Pages

1, డిసెంబర్ 2010, బుధవారం

సమయస్ఫూర్తి

అవంతీదేశ శూరసేన చక్రవర్తికి భానుమతి అనే లోకోత్తర సుందరి ఏకైక కుమార్తె. తన కుమార్తెకు స్వయంవరాన్ని చాటించాడు చక్రవర్తి.

భానుమతి అందచందాల గురించి విన్న ఎందరో రాకుమారులు స్వయంవరానికి విచ్చేశారు.
చక్రవర్తి పెట్టిన అన్ని పరీక్షల్లోనూ హర్షవర్ధనుడు, విక్రమార్కుడు అనే ఇద్దరు రాకుమారులు సరిసమానంగా నిలిచారు. ఇద్దరూ చక్కటి అందగాళ్లు, స్ఫురద్రూపులు.

చక్రవర్తికి ఏం చేయాలో పాలుపోక, యుగంధర అమాత్యుల వారివైపు దృష్టి సారించాడు. యుగంధర అమాత్యులు వయోవృద్ధుడు, శూరసేన చక్రవర్తి తండ్రి కాలము నుండీ మహామంత్రి పదవి నిర్వహిస్తున్నవాడు. యుగంధరుడు చిరునవ్వు నవ్వి, ‘‘మహారాజా! ఆందోళన చెందకండి. రాకుమారు లిద్దరిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఎవరు సమయస్ఫూర్తిగా సమాధానమి స్తారో వారికి రాకుమారినిచ్చి వివాహం చేద్దాం’’ అన్నాడు.

ఇద్దరు రాకుమారులను ఒక గదిలోకి పిలిపించాడు యుగంధరుడు.
‘‘రాకుమారులారా! వీర పరీక్షల్లో మీరిద్దరూ ఒకే శ్రేణిలో నిలిచారు. నేను అడిగే ప్రశ్నలకు ఎవరు సరియైన సమాధానమిస్తారో వారినే రాకుమార్తె వరిస్తుంది. మీకు ఇష్టమేనా?’’ అన్నాడు.
రాకుమారులిద్దరూ తలలూపారు.

‘‘1. మీరు వచ్చిన గదిలోకి ఎన్ని మెట్లు ఉన్నాయో ముప్పది ఘడియల్లో చెప్పాలి?
2. రాకుమారి శయన మందిరాన్ని ఎన్ని రకాల పుష్పాలతో అలంకరణ చేశారో నలుగురు నచ్చునట్లు చెప్పాలి?

3. రాకుమారికి ఇష్టమైన రంగు ఏమిటో తేటతెల్లం చేయండి’’ అని అడిగాడు మహామంత్రి.
యుగంధరుడు అడిగిన మూడు ప్రశ్నలకు హర్షవర్ధనుడు, విక్రమార్కుడు ఆలోచనలో పడ్డారు. కొంతసేపటికి విక్రమార్కుడు ‘‘మీరడిగిన మూడు ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను’’ అని, ‘‘మొదటిది - ముప్పది మెట్లు ఎక్కి వచ్చాం.

రెండోది - నాలుగు రకాల పుష్ప జాతులతో శయన మందిరాన్ని అలంకరించారు. మూడోది - రాకుమారి ఇష్టపడే రంగు తెలుపు’’ అన్నాడు. యుగంధరుడు ఆప్యాయంగా విక్రమార్కుడిని కౌగిలించుకున్నాడు. హర్షవర్ధనుడు ఓటమి భారంతో నిష్ర్కమించాడు.

భానుమతిని దక్కించుకొన్న విక్రమార్కుడిని యువరాణి, ‘‘ఏమండీ! మీకు మాయామంత్ర విద్యలేమైనా వచ్చా? అమాత్యులవారు అడిగిన ప్రశ్నలకు అంత చక్కగా సెలవిచ్చారు’’ అంది.
విక్రమార్కుడు నవ్వుతూ, ‘‘యువరాణి! మీ అమాత్యులవారు అడిగిన ప్రశ్నల్లోనే సమాధానముంది.

కొంచెం మెదడుకు పదును పెడితే సరి!’’ అన్నాడు.
భర్త సమయస్ఫూర్తికి భానుమతి మురిసిపోయింది.


- ప్రతాపురం రామానుజాచారి

సాక్షి, 28-11-2010, ఆదివారం, అనుబంధం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి