Pages

1, డిసెంబర్ 2010, బుధవారం

కంపల్సరీ అప్పల్నాయుడు




కంపల్సరీ అప్పల్నాయుడంటే తెలీనోళ్ల్లు విశాపట్నం జిల్లా చోడవరం తాలూకాలో అస్సలుండరు. అలాంటోడు ఇయాల రేపూ మరికనపడ్డు. నాయుడు చేసింది బొగ్గుల సుబ్బారావు డిపోలో కూలిపనే కావచ్చు. కానీ ఊరందరికీ గొప్ప ఆప్తుడు. బట్టతలతో కర్రి కర్రిగా రివటలా ఉండీవోడు. అస్థిపంజరానికి జింకరాసి చర్మం అతికిస్తే ఎలాగుంటాడో అలాగే ఉండీవోడు. కానీ ఎంత బలమో చెప్పలేం. రెండు మూడు బొగ్గుల బస్తాల్ని అవలీలగా మోసీసి ఇళ్లకి తెచ్చి పడీసీవోడు.

ఆ రోజుల్లో గ్యాస్ పొయ్యిలెక్కడుండీవండీ బాబూ. చోడవరంలో పెద్ద్ద షావుకార్లు పూసర్ల రాజేశ్వర్రాగారింట్లోనో, విజ్జపు సోమేశ్వర్రావుగారింట్లోనో ఉండీవి. మిగిలినోళ్లంతా అప్పల్నాయుడి చుట్టూ గిరికీలు కొట్టవలసిందే. సంక్రాంతికి కొత్తల్లుడొస్తున్నాడంటే చాలు. ‘‘నాయుడు ఎక్కడున్నాడ్రోయ్!’’ అని అంతా వెతుక్కునేవోరు.

‘‘వంటకి ఇబ్బందుల్లేకుండా చూడ రోయ్!!’’ అంటూ గండికోట సీతారావమ్మ, భమిడిపాటి నరసయ్యమ్మ లాంటి చాదస్తపు బ్రాహ్మణమ్మలు అతగాణ్ణి అదిలించీవారు.
‘‘అదేటమ్మా మీ ఇంటికి సుట్టాలొస్తే నా ఇంటికొచ్చినట్టు కాదేటి’’ గౌరవంగా మాట్లాడీవోడు.

‘‘నాకేటీ ఎగస్ట్రా ఇవ్వొద్ద్దు. మా బొగ్గుల సుబ్బారావుకి బస్తా కిచ్చే రూపాయే చాలు. మీ ఇంట్లో ఆవకాయుంటే మాత్రం రెండు ముక్కలెట్టండి’’ ప్రాధేయపడీవోడు. ఆడికి ఆవకాయ డొక్కలంటే అంతపిచ్చి. ఆడికి మరో పిచ్చి కూడా ఉందనుకునేవారంతా. అదేటంటే పక్కవారికి చేతనయినంత సేవచేసేయాలనే తాపత్రయం.

‘‘ఈడికేం పిచ్చా.. ఈడికొచ్చే ముస్టి మూడణాళ కూలి కూడా పక్కోరి కోసం ఖర్చెట్టెస్తున్నాడే..ఇల్లు పిల్లల్లేని బ్రహ్మచారిగోడు గాబట్టి సరిపోయింది. నేపోతే ఈడి పేరు చెప్పుకుని సంసారం చేటమూలకొచ్చీసీది’’ బొగ్గుల సుబ్బారావు తిట్లు అన్నదానపువారి వీధంతా రోజూ వినబడుతూనే ఉండీవి.
సుబ్బారావు తిట్టాడని కాదుగానీ అప్పల్నాయుడు అలాటోడే. ఎవుడైనా ఆకలంటే చాలు. నాయుడు కదిలిపోయీవోడు. జేబులో కాణీ లేకపోయినా ఆకలితో ఉన్నోడికి అగ్గాల సన్నాసి టీకొట్టో అరువు టీ పోయించీసీవోడు. ఊళ్లో పెళ్లయినా, పేరంటవయినా పిలవకుండానే వచ్చే కూలీ అప్పల్నాయుడే.

పందిర్రాట పాతడం నుంచీ ఎంగిలాకులు ఎత్తడం వరకూ అన్నింట్లోనూ కలుగజేసుకునీవోడు. ఇక చావయితే కొరివిపెట్టే కొడుకులయినా రాడం ఆలస్యమోమో గానీ ఈడు మాత్రం పీనుగ దగ్గర రెడీ. ఏడిచీ వోళ్లతో ఏడిచీ వోడు. ఆఖర్న శంఖం ఊదుకుంటూ శవాన్ని రుద్రభూమికి తీసుకుపోయీవోడు. కపాలమోక్షమైతేనే గానీ తిరిగొచ్చీవాడు కాదు. ఆడున్నాడన్న భరోసాతో కాలుతున్న కాయాన్ని వదిలిపెట్టి చక్కావచ్చీసీది బంధుగణం.

నాయుడికి మరో చిత్రమైన అలవాటుండేది. రెండు చెవుల్లోనూ రెండు అర్ధరూపాయి బిళ్లలు దోపుకుని తిరుగుతుండీవోడు. భలే లాఘవంగా వాటిని చెవి కన్నం మీద మూతలేసినట్టు పెట్టుకునీవోడు. బుర్ర ఎటు తిప్పినా పడకుండా అమర్చుకుని నిమానుగా నడుస్తుండీవోడు.
‘‘బనీనుకి జేబుండగా చెవుల్లో డబ్బులేట్రా’’ అనడిగితే, ‘‘చెవుల్లో ఉంటేనే కదా. అడిగినోడికి డబ్బుల్తీసి చకాచకా ఇచ్చీవచ్చు..’’ కస్సుమనీవోడు.

అలాంటి కంపల్సరీ అప్పల్నాయుడు వయసుమీద పడ్డాక నానా కష్టాలూ పడ్డాడు. ఎవరేనా పెడితే తినీవోడు. లేదంటే పస్తే. పూసర్ల సీతారామయ్యగారి సత్రం అరుగుమీదే కాలక్షేపం చేసీవోడు.
ఒకానొకరోజు భూమ్యాకాశాలు బద్ధలయ్యేలా వాన మొదలైంది. చోడవరం సముద్రంలా మారిపోయింది. గునిశెట్టివీధి, గూనూరు వీధి, చావలి వారి వీధి, బుక్కావారి వీధి తేడా లేదు. అంతా గంగాప్రవాహమే. పిట్టలు గూళ్లు వదల్లేదు. పిట్టమనిషి ఇంట్లోంచి పైకి రాలేదు. తలుపులు బిడాయించుకుని కలిగిందేదో తిని ముసుగుతన్ని పడుక్కున్నారు. ఎవడూ అప్పల్నాయుడి సంగతే పట్టించుకోలేదు.

‘‘ఆడుంటే ఎంత. పోతే ఎంత..’’ అన్నట్టుగా మూడు రాత్రులు మూడు పగళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎరగ్రా ఎండకాసేనాటికి చూస్తే సత్రం అరుగుమీద అప్పల్నాయుడున్నాడు. ప్రాణమే లేదు.
‘‘ఎంతసేపిలా. చాకలి జంపా చినసన్నాసిని పిలవండి. మరో నలుగుర్ని వెంటతెచ్చుకోమనండి.
దహనం కానీండి.’’ కరణం బాబు నరసింహ సిద్ధాంతి గారి పెద్దగొంతు హడావుడి చేసింది.కందర్ప అశోక్ రంపపు మిల్లు వెనకాలున్న శ్మశానానికి నాయుడి శవాన్ని మోసుకుంటూ పోయారు. నా అన్న వారు లేని నాయుడికి సన్నాసే కొరివిపెట్టాడు. మెల్లగా కరమ్రుక్కలు కిరసనాయులు కలిసి మంట మొదలైంది. చిత్రంగా అర్ధగంటయినా శవం మాత్రం కాల్లేదు. సన్నాసి తన శవదహనం సీనియార్టీ అంతా ఉపయోగించినా అప్పల్నాయుడు బుగ్గవడం లేదు.

‘‘పిల్లా జెల్లా లేనోడు. ఈడికి తీరని కోరికలేం ఉంటాయి’’ అంటూ తమలో తామే ఆర్గ్యుమెంటు చేసుకున్నారు. సన్నాసికి అప్పుడు బురల్రో ఆలోచన మెరిసింది.
‘‘ఒరేయి ఎవరిదగ్గరయినా రెండు అర్ధరూపాయి కాసులున్నాయేట్రా..’’ అరిచాడు.
నాయుడితో కరస్రాము చేసీ కన్నయ్యగాడో రూపాయి, నూకయ్యగాడో రూపాయీ తీసిచ్చారు. డబ్బు బిళ్లలు చెవుల్లో పదిలంగా దూరాయో లేదో పెఠీల్ పెఠీల్మంటూ చితి అంటుకుపోయింది.

- చింతకింది శ్రీనివాసరావు


సాక్షి, 28-11-2010, ఆదివారం, అనుబంధం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి