యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దుల్లో ఎందరు సైనికులు మరణిస్తారో తెలియదు గాని పేద, మధ్య తరగతి జీవితాలు మాత్రం చితికిపోతాయి. రోజు గడవటమే దుర్భరమైపోతుంది.
అవి బర్మా మీద జపాను దురాక్రమణ చేసిన రోజులు. మా పెళ్లయి రెండేళ్లయింది. కుటుంబ జీవితానికి
అలవాటు పడుతున్నాం. మా ఆయనకు మంచి ఉద్యోగమే ఉండేది. కాని యుద్ధంతో మా కల చెదిరింది.
ఉద్యోగమూడింది.
ఇంటద్దె కట్టలేక వీధిలో పడ్డాం. పసిపిల్లాణ్ని సముదాయించటం కష్టమైంది. వాడి ఆకలి కూడా తీర్చలేని
దీనస్థితి దాపురించింది. యుద్ధమంటే అదేను.
ఆ రోజుల్లో వ్యాపారమంటే తెలియనివాళ్లు కూడా చిల్లర వ్యాపారస్తులుగా మారారు. ఏదుంటే అది వీధిలో అమ్మకానికి పెట్టటమే. బజారులో నిలబడి బహిరంగంగా అమ్మలేనివాళ్లు, మా ద్వారా వస్తువులు బేరానికి పెట్టారు. ఎంతో కొంత కమీషన్ వస్తుంది, రోజు గడిస్తే చాలు, ‘నిస్సందేహంగా ఇది ఈజీ మనీ’ అంటారు మీరు. కాస్త ఓపిక పట్టండి. త్వరలోనే మీ అభిప్రాయం మారుతుంది.
మేం ఫుట్‌పాత్ మీద వస్తువులు పెట్టుకుని నిల్చుంటామా, కస్టమర్లు వచ్చి వాటిని ఎగాదిగా పరిశీలిస్తారు. ‘‘ఫ్రీగా ఇచ్చినా ఎవరూ తీసుకోరు వీటిని’’ అన్నట్టుగా ఉంటాయి వాళ్ల కళ్లు. చివరికి మామీద ‘జాలిపడి’,
‘‘ఈ బట్టల సబ్బులెంతకమ్ముతావు?’’
‘‘ఒక క్యాట్ (బర్మీస్ కరెన్సీ)కు అయిదు సబ్బులు.’’
‘‘అయ్య బాబోయ్, అంత ధరా? ఒక క్యాట్, పది పైసలకు ఆరిస్తావా?’’
నాకు బుర్ర తిరిగింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అని తెలుసు. కాని కస్టమర్ను వదులుకోగూడదు. ‘‘తీసుకోండి’’ అన్నాను. నష్టమే. కాని తప్పదు. అయితే, అప్పటికైనా అవి అమ్ముడుబోయాయనుకుంటున్నారా?
‘‘ఎనభై పైసలకు అయిదిస్తావా?’’
‘‘తీసుకోండి. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి’’ అంటూ కాస్త కోపంగా చూశాను.
మొత్తం మీద మా వ్యాపారం అలా వెలిగిపోయింది. జనం మమ్మల్ని చచ్చువెధవల్లా జమ కట్టారనటానికి చాలా ఉదాహరణలున్నాయి. కాని, ఆ ఉదాహరణలన్నీ ఇప్పుడు నెమరేసుకోవటమెందుకు. మా ఇంట్లో ఉన్న వస్తువులే కొద్ది. అవి కూడా అదృశ్యమైనాయి. బజార్లో నిల్చున్నప్పుడు వచ్చీ పోయే జనాన్ని చూసి, సంతోషంతో కేరింతలు వేసింది మా వాడే. మేం కస్టమర్లతో మాట్లాడుతుంటే, చేతుల్లోంచి జారి, అటూ ఇటూ పరిగెత్తటం వాడి ఆట.
కడుపు నిండినవాళ్లు, విలాస భవనాలలో సుఖాసీనులై పేదరికాన్ని అందంగా వర్ణిస్తూ కవిత్వం రాస్తారు. సింపుల్ లైఫే గొప్పదంటారు. మాది సింపుల్ లైఫంటారా? మా భాషలో ఓ సామెత ఉంది.
‘‘మట్టిని తొలిచే పురుగుకే తెలుస్తుంది - రాళ్లెక్కడ అడ్డం పడుతున్నాయో. పువ్వుల మీద వాలే సీతాకోకచిలుక ‘కష్టేఫలి’ అంటూ దానికి నీతి బోధ చేస్తుంది’’ సాధుపుంగవులకు పేదరికంలో మోక్షమార్గం గోచరిస్తుందేమో గాని, మాకు మాత్రం ఇది ప్రత్యక్ష నరకం.
కొన్నాళ్లకు, మాకు గవర్నమెంటాఫీసులో ఉద్యోగం వచ్చింది. అప్పటికి అమెరికా, ఇంగ్లండు సంయుక్త దళాల విమాన దాడులు ప్రారంభమయ్యాయి. పక్కా ఇళ్లలో ఉండటం వీలుపడదు. రోజుకో కొత్తచోట ఏ పాకలోనో తలదాచుకోవాలి. ఆ క్రమంలో ఒంటిమీది బట్టలు తప్ప మాకంటూ మరేమీ మిగల్లేదు. చివరికి, ఊరి పొలిమేరల్లో ఓ రేకుల షెడ్డులో కాపురం పెట్టాం. అదృష్టవశాత్తూ, అక్కడ నుండి మా ఆఫీసు చాలా దగ్గర. పనిచేస్తూ కూడా మధ్యలో వచ్చి మావాణ్ని చూసుకోగలిగాను. ఎయిర్‌రెయిడ్ సైరన్ వినిపించగానే, ఇంటికి పరిగెత్తి మావాణ్ని గుండెలకు హత్తుకుని ఓ మూలన నక్కుతాను.
రెయిడ్స్ సంగతెలా ఉన్నా మాకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. గవర్నమెంట్ నౌకరీ అంటే నలుగుర్లో కాస్త హోదా కూడా ఉంటుంది. జీతం సరిపోదు కాని, అది దిగువ మధ్య తరగతి వాళ్లందరికీ ఉండే సమస్యే. ఫస్టుకు జీతం రాక, ఉపవాసాలున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అవునండీ, పాలు, తేనె ప్రవహిస్తున్న బర్మాలోనే ఉన్నదీ పరిస్థితి.
బియ్యం దొరికేవి. కాని, ఉత్తర బర్మా నుండి రావలసిన వంటనూనె సరఫరా ఆగిపోయింది. ఒక దశలో, జంతువుల కొవ్వు మీదే ఆధారపడవలసి వచ్చింది. వంటల్లో వేస్తే ఆ కొవ్వు ఎలా ఉంటుందనుకున్నారు? పైన, తెట్టె కట్టినట్టు తేలుతుంది. దుర్వాసన. నూనె లేని వంటలతో ప్రయోగాలు చేశాను. చిలగడదుంప, సీమగోగు ఆకులతో వండితే బాగానే ఉందనిపించింది.
ఎన్ని కష్టాలొచ్చినా మా ఆయన మొహం మీద చిరునవ్వు చెరగలేదు. ఏది పెట్టినా సంతోషంగా తిన్నాడు. అంటే, వేదాంత ధోరణి అలవరచుకున్నాడు. భోజనం ముందర కూర్చోగానే, ‘అద్భుతం. ఏమి ఘుమఘుమ. నీ చేతివంట అమృతం’ అనటం అలవాటు చేసుకున్నాడు. ఆ పొగడ్తలే నా కొత్త ప్రయోగాలకు ప్రేరణ.
కట్టుకోవటానికి బట్టలు లేవంటారా? బెడ్ షీట్లు, కర్టెన్లు, టేబుల్ క్లాత్‌లు ఏవైనా సరే-పైజామాలు, అంగీలుగా కుట్టుకోవచ్చు. పాత నాప్కిన్‌లతో మావాడికి షర్టులు కుట్టాను.
యుద్ధం కొనసాగింది. రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. జపాన్‌వాడు యెన్ (జపాను కరెన్సీ) నోట్లు జారవిడిచాడు. కాని, అవి ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి. మాకేమీ దొరకలేదు. చిల్లర కొట్లవాళ్లు, పెద్ద వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు రెండు చేతులా సంపాదించారు. వాళ్ల ఇళ్లల్లో గోనెసంచుల నిండా డబ్బే.
ఒకప్పుడు మా ఇంట్లో బట్టలుతికిన పనిమనిషి ఇప్పుడు చిన్న కొట్టు తెరిచింది. వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది. కాస్త లావెక్కింది. ఖరీదైన దుస్తులు వేసుకుంది. నగలు పెట్టుకుంది. మాసిన, చిరిగిన డ్రస్సులో ఉన్న నన్ను చూసి, ఆశ్చర్యపోయింది. ఎరక్కపోయి ఆ కొట్టుకెళ్లాను. ఏదో మాట్లాడాలి గనక, ‘ఎండు చేపలెట్లా ఇస్తున్నా’వని అడిగాను. అవి చాలా ఖరీదని నాకు తెలుసు. నా దగ్గర అంత డబ్బులేదు.
‘‘జబ్బుపడ్డారా? ఇదేం వాలకమమ్మా?’’ అని అడిగిందావిడ. నోట మాట రాలేదు. నా ఇబ్బందిని గమనించిందేమో, అయిదారు చేపలు పొట్లం కట్టించింది. తలకొట్టేసినట్టయింది. ‘వద్ద’న్నాను. ‘తీసికెళ్ల’మని బలవంతం చేసింది. నాకు దుఃఖం ఆగలేదు. ఎంతగా ఏడ్చానంటే, పొట్లంలోని చేపలు, ఆ కన్నీటిలో ఈదులాడగలవు.
ఆ రాత్రి భోరున వర్షం కురిసింది కాని, విమాన దాడుల నుండి ఒక్కరోజన్నా విరామం దొరికినందుకు మహా సంబరపడిపోయాం. చూరు కారింది. ఇల్లు కొలనైంది. పొడిగా ఉన్న నేల, అంగుళమైనా మిగల్లేదు. టిన్ను డబ్బాల్లో కురుస్తున్న నీటి సంగీతంతో, మావాడు బాగానే నిద్రపోయాడు. కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం. మా ఆయన చుట్ట వెలిగించి, హాస్యకథల పుస్తకమొకటి తీసి, బిగ్గరగా చదివాడు. నేను నవ్వలేకపోయాను. ఎండుచేపలు జ్ఞాపకం వచ్చి, సిగ్గు, అవమానంతో కుంచించుకుపోయాను.
మా ఆయన నా ఆలోచనల్ని బాగానే పసిగట్టగలడు. నవ్వకుండా, ఊఁ కొట్టకుండా వింటే ఎవరికైనా అనుమానమొస్తుంది. ఇక, లోపలి ఆరాటాన్ని అణచుకోలేక, ‘‘జపాను వాడి నోట్లు మనకెందుకు దొరకవు? ఈ ఉదయం మన పాత పనిమనిషి కనిపించింది. బాగా సంపాదిస్తున్నది. ఇప్పుడు నువ్వామెను గుర్తుపట్టలేవు. ఎన్ని నగలో, ఎంత ఠీవో!’’ అంటూ అరిచాను.
‘‘మనమూ ప్రయత్నిస్తున్నాంగా!’’ అన్నాడు ఆయన.
‘‘ఇదేనా బతుకంటే? అందరూ డబ్బు చేసుకుంటున్నారు. బ్రోకర్లు, ఏజెంట్లు రాత్రికి రాత్రే లక్షాధికారులైపోతున్నారు. వాళ్లకు చదువు రాదు. పెద్దగా పెట్టుబడి కూడా పెట్టలేదు. అమ్ముకున్న వాడికేమీ గిట్టదు. కొన్నవాడి దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. దండుకునేది మాత్రం మధ్య దళారులు.’’
మా ఆయన నవ్వుతూ, హాస్యకథల పుస్తకాన్ని చూపించి, ‘‘ఇందులో నీలాంటి పాత్రలే ఉంటాయి’’ అన్నాడు.
‘‘నీ జోకులు చాల్లే. ‘రోజులు బాగాలేవు. కాగితం నోట్లను బంగారం, వజ్రాలుగా మార్చి దాచుకోవాలి’ అని చెబుతున్నారు తెలివైనవాళ్లు.’’
ఆయన అర్థంకానట్టుగా చూశాడు.
‘‘అయితే నన్నేం చేయమంటావు? నా దగ్గర బంగారమూ లేదు. వజ్రాలూ లేవు.’’
నేనే మూర్ఖురాలిననుకుంటే, మా ఆయన మహామూర్ఖుడిలాగున్నాడు.
‘‘నీ దగ్గర లేవని నాకూ తెలుసు. అవి ఉన్నవాళ్లను పట్టుకోవాలి. అలాగే, కొనేవాళ్లనూ వెదకాలి. ఇక్కడ కొని, అక్కడ అమ్ము. కమీషన్ తీసుకో. ఒక్క వజ్రం అమ్మినా, ఏడాది పాటు ఇద్దరం కలిసి సంపాదించిన దానికన్నా రెట్టింపు వస్తుంది. వంటనూనె లేక, ఎంత ఇబ్బందిగా ఉందో! డబ్బొస్తే ఒక టిన్ను నువ్వుల నూనె కొనుక్కోవచ్చు.’’
ఆ మాటకే నోట్లో నీరూరినట్టుంది.
‘‘అవును. నువ్వుల నూనె భలే రుచిగా ఉంటుంది. కాని వజ్రాలు అమ్మేదెవరు? కొనేదెవరు?’’
‘‘ఆ విషయం నాకు వదులు’’ అన్నాను.
- 2 -
అలా ప్రారంభమైంది కథ. ఆఫీసులో, ఒకరి కష్టాలొకరం చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు, ‘‘నీకొక్కడే కొడుకు. నాకు ముగ్గురు పిల్లలు. నా జీతం మీదే ఆధారపడితే ఇల్లు గడవదు. అందువల్ల మా ఆవిడ అదనంగా సంపాదిస్తుంది. ఆమె పెద్దగా చదువుకోలేదు-పేరు రాయగలదు. అంతే. మొన్న మా ఇంటి పక్కనున్న ధనికురాలొకావిడ డైమండ్ బ్రేస్‌లెట్ కొంటానన్నదట. నగ బాగుంటే లక్షయినా ఫరవాలేదన్నదట. ఇంకేముంది. మా ఆవిడ అమ్మటానికి సిద్ధంగా ఉన్న మరో ఆసామిని పట్టుకుని తొంభై వేలకే కొని లక్షకమ్మింది.’’
‘‘పదివేలు లాభమా!’’ అంటూ నోరెళ్లబెట్టాను.
‘‘లేదు. అంతకన్నా ఎక్కువే. అమ్మకానికి పెట్టినాయన 25 శాతం కమీషన్ కూడా ఇచ్చాడు.’’
నాకు లెక్కలు బాగా రావు. అంటే, 10,00-0+ 25-/-1-00x1,00,000. ఎంతన్నమాట? కాగితం, పెన్ను లేకుండా పెద్ద లెక్కలు చెయ్యటం కష్టమే.
‘‘ఏమీ చదువుకోని మా ఆవిడ చెయ్యగలిగినప్పుడు నువ్వెందుకు చెయ్యలేవు?’’ అంటూ నాకు పురెక్కించారు మిత్రులు.
మరునాడు, మా కొలీగ్ భార్యను కలిశాను. చదువు రాకపోతేనేం? ఆమె ఎంత తెలివైందో తెలుస్తూనే ఉంది. ఇక్కడ కొని, అక్కడ అమ్మినందుకు ముప్ఫై అయిదు వేలు సంపాదించింది.
‘‘మీ చదువుకున్న వాళ్లంత తెలివితక్కువ వాళ్లు లేరు. బేరం చేసి పెట్టగలిగినవాళ్లకు మంచి గిరాకీ ఉంది. ఒకాయనకు పదమూడు క్యారెట్ల వజ్రం కావాలట. క్యారెట్‌కు లక్ష కాకుండా, 25 శాతం కమీషన్ కూడా ఇస్తాడట. నువ్వు బేరం చేసి తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకమ్మితే, మరింత డబ్బు అదనంగా మిగులుతుంది. పోనీ, అది లేదనుకున్నా, నీకెంతొస్తుందో తెలుసా? 25/100x1,00,000 x13!!
13 క్యారట్ల వజ్రం ఎక్కడ దొరుకుతుంది?
‘‘ఆ విషయం తెలియదు. కాని, కొనటానికి ఎబ్రహీం అని ఒక పెద్దమనిషి రెడీగా ఉన్నాడు.’’
ఇంటికొచ్చి, ఆ రాత్రి మా ఆయనతో చెప్పాను. ధనిక బంధువుల, పరిచయస్తుల పేర్లన్నీ పరిశీలించాం. తింగాంగ్యున్‌లో ఒకావిడ బంగారు నగల వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. కాని, అక్కడికి చేరుకోవటానికి బస్సులో అయిదారు గంటలు పడుతుంది. ఫరవాలేదు. బస్సు చార్జీలకు డబ్బెందుకు తగలెయ్యాలి.
మా దగ్గరో సైకిలుంది. ఏ కాలంనాటిదో తెలియదు, బహుశా మొదటి తరం సైకిలు కావచ్చు. ఫ్రేము ‘రాలే’ కంపెనీది. చక్రాలు హంబర్‌వి. టైర్లు పంచరైనట్టుంది. రబ్బరు ముక్కలతో అత్యవసరమైన రిపేర్లన్నీ చేశాం. అయితే, చక్రాలకు సాలిడ్ రిమ్స్ ఉన్నాయి. అంటే, గాలికొట్టవలసిన పనిలేదు.
ఆదివారం, ఇంకా తెల్లవారకముందే లేచి, మా ప్రయాణం ప్రారంభించాం. నేను వెనక సీటు (తుప్పు పట్టింది) మీద, మావాణ్ని ఒళ్లో పెట్టుకుని కూర్చున్నాను. గుంతల రోడ్డుమీద మా ఆయన సైకిలు తొక్కాడు. నేను పాటలు పాడాను. మావాడు సంతోషం పట్టలేక, నానా అల్లరీ చేశాడు.
అదృష్టవశాత్తూ, మా ఆంటీ ఇంటి వద్దే ఉంది. వజ్రం కావాలి. వచ్చిన లాభంలో ఆమెక్కూడా కొంత ఇస్తామని చెప్పాం.
‘‘అబ్బే, నా దగ్గరేమీ నగలుండవు. మీలాగే నేను కూడా ఏజెంటును. వారం తర్వాత రండి. ప్రయత్నిస్తాను’’ అందావిడ.
ఆ రోజు వాతావరణం బాగుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. అంటే ఎయిర్ రెయిడ్స్‌కు అనుకూలంగా ఉందన్నమాట. తిరుగు ప్రయాణంలో సైరన్ మోగింది. ఎప్పుడైనా బాంబులు పడవచ్చు. ఇంటికి చేరుతామని ఆశలేదు. కాని, అదృష్టం కలిసొచ్చింది.
- 3 -
వారమంతా విమానదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కనాడూ కడుపునిండా తిన్నామని చెప్పుకోవటానికి లేదు. వజ్రం అమ్మితే, వచ్చే కమీషన్ లెక్కలు వేసుకుంటూ గడిపాను. అన్నీ కూడికలు, గుణకారాలే.
ఆదివారం నాడు మళ్లీ ఆంటీ ముందర వాలాం. 13 కారెట్ల వజ్రం ఎవరి దగ్గరుందో తెలుసంది. అంతకన్నా సంతోషకరమైన వార్త మరేముంటుంది! ‘‘మీరు ఎబ్రహీంను తీసుకురండి. అమ్మే ఆసామితో కలిపిస్తాను’’ అంది.
ఈల పాట పాడుకుంటూ సైకిల్ మీద ఇంటికి బయల్దేరాం. ప్రతీ ఆదివారం ఇలాగే సైడ్ బిజినెస్ చేస్తే, మా కష్టాలన్నీ తీరవా! అంతా అనుకున్నట్టే జరిగితే, ఉద్యోగాలకు రాజీనామా చేయొచ్చు. హీనపక్షం వారానికి పదివేలు సంపాదించామనుకో... అయితే, సైకిల్ గుంతలో పడి చక్రం వంగిపోవటంతో నా కలలకు బ్రేకుపడింది. టైరు ఊడి వచ్చింది. చేతిలో పట్టుకుంటే చచ్చిన పాములాగుందది.
రిపేర్ చెయ్యటానికి పనిముట్లు లేవు. అక్కడ ఉండిపోవటానికే లేదు. సైరన్ మోగింది. సైకిల్ తోసుకుంటూ ముందుక్కదిలాం. ఇంటికి చేరి, మళ్లీ ఆదివారం, రెబ్రహీంను తీసుకుని తింగాంగ్యున్‌కెళ్లాలి. ఆ తర్వాత డబ్బే డబ్బు. రోజూ విందు భోజనాలారగిస్తాం. మఖమల్ దుస్తులు వేసుకుంటాం.
రాత్రంతా కష్టపడి మా ఆయన సైకిల్ రిపేర్ చేశాడు.
ఆదివారం రానే వచ్చింది. సైకిల్ తొక్కుకుంటూ ఎబ్రహీం కూడా వచ్చాడు. నలుగురం (మా వాడితో సహా) తింగాంగ్యున్‌కి బయల్దేరాం.
ఆంటీ మమ్మల్ని లోపలికి ఆహ్వానించి, అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు పరిచయం చేసింది. అందులో ఒకడు కుర్రాడు. మరొకతను మెడలో బంగారు గొలుసు, ఉంగరాలు, బంగారు వాచ్ పెట్టుకుని హుందాగా కూర్చున్నాడు. అతని దగ్గరే ఉండాలి వజ్రం. ఆయన పేరు కోసెట్ క్వాన్.
వజ్రం చూపించమన్నాడు ఎబ్రహీం.
‘‘కొనేది నువ్వేనా?’’ అన్నాడు కోసెట్ క్వాన్.
ఇదే అవకాశంగా ఎబ్రహీం తన ఆస్తిపాస్తుల వివరాలన్నీ చెప్పాడు. కాని, కోసెట్ క్వాన్ ఇంప్రెస్ అయినట్టుగా లేడు.
‘‘నిజంగా కొంటావా? కొనగలవా?’’
ఎబ్రహీంకు కోపం వచ్చిన మాట నిజమే. అయినా కోటీశ్వరుల ముందు లక్షాధికారులు తలవంచక తప్పదు.
తను కూడా ఒక ఏజెంటుననీ, మరొకరి తరఫున వచ్చాననీ చెప్పాడు ఎబ్రహీం.
‘‘నేను డెరైక్టుగా ఆయనతోనే మాట్లాడతాను’’ అన్నాడు కోసెట్‌క్వాన్.
వెంటనే అసలు కొనుగోలుదారుణ్ని వెతకటానికి బయల్దేరాం - ఎబ్రహీం, నేను, మా ఆయన, ఆంటీ తరఫున అక్కడున్న కుర్రాడు, మరీ ముఖ్యంగా కోసెట్ క్వాన్. మొత్తం నాలుగు సైకిళ్లు.
దారిలో ప్రతి టీషాపు వద్దా బ్రోకర్ల కోలాహలమే.
కొన్ని మైళ్ల ప్రయాణం తర్వాత ఎబ్రహీం ఓ ఇంటి ముందాగాడు. అందరూ ఇంట్లోకెళ్లారు. నేను సైకిళ్లకు కాపలాగా అక్కడే నిలబడ్డాను. అయిదారు నిమిషాలైందో లేదో మా ఆయన బయటికొచ్చాడు. ఆయన మొహం చూడగానే విషయం అర్థమైంది. ప్రాచీన గ్రీకు నాటకాలలో అత్యంత విషాదకరమైన సంఘటనలను ప్రతీకాత్మకంగా మాత్రమే ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఆయన కూడా మరెవరికో ఏజెంట్ అని గ్రహించాను.
అమ్మేవాళ్లకు వందమంది బ్రోకర్ల గొలుసుంటే, కొనేవాళ్లకు రెండు వందలమంది బ్రోకర్ల గొలుసుంటుంది.
ఆ పదమూడు క్యారెట్ల వజ్రం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసినా నా జన్మధన్యం కాదా!
రచయిత్రి పరిచయం
మయన్మార్‌కు చెందిన డా ఖిన్ మ్యో చిట్ (1915-99) కథలు బర్మీస్‌తోపాటు ఇంగ్లిష్ పత్రికల్లోనూ అచ్చయినాయి. స్కూలు టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే బౌద్ధ ధ్యానమందిరాన్ని నిర్వహించిన ఈమె కథా సంకలనం ‘13 క్యారెట్ డైమండ్ అండ్ అదర్ స్టోరీస్’.
రెండవ ప్రపంచయుద్ధ కాలంలోని సంక్షుభిత బర్మీస్ సమాజానికి అద్దంపట్టిన ‘13 క్యారెట్ల వజ్రం’ ఆమె స్వానుభవంలోంచి వచ్చింది. రచనాకాలం 1946. బ్యాంటమ్ క్లాసిక్స్ వారు వెలువరించిన ‘50 గ్రేట్ ఓరియెంటల్ స్టోరీస్’లో ఈ కథను చేర్చారు.
బర్మీస్ మూలం: డా ఖిన్ మ్యో చిట్
తెలుగు: ముక్తవరం పార్థసారథి
సాక్షి, ఫండే, 12-12-2010 నుండి..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి