంకనొక కూతురూ!
శ్రీశ్రీ తాజ్‌మహల్‌కు రాళ్లెత్తిన కూలీలెవరు... నాకు అర్జంటుగా లిస్టు కావాలని ఆగడం చేసేసినాడు కవిత్వంలో! పెండ్లయ్యింది యెంగట్లచ్చానికి! ఈ ఏడెనిమిదేండ్లూ ఆ అమ్మి నిమిస నిమిసం ఎట్టా బతకబట్టి, ‘‘నా కూలిపొయ్‌న బతుక్కిప్పుడదొక్కటి తక్కువ!’’ అని అనగలిగింది! ఇది గావాల నాకిప్పుడు.

ఈ యెంగట్లచ్చిమేనా ఏడెనిమిదేండ్లకు ముందర కొంగుతో కొంగుడు తంగేడు పూలను ఏరుకొచ్చి అడివిలో వుండే మొగోళ్లందరి మిందా దోసిళ్లతో నెత్తిన పోసి, ఎవురో చక్కలగిల్లి పెట్టినట్టు గెంటలసేపు నవ్వింది!

నేరుగా పోయి మా యూనివర్శిటీ మేథమేటిక్స్ ప్రొఫెసర్ పి.వి.అరుణాచలం చొక్కాను పట్టుకోని, ‘‘సార్! ఒక తల్లికి 40 ఏండ్లుంటాయి. కూతురికి 19. శుక్రవారాన్ని గుర్తు చేసి తలంటుకోని అన్ని పూలు పెట్టుకోమంది తల్లి. దుడ్డు కూడా ఇస్తాననింది! కానీ ఆ టీనేజీ కూతురు ‘ఇప్పుడీ కూలిపోయ్‌న బతుక్కి అదొక్కటి తక్కవా?’ అని తల్లిని ప్రశ్నించింది. ప్రశ్న అంటే ప్రాబ్లెమే గదా! బీఎస్సీలో మ్యాథ్స్‌లో నాకు 95% వచ్చినాయి. ఎమ్మెస్సీలో చేర్చుకోడానికి మీరు పెట్టిన పరీక్షలో యూనివర్శిటీ ఏరియాలో ఐదో ర్యాంకు వచ్చింది. ఈ ప్రాబ్లెమ్ నాకెంతకీ అర్థం కావడం లేదు.

విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన తమరు నాలుగు పీరియడ్లయినా సరే తీసుకుని సాల్వ్ చెయ్యండి. లేకుంటే చిత్తు పేపర్ల మీద రాసుకోనొచ్చి బోర్డు మింద మీరు చూసి రాసేసి పోయే మీ మ్యాథమాటికల్ థీరమ్స్ అవి అపై ్లడ్‌వో ప్యూర్‌వో బొచ్చువో మీ నెత్తినేసుకోని రోజూ తలస్నానం చేసుకోండి.’’ అని అడగలేక... ఆ రాత్రి యింటికి రాంగానే నేను చేసిన పనేందంటే అప్పటిదాకా నేను చదువుల ద్వారా సంపాయించుకున్న ఫస్ట్‌క్లాస్ సర్టిఫికెట్లన్నీ మూడో కంటికి (ఈ రోజు టికీ) కూడా తెలీకుండా చింపి పవిత్రమైన మా పేడదిబ్బలో ఆ కల్మషాన్ని కలిపేసి గుర్రుపెట్టి నిద్రపోయినాను.

ఇంక రెండోకత చిన్నది. మాంగల్య బలాన్ని ఎగిసి ఎడమ కాలితో తన్ని నాకు అక్క వరసైన ఒకామె- పది రూపాయలు జేబీలో మెదిలే ఒకాయన్ని పెట్టుకొనింది. లేదా పది రూపాయలు జేబీలో మెదిలే ఆ నా కొడుకే ఆమెకి ఆ మాటా ఈ మాటా చెప్పి పెట్టుకున్నాడు. వాడు రెండు మూడేండ్లు ఆమె గుండు గుడిసెకి వస్తా పోతా వుండినాడు. మూడు నెల్లు అయిపు లేకపోయే సరికి నేనా అక్కతో, ‘‘అకా అకా వాడేమన్నా పది రూపాయలు సఖాయం చేసినాడా? ఈ నడమన్నే నీ పెద్ద కూతురికి పెండ్లి చేస్తివి గదా. అయిదు వేలో పది వేలో కర్జేమన్నా పెట్టినాడా?’’ అనడిగినా.

ఆ అక్క అన్న మాట అచ్చిరం పొల్లు పోకుండా:
‘‘సినబ్బా! ఎండకేసిన పందిరి గాలీవానకి నిలిస్తిందంటావా?’’
ఆ నిమిసాన- ఆ అక్క నోట్లో రష్యన్ మహా రచయితలైన గోగోల్, చెహోవ్, గోర్కీ... ఇంకా చార్లెస్ డికెన్స్, మార్క్ ట్వెయిన్, మరీ ముఖ్యంగా అవుట్ సైడర్ నవల రాసి నోబెల్ బహుమతి పొందిన ఆల్బర్ట్ కామూ వీళ్లంతా కండ్లకు కట్టినట్టు కనిపించినారు మరుగుజ్జులు మాదిరిగా.

యిపుడు నేను చెప్పబోయ్యే మూడోకత మూడేండ్లకు ముందర యిప్పుడు నేను చచ్చుండే అన్నమయ్య టవర్స్ సెల్లార్‌లో జరిగిన కత. తెల్లారి ఆరున్నరకు నేను టీ తాగి సెల్లార్‌లోకి వచ్చి సిగరెట్టు అంటించినానో లేదో ఒక పేదరాలు 22, 23 ఏళ్లుంటాయి మహా అయితే... ఎదురుగా మూడు నాలుగేండ్ల చిన్న బిడ్డలిద్దురు! ఆమె పారిపోకుండా స్తంభానికి కట్టేసి వుండారు. సెల్లార్‌లో అప్పటికే అయిదారుగురు మగధీరులు ఆ (దొంగ) తల్లిని పట్టుకుపోదురు రమ్మని పోలీస్ స్టేషనుకు సెల్‌ఫోన్లలో ఓ అని మాట్లాడేస్తున్నారు. ఈ మెల్లకన్నుతో ఆమెను చూస్తి.

నల్ల రూపాన నాణ్యంగా వుండాది. సరైన పోషణ లేక ఆ పొడుగాటి చేతల మింద చిన్న చిన్న పుండ్లు కూడా! టైం ఎనిమిదై పోతా వుంది. మా సెల్లార్‌లో వున్న కొంతమంది నీతిమంతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి, ఎంతకీ పోలీసులు రారేమని! సెల్‌ఫోన్లల్లో మాట్లాడే వాళ్ల దగ్గరికి పోయి కుయ్యో మొర్రో అందామంటే దైర్నం చాలడంలా. నేనుండేది బాడిక్కి. పైగా (చూపులకు) పిచ్చోడి మాదిరుంటా. నా మాట చెల్లతాదా!

స్తంభానికి కట్టేసి వున్న ఆ క్లియోపాత్రా దగ్గరకు సిగ్గుగా, గుండెలదురుతుండగా పోయినాను. తలొంచుకోని ఒక మాట అన్నా; బహువచనంలో సంబోధిస్తూ... ‘‘మీరేం భయపడకండి. నా గొంతులో వూపిరుండంగా మిమ్మల్నీ, మీ బిడ్డల్నీ పోలీసుల పరం చెయ్యను. నా మాట నమ్మండి.’’ అనేసి కాలవ పక్కన బండి దగ్గరికి పోయి మూడు నాష్టా పొట్లాలు తెచ్చి ఆమె ముందు పెట్నాను.
బిడ్డలు తిన్నారు. ఆ తర్వాత ఆమె తినింది.
అక్కడున్న మొగోళ్ల ద్వారా ఆమె చేసిందడిగి కనుక్కుంటే జరిగిందిదీ:

గుండె దిటవు చేసుకుని వినండి! ఈ అపార్ట్‌మెంట్‌లో అప్పటికింకా 5, 6 శాతం చిన్న చిన్న పనులేవో మిగిలే వున్నాయి. అందువల్ల సెల్లార్‌లో ప్లాస్టిక్ పైపుల తునకలు జానడేసీ, పగిలిపోయిన ప్లాస్టీకు బిందెలూ, ఇంకా తాగి పారేసిన వాటర్ బాటిళ్లూ... ఇట్లా ఎన్నో! ఆ నల్లటామె తెల్లవారు జామున నాలుగ్గంటలకు నిద్రలేచి, ఇద్దరు బిడ్డల్నీ చెరో చంకనా వేసుకోని మా సెల్లార్‌లో వున్న యావత్ భారతదేశ సంప దనీ కొల్లగొట్టడానికి దొంగతనంగా దూరిందంట.

బిడ్డల్ని కిందికి దించి ఆ ప్లాస్టీకు ముక్కా ఈ ప్లాస్టీకు ముక్కా ఏరుకుంటా వుంటే కత్తి లాంటి మా నైట్ వాచ్‌మన్ చూసేసినాడు. ఆమె పరిగెత్తేసింది, ఆ తొందర్లో బిడ్డల్నొదిలేసి! వాచ్‌మన్ తెలివి తేటల్ని చూడండి- ఆమె ఇద్దరు బిడ్డల్నీ పట్టుకుని కాలు మింద కాలేసుకుని కూర్చున్నాడు.

దూడల కోసరం ఆవు తిరిగొచ్చినట్టుగా బిడ్డల కోసరం ఆ నల్లటామె వాచ్‌మన్‌కి లొంగిపోయింది. వాచ్‌మన్, ‘నా దగ్గర్నా నీ తెలివీతేటా? చూసినావా నా పనితనం?’’ అని తలెగరేసి ఆమెని స్తంభానికి కట్టేసినాడంతే.

నేను విన్నదాన్ని బట్టి మనది ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలోని ప్రతి స్ర్తీ భరతమాతే! గొప్పింటి స్ర్తీలే కాదు! తెల్లారుజామున ఒక భరతమాత బిడ్డలిద్దరిని చంకకెత్తుకుని తుక్కు సామాను దొంగిలించడానికి బయలుదేరిందంటే... ఆ తప్పెవరిది? ఆమె పరిస్థితికి నా బుద్ధికి తోచిన ముద్దాయిలు వీళ్లు:

1) ఇది తిరప్తిలో జరిగింది కాబట్టి ఇక్కడి ప్రథమ పౌరుడు మునిసిపల్ ఛైర్మనో, కమిషినరో ఎవడైతే వాడు.
2) తిరప్తి ఎమ్మెల్యే.
3) తిరప్తి చిత్తూరు జిల్లాలో వుంది కాబట్టి ఆ జిల్లా కలెక్టరు, ఎస్.పి.
4) ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కాబట్టి గవర్నరు, ముఖ్యమంత్రి.
5) ఇది భారతదేశంలో జరిగింది కాబట్టి ప్రధానమంత్రి , రాష్టప్రతి.
6) ఇది ప్రపంచంలో జరిగింది కాబట్టి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు.

అప్పటికప్పుడు సైకిలేసుకుని పోలీసు స్టేషనుకు పరిగెత్తినా. ‘అన్నమయ్య టవర్స్’ అనగానే, ‘‘నువ్వు వాచ్‌మన్‌వా? మీవాళ్లు ఫోన్ల మింద ఫోన్లు చేసి చంపేస్తుండారయ్యా!’’ అన్నాడు అక్కడున్న ఒక కానిస్టేబుల్ సైకిల్ మింద నా అవతారం చూసి. అతన్తో ఒక్క మాటా మాట్లాడ్డం అనవసరం అనిపించి, ‘‘ఈ వెయ్యీ తీసుకోండి. నేను వాచ్‌మన్‌ని కాను, ఆ అపార్ట్‌మెంట్‌లో బాడిక్కి వుండేవాణ్ని. అపార్ట్‌మెంట్ వాళ్ల తృప్తికోసం అక్కడికొచ్చి (ఆమెని కొట్టకుండా) నోటికొచ్చినట్టు తిట్టి వొదిలేయండి.’’ అనేసి సెల్లార్ కొచ్చేసినా.

పూజ్యనీయురాలైన ఆ నల్లటి భరతమాతకు కట్టిన కట్లు తెగిపొయ్‌నాయి.
అంత రాగి జావ తాగేసి నిజంగానే మా వూరికి సైకిల్ మింద పోయి దింపుడుకళ్లం దగ్గిర ఆగి, ఆ రాతి మింద మూడుసార్లు ఎంగిలూంచి మళ్లా సైకిలెక్కేసినా, నా కండ్లల్లో చెమ్మ కూడా లేదు!

ఇప్పుడు శిష్ట్లా ఉమామహేశ్వరరావు గుంయి గుంయి గురివి కత.
ఈ కత నా ముక్య చేహితురాలు గురివిది! అని ఉమ్మయ్య ఈ కతని ఆరంబం జేస్తాడు. అంటే చదివే వాళ్లని వుద్దేశించి జాగర్తగా చదవండ్రా లమ్డీకె లచ్చన్నల్లారా అని అర్తం. గురివి 19 ఏండ్లకంతా సైన్యంలో చేరింది, నర్సు ట్రైనింగుకు.

అప్పట్లో జపాన్ సేనల్ని ఎదుర్కొనడానికీ, బ్రిటిషు సైనికులకు అండగా నిలవడానికీ బీదా బిక్కీ లక్షలాదిగా సైన్యంలో చేరిపోయినారు. గుంటూరు జిల్లా పిల్ల అస్సాం పరిసరాల్లోకి సైన్యంలో చేరడానికి పోయిందంటే వుండూర్లో బతుకు తెరువు లేకే గదా. ఇదేదీ ఉమ్మయ్య చెప్పడు. నేనెందుకు చెప్పాల?

గురివికి ట్రైనింగయ్యింది. అయితే వెంటనే డిశ్చార్జి అయ్యింది. కారణం ఆమెకెప్పుడూ చెవుల్లో గుంయి గుంయిమంటుంటాది. ఒకసారి డాక్టరు దగ్గిర చూపించుకుంటే, ‘‘నీ చెవుల్లో శేర్ల కొద్దీ ఫేసు పౌడరుంది’’ అని అదంతా తీసి పారేసినాడు. అయినా గురివికి చెవుల్లో గుంయి గుంయిమంటానే ఉంది. ఒక రోజు డాక్టరు ఆపరేషను చేస్తుంటాడు. ఈ గుంయి గుంయి బాద పళ్లేక చేతిలో వున్న పళ్లాన్ని విసిరి పారేసి గురివి అదే పోతా. ఫలితం సైన్యం నుంచి డిశ్చార్జి.

ఒకసారి ఉమ్మయ్య బెటాలియన్‌తో పాటు సికింద్రాబాదు వచ్చి వుంటే అక్కడ తేలి వుంటాది గురివి. ఇద్దరూ పార్కులో కూర్చున్నారు. ఆ కబురూ ఈ కబురూ చెబుతున్నదల్లా వున్నట్టుండి ‘‘అరెరే’’ అనింది గురివి. ‘‘సెప్పడానికి సిగ్గవుతుందోయి’’ అంది మళ్లా. ‘‘నీకు సిగ్గేంటి గురివీ!’’ అని ఉమ్మయ్య అనడంతో చెప్పేసింది. ‘‘రైక లోపల బాడీ బనీను పగిలింది!’’ అని.

ఇద్దరూ బట్టల కొట్లోకి పోరుునారు. సెజైంతో చెప్పమన్నాడు కొట్టు కుర్రాడు. 32 అని చెప్పింది పిచ్చి నా గురివి.
‘‘మేడంకు 36 సైజు అని నా వుద్దేశం’’ అన్నాడు షాపు కుర్రాడు.
ఎక్కడ రగలాల్నో అక్కడ రగిలిన గురివి, ‘‘నో, నాకు 32 సైజే కావాల.’’ అంది.
‘‘మీకు 36 సైజే ఫిట్’’ అంటాడు మళ్లా కుర్రాడు.

‘‘నా సైజు నాకే తెలీదంటావా?’’ అని కుర్రాడి మిందికి ఎడంకాలెత్తుకోని పోతుంది గురివి.
‘‘ఏడేండ్ల నుంచి లోబాడీలమ్మతా వుండా. ఏ ఆడదానికి ఏ సైజో నాకు తెల్దా? 36 సైజు వాళ్లు 32 యేసుకుంటే చెవుల్లో గుంయి గుంయి మంటూ వుంటాది!’’ అని షాపు కుర్రాడు అనడంతో కత ముగిసిపోతుంది. 1990 ప్రాంతంలో ఈ కత చదవడం ముగించగానే నేను బోల పొనుకోని, ఎంత ఏడుపు ఏడ్చినానో చెప్పలేను. సభ్య సమాజానికి ఈ కత రొమ్ముల మిందా, బ్రాల మిందా అనిపించి, ఈ కత చదవంగానే తల దించుకోవచ్చు. సభ్య సమాజానికి ఇంకేం పనుండదు, చీటికి మాటికి తల దించుకోవడమే దాని పని.

ఈ కత చదివి నేనెందుకేడ్చినానో చెప్తే నా ఉమ్మయ్యకి నేను ద్రోహం చేసినట్టు కాబట్టి చెప్పను!
నేను 1998లో హైద్రాబాద్‌లో ఆంధ్రజ్యోతి వీక్లీకి ఎడిటర్‌గా వున్నప్పుడు ‘పాత బంగారం’ పేరిట లబ్ధప్రతిష్ఠులైన రచయితల పాత కథలతో దీపావళి ప్రత్యేక సంచిక తెచ్చినాను. అందులో మొదటి కథ గుంయి గుంయి గురివినే వేసి నేను పుట్టకముందెప్పుడో చచ్చిపోయిన ఆయనకు జేజేలు పలికినాను.

అనుకుంటే నా ఉద్యోగాన్ని వూడగొట్టే సత్తావున్న ఒకాయనఆ సంచికలో గుంయిగుంయి గురివి కథ చదివి, అందునా తొలి కథగా వెయ్యడం చూసి ఫోనులో నాతో రచ్చకు దిగి,‘‘నువ్వూ మాండలికం ముసుగులో ఇట్టా బూతు మాటల్తో కతల్రాసే వాడివేగదా’’అని ఫోను పెట్టకుండా బూతులు తిట్టినాడు. ఆ పెద్దాయన సభ్య సమాజంలోని సభ్యుడు. ఆయనతో ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ.

నేనూ నా తలకొవ్వుకొద్దీ ఈమాదిరిగా మాట్లాడినాను ‘‘అయ్యా! శిష్ట్లా ఉమామహేశాన్ని బతికుండంగా పచ్చి తాగుబోతన్నారు. వ్యభిచారి అన్నారు. ఇంకా హోమోసెక్సువల్ అని కూడా బొక్కలాడి 40 ఏండ్ల వయసుకే ఆయన్ను చంపుకుతిన్నారు. మీకు తెలిసినంత వరకూ నేనూ పచ్చి తాగుబోతునే, వ్యభిచారినే. నా మాదిరి తాగుబోతుకీ ఎప్సేరికీ ఏడవాలంటే జీవితానికి ఒక్క గుంయిగుంయి గురివి చాలు. సభ్య సమాజంలో వున్న మిమ్మల్ని ఏడిపించడానికి గురివి చాలదు. గ్లిజరిన్ కావాలి. నా దగ్గర అది లేదు!’’

--- నామిని సుబ్రమణ్యం నాయుడు

05-12-10, ఆదివారం అనుబంధం నుండి..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి