ఆయాసపడ్డాడు రామ్మూర్తి. అతడు మంచంపట్టి నెలరోజులకు పైనే అయ్యింది. గుమ్మాలు, గోడలు పట్టుకుని వీధిగుమ్మంలో కూర్చున్నాడు.
కొత్త ఆటోరిక్షా రాగానే ఇంట్లోకి ఆ వార్తను ప్రసారం చేశాడు.
కమలమ్మకు ఆయన మాటలు స్పష్టంగానే వినిపించాయి. కమలమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఒక షేర్ ఆటోరిక్షా ఇంటికి వచ్చి, ఆమెను ఎక్కించుకుంటుంది. ఈ రకమైన ప్రయాణ సదుపాయం అమరబట్టే కమలమ్మ అంత వృద్ధాప్యంలోనూ ఆ మాత్రం జీతం రాళ్లు తెచ్చుకుంటోంది.
రామ్మూర్తి రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా పదవీవిరమణ చేశాడు. చిన్న ఉద్యోగిగా దిగిపోవడంతో పెన్షన్ చాలడం లేదు.
‘‘నేను వెళ్లిరానా?’’ అడిగింది కమలమ్మ.
‘‘డ్రైవర్‌తో ఒకసారి నువ్వు మాట్లాడు. తన బదులుగా ఇతడిని ఎందుకు పంపించాడు? మొబైల్ ఫోన్‌లో డబ్బులున్నాయా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘డబ్బులు లేవు. అయినా ఇతడినే అడిగితే పోలేదా?’’ అంటూ కమలమ్మ ఆటోరిక్షాను సమీపించింది.
‘‘అమ్మగారూ! బయల్దేరడానికి ఆలస్యం ఉందా? ‘సరిగ్గా ఎనిమిదిన్నరకే బయలుదేరతారు టీచర్‌గారు’ అన్నాడే నన్ను పంపిన డ్రైవర్’’ చెప్పాడు కొత్త డ్రైవర్.
కమలమ్మ సంశయిస్తూ, ‘‘నిజమే, కొత్తవాడివని సంశయిస్తున్నాను. ఈ రోజుకు సిటీబస్సులో బయల్దేరతాన్లే’’ అంది.
అతడు నవ్వి, ‘‘మీ షేర్ డబ్బులు ఇచ్చెయ్యండి. వెళ్లిపోతాను. మిగతావాళ్లు బయల్దేరాలి కదా’’ అన్నాడు.
సందేహం లేదు. పాత డ్రైవర్ ఇతన్ని బెత్తాయించి ఉంటాడు. రామ్మూర్తి తన భార్యవైపు సాలోచనగా చూశాడు. కమలమ్మ తన పర్స్ వెతుక్కుంది. పర్స్‌లో ఎనిమిది రూపాయలున్నాయి. షేర్ ఆటోకి అయిదు రూపాయలు ఇచ్చేస్తే, ఇక మూడు రూపాయలు మాత్రమే మిగులుతాయి. అవి సిటీబస్సుకు చాలవు.
ఆర్టీసీ వాళ్లు చార్జీలు తెగ పెంచేశారు.
ఇక తప్పక, కమలమ్మ కొత్త డ్రైవర్ వెంట స్కూల్‌కి బయల్దేరింది. రామ్మూర్తి తమ వాకిలి అంచువరకూ జరిగి, వెళ్లిపోతున్న ఆటోరిక్షా కనిపించినంత మేరా చూస్తుండిపోయాడు. వెనక్కి తిరగబోయి ఆగాడు.
‘‘మరో ఆటోరిక్షాను పంపించావు కదా. తీసుకువెళ్లాడు’’ అన్నాడు రామ్మూర్తి.
విస్మయంగా చూశాడు డ్రైవర్.
‘‘అయితే నువ్వు పంపలేదా?’’ దడను మరింత పెంచుకున్నాడు రామ్మూర్తి.
‘‘ఎలా ఉంటాడండి?’’ అడిగాడు డ్రైవర్.
‘‘నువ్వు రాలేకపోయినప్పుడు ఫోన్‌చేసి చెప్పలేకపోయావా?’’ తన ధోరణిలో తానున్నాడు ముసలాయన.
‘‘ఆటోస్టాండ్ పక్కనే రోడ్డు ప్రమాదం జరిగిందండి. పోలీసులు మమ్మల్ని ఎవరినీ కదలనివ్వలేదు. వాళ్లు వదిలారంటే టీవీనాయాళ్లు పట్టుకుని, ప్రశ్న మీద ప్రశ్న వేసి చావగొట్టారు. అయినా నేను వేరెవ్వరినీ పంపనని అమ్మగారికి బాగా తెలుసు.’’
‘‘మరి, తెలిసే ఎలా వెళ్లిపోయింది?’’
‘‘ఫరవాలేదులెండీ. నా బేరాల విషయం తెలిసినవాడే వచ్చి ఉంటాడు. నాకు చెప్పడానికి కుదిరి ఉండదు.’’
‘‘అలా అయితే నువ్వు పంపించినట్టు అబద్ధం ఎందుకు చెబుతాడు?’’
రామ్మూర్తి తల ఊపి మళ్లీ, ‘‘కేవలం బేరం కోసం వచ్చి ఉంటే సమస్య లేదు. వేరే ఉద్దేశంతో వచ్చి ఉంటేనే ఇబ్బంది’’ అన్నాడు.
ఆటో డ్రైవర్ ధీమాగా తల ఎగరేసి, ‘‘మన ప్రాంతంలో అలాంటి ప్రమాదం లేదు సుమండీ!’’ అన్నాడు.
‘‘అది సరే. మిగతావాళ్లు కూడా ప్రయాణించారో లేదో?’’
‘‘నేను తెలుసుకుంటాను’’ సెలవు తీసుకుని డ్రైవర్ వెళ్లిపోయాడు.
రామ్మూర్తి తలపంకించి గోడలు, తలుపు ఆసరాతో లోపలికి నడిచి, తన వెనుక తలుపు చెక్క గడియ వేశాడు. మంచం సమీపించి వెల్లకిలా పడుకున్నాడు. అతడి పక్కనే ముక్కాలిపీట ఉంది. పీటమీద మాత్రలు, మందుల సీసాలు ఉన్నాయి.
ఒంటరితనంలో కూరుకుపోయాడు రామ్మూర్తి. కమలమ్మ పదే పదే గుర్తుకొస్తోంది. ఆమె స్కూలుకు క్షేమంగా చేరిందా? లేదా? ఎలా తెలుస్తుంది?
డ్రైవర్ దురుద్దేశంతో ఉంటే కనీసం కేకలు పెట్టగలిగే వయస్సు కూడా కాదు.
ఆమె మెడలో ఉండే మూడు తులాలతాడు గుర్తొచ్చింది. గొలుసులు తెంచుకుపోయే సంఘటనలకు భయపడి, బీరువాలోనే వదిలిపెట్టి వెళ్లింది భార్య. అంతవరకూ నయం! కాని, ఇంట్లో తానొక్కడూ...
రామ్మూర్తి గుండెలో ఆరాటం మొదలయ్యింది. గుండెలో ఏ మూలో భయం కలుగుతోంది. కలుక్కుమనే నొప్పి సైతం ప్రారంభమయ్యింది. ఈ వయసులో, తానున్న ఈ పరిస్థితిలో కమలమ్మకు ఏం జరిగినా తాను తట్టుకోలేడు.
తనది బొత్తిగా అవిటి బతుకు అయిపోయింది. తమకి పిల్లలు లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది. ప్రాణ భయంతో ఆయనకి గొంతు తడారిపోతోంది.
ఉన్నట్టుండి రామ్మూర్తి కళ్లు పెద్దవయ్యాయి. గుమ్మంలో ఒకరు నిలబడి ఉన్నాడు. మొదట, అదంతా తన భ్రమ అనుకున్నాడు. కాని కాదు.
‘‘ఏం తాతగారూ?’’ అన్నాడతడు.
‘‘నువ్వా?’’ గుండె మీద చెయ్యి వేసుకున్నాడు రామ్మూర్తి.
కొత్తగా వచ్చిన ఆటో డ్రైవర్ ఆయన్ని సమీపించి, దగ్గరలో నిలబడ్డాడు. రామ్మూర్తి గజగజ వణికిపోతున్నాడు. తాను ఊహించినదంతా నిజమే అవుతోంది. తన భార్యను వీడు ఏదో చేసి ఉంటాడు. తిరిగి తన ఇంటికెందుకు వచ్చాడు? గడియపెట్టిన తలుపులు ఎలా తెరిచాడు?
రామ్మూర్తికి తల పగిలిపోతోంది. శిరస్సులో ఒక పక్కనే వచ్చే తలనొప్పి! నొప్పి కంటే మరణం మేలనిపించే వేదన. క్లస్టర్ హెడ్ ఏక్.రామ్మూర్తి ఆ మంచం మీదే లుంగలు చుట్టుకుపోతున్నాడు. ఆ దశలోనే ముక్కాలి పీట మీద చేత్తో తడుములాట మొదలుపెట్టాడు. కొద్ది క్షణాలాగి, తల విసురుతూ, దేనికోదానికి ఢీకొట్టుకోవాలన్నట్టు ప్రయత్నించాడు.
అగ్నిపర్వతం పగులుతున్నట్టు అతని తల పగులుతోంది.
‘‘ఏమయ్యింది?’’ అడిగాడు ఆటో డ్రైవర్.
‘‘ఈ నొప్పితో ఇలాగే బాధపడితే చచ్చిపోతాను’’ మూలిగాడాయన.
‘‘మాత్రలున్నాయా?’’
‘‘ఒకే మాత్ర ఉండాలి. మామూలుగా ఇవ్వరు మందుల షాపువాళ్లు.’’
ముక్కాలిపీట మీద మాత్రల్లో అన్వేషణ ప్రారంభించి, ‘‘మాత్ర పేరేమిటి?’’ అన్నాడు ఆటో డ్రైవర్.
‘‘సుమెనెట్. వంద మిల్లీగ్రాములు.’’
వెతికాడు ఆటోడ్రైవర్.
‘‘మా ఆవిడను క్షేమంగా దింపావా?’’ గిలగిలలాడుతూ అడిగాడు రామ్మూర్తి.
గిలగిలలాడుతూ మంచం చివరికి వచ్చేశాడు.
ఆటో డ్రైవర్ కంగారుగా మాత్రల పేర్లు చదువుతున్నాడు. నిరాశగా మూలిగాడు.
గిలగిలలాడుతూ రామ్మూర్తి కిందపడ్డాడు. కుయ్యోమంటూ మూలిగాడు. మరణ వేదనతో చుట్టుకుపోతున్నాడు.
ఆటో డ్రైవర్ బంగారం తీసుకుపోదామని వచ్చాడు. బంగారం ఎక్కడ ఉందో వెతుక్కునే అవకాశం, ముసలాయన ఇవ్వడం లేదు. సుమెనెట్ దొరికి ఉంటే, దాన్ని అతడి గొంతులో వేసి, బంగారం తీసుకుని పారిపోయి ఉండేవాడు ఈపాటికే! వీధి చివర ఒక ఆస్పత్రి ఉన్నట్టు డ్రైవర్‌కి తెలుసు. ముసలాయన్ని అక్కడికి తీసుకు వెళ్లేవరకూ బతికి ఉంటాడా?
డ్రైవర్‌కి మరోవిషయం కూడా తెలుసు. ముసలాయన తన వల్లనే విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడు. తన భార్య గురించి, ఆమె క్షేమం గురించి అతడు పడిన ఆవేదనే దీనికంతటికీ కారణం. ఆయనను ఆస్పత్రికి చేర్చగలడా తాను? ఆయనకున్న తలనొప్పి ఆటో డ్రైవర్‌కి బదిలీ అయ్యింది.
రెండు నిమిషాల తర్వాత ఆటోరిక్షా ఆ ఇంటి ముందు నుండి కదిలింది. డ్రైవర్ ఆటో నడుపుతున్నాడు.
ఆస్పత్రి ముందు వాహనం ఆపాడతడు.
రెండు చేతులతో ముసలాయన్ని ఎత్తుకున్నాడు. ఆస్పత్రి వరండాలో అతడి అడుగులు బరువుగా కదుల్తున్నాయి. తలుపు గడియను తన పద్ధతిలో ఒడుపుగా తప్పించాడే కాని, గడియను తిరిగి అమర్చలేని నిస్సహాయత డ్రైవర్‌కి గుర్తొచ్చి నిట్టూర్చాడు.
ఎం.వి.వి.సత్యనారాయణ
సాక్షి, 28-11-2010, ఆదివారం, అనుబంధం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి