Pages

13, డిసెంబర్ 2010, సోమవారం

వెర్రి తెగులు

..................................................................కె. అనురాధ

12-12-10, ఆంధ్రజ్యోతి, ఆదివారం అనుబంధం నుండి..
వంటింట్లో కుక్కర్ మోతల మధ్య సూపర్ స్పీడ్‌లో పనులు చేసుకుంటూనే సుజాత టి.విలో వచ్చే అన్నదాత కార్యక్రమంపై ఒక చెవి, ఒక కన్ను పారేసింది.
పేపర్ చదువుతూ "సుప్రభాతంలాగా పొద్దున్నే ఇదొకటి'' అని విసుక్కున్నాడు వాళ్లాయన. "ఇది చూసి ఏ రైతన్నా వ్యవసాయం నేర్చుకుంటాడని నువ్వు నమ్ముతావా?'' అని వెటకారం కూడా ఆడాడు.
సుజాత జవాబు చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. పనంతా అయ్యాక అందరికీ క్యారేజీలు సర్దిపెట్టి తను కూడా బయలుదేరింది. "ఈ రోజు చాలా ఫీల్డ్ విజిట్స్ వున్నాయి. వచ్చేసరికి లేటవుతుంది'' అని చెప్పి బయటపడింది.


ఉద్యానవన అధికారిగా సుజాత పదేళ్ల నుండి అదే ప్రాంతంలో పనిచేస్తూ వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను చాలా దగ్గరగా గమనిస్తోంది.
బస్సు నగర పరిసరాలు దాటగానే రోడ్డుకిరువైపులా ఫెన్సింగ్‌లు వేసిన పొలాలు దర్శనమిచ్చాయి. పచ్చని చీర చుట్టిన పడుచులా వుండే చేలకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చీడపట్టి ముళ్ల చీర కట్టినట్టుంది. ఇప్పుడవి చేలు కావు-లే అవుట్లు.
మంచుకొండ నారాయణమూర్తిగారి తోటలోకి సుజాత అడుగుపెట్టిందో లేదో "మేడాముగారూ ... ఎవసాయం అంటే బంగారం యాపారమా సెప్పండి'' అడిగాడు అప్పలరాజు. నారాయణమూర్తి సిటీలో చాలా పెద్ద నగల వ్యాపారి. వచ్చిన లాభాలతో ఆనందపురం దగ్గర ముప్పయి ఎకరాలు కొన్నాడు. అప్పలరాజుని తోట సంరక్షకుడిగా పెట్టుకున్నాడు.
"మీ ఓనరుగారికి అసలు ఆదాయమే రావడం లేదట. నన్ను వచ్చి చూడమన్నారు'' అన్నది సుజాత తోటను పరిశీలిస్తూ. "అమ్మా! కొబ్బరిసెట్టు సమత్సరంలో రెండొందల కాయిలు కాస్తాదని మీలాటోరు పుస్తకాల్లో రాసీనారట. మరివేమి కాయకండా ఉన్నాయని నన్ను దెబ్బలాడేత్తాన్రు''.

"నల్లి తెగులు ఎక్కువగా వుంది అప్పలరాజు''.
"అదే నానూ సెప్పినానమ్మా. ఊరంతా ఇదే తెగులున్నాది. మరి సూడక్కర్లేదని సెప్పినా ఇన్నారు కాదు''. మంచుకొండ నారాయణమూర్తి దృష్టిలో అప్పలరాజు ఒక సోమరిపోతు. జీతం తీసుకుని పని చేయకుండా పడుకుంటాడు. ఏ పంట పెట్టినా పుస్తకాల్లో చెప్పినట్టు దిగుబళ్లు రావట్లేదని గోల. అప్పలరాజు లాంటివారు కేవలం సోమరితనం, తెలివితక్కువతనం వల్ల భూములు పోగొట్టుకున్నారని అతని నమ్మకం.
అప్పలరాజు లాంటి వారిని చాలామందిని చూసిన సుజాతకు అసలతను భూమిని ఎలా పోగొట్టుకున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అదే అడిగింది.
"తాత తండ్రులిచ్చిన బూమి. నా కుటమానవంతా కష్టపడీవోల్లం. నాను పండించని పంటనేదు. నా సిన్నప్పుడు జొన్నలూ, చోళ్లూ, గంటెలూ పండీవి. తరువాత కాయగూరల పంట నేర్సినాక డబ్బులు బాగా వచ్చేయి'' అక్కడిదాకా చెప్పి ఏదో ఆలోచనలో పడ్డాడు అప్పలరాజు. మళ్లీ తనే "డబ్బంతా మాయేనమ్మా! అది మాలాటోరికాడ నిలవదు. ఇప్పుడిక ఆ బూదేవతా నిలవనేదు''. "ఎందుకమ్మావు నీ భూమిని?''

"ఎక్కడో గోదారిజిల్లా నుండి ఒచ్చినారు. మన బూమికి మంచి రేటుంటాదని మా కుర్రోల్లు గెంతినారు. ఆల్లకేటి తెలుసు బూమి ఇలువ. ఓరి నాయనా బూమి మనకు తిండెడతాదిరా. డబ్బెన్నాళ్లుంటాదని గోసబెట్టినా ఇన్లేదు. పంటలమీద ఏమొస్తంది? మన కష్టం తప్పేం మిగిలింది? డబ్బుంటే ఏదైనా యాపారం సేసుకోవచ్చు అన్నాడు మా పెద్దోడు'' అని కాసేపాగి "ఇప్పుడేటయ్యింది? అందరం కూలోల్లమైపోనాం. ఎటోల్లమటు పారొచ్చినాం''.
"నాకు తెలివినేదంటే ఒప్పుతాను. నిజివే మరి. తెలివుంటే బంగారంనాటి బూమినొగ్గుదునా? కాని నాకు రైతుపని తెల్దంటే మాతరం నానొప్పను'' ఖచ్చితంగా చెప్పాడు అప్పలరాజు.
తెలివిగల్ల వ్యవసాయం వ్యాపారమైంది. బ్రతుకుతెరువు కోసం చేసేది తెలివితక్కువ వ్యవసాయమైంది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల మధ్య ఊగిసలాడుతున్న దేశాన్ని తలుచుకుంటూ అప్పలరాజుకి నల్లి తెగులు నివారణకు మందు రాసిచ్చి మరో క్షేత్ర పరిశీలనకు వెళ్లింది సుజాత.
అది రిటైర్డ్ ఇంజనీర్ సోమేశ్వరరావుగారి అరటితోట. చాలా ఖరీదైన 'టిష్యూకల్చర్' అరటిమొక్కలతో ఇంటర్‌నెట్ వ్యవసాయం చేస్తున్నారాయన. ఆయనకి సహాయపడే మరొక 'సోమరిపోతు తెలివితక్కువ' రైతు దేముడు. ఎన్.. టి. పి.సి. థర్మల్ కేంద్రానికి తన భూమిని అప్పగించి నిర్వాసితుడయ్యాడు.
"దేవుడూ ఏమైంది మీ అరటితోటకి'' గబగబ అడిగింది సుజాత. అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, తను త్వరగా ముగించుకుని వెళ్లాలి.

"మీరంతా బాగా సదువుకున్నారు గావాల. ఏటైందో నానేటి సెప్పను'' అన్నాడు అదోలా.
"నాకైతే మొక్కలన్నీ బాగానే వున్నాయి. ప్రాబ్లెం యేమీ కనబడటం లేదు. మరి అయ్యగారు ఎందుకు కంగారు పడుతున్నారు?'' "ఏమోనమ్మా, అతగాడి లెక్కలు నాకేటీ బోదపడవు. ఒక సెట్టు ఆకు ఆరించీలు పెరిగినాదట. మరో సెట్టు ఆకు పదిహేను ఇంచీలు పెరిగినాదట. అలగుండకూడదు అదొకనాంటి తెగులని నా బుర్ర గొలికేత్తాండు''.

సుజాత అతని వంక అయోమయంగా చూసింది.
"ఇంజనీరు బాబుగద ... కొలతలతో వెవసాయం సేత్తారు మరి'' అన్నాడు వెటకారంగా.
అప్పుడే కారులోంచి దిగుతూ సోమేశ్వరరావుగారు కనబడ్డారు. వస్తూనే -
"మేడమ్ తోట చూసారా?''
"చూసానండి. అంతా బాగానే వుందే''.
"యేం బావుందండీ? బ్రోచర్‌లో రాసినట్టుగా మొక్కలు ఎదగలేదు. ఇంతవరకూ పూత రాలేదు'' అన్నాడు సోమేశ్వరరావు. "మొక్కలమ్ముకోవడానికి వాళ్లు చాలా చాలా రాస్తారండి. అవన్నీ నిజం అనుకుంటే ఎలా?'' అసహనంగా అన్నది సుజాత. "బాగుంది. ఇలా అయితే రైతు ఎంత నష్టపోతాడు? అందుకే మన దేశం ఇలా ఏడ్చింది'' వాపోయాడు సోమేశ్వరరావు. చాలా అప్రయత్నంగా సుజాత చూపు దేముడిపై పడింది. నష్టపోతున్నదెవరో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఫోను మోగింది. డిస్‌ప్లేలో డా. ప్రభాకర్ అని చూడగానే సుజాత గుండె ఝల్లుమంది.
ఆయన పామాయిల్ తోట వేసింది మొదలు వారానికోసారి ఫోన్ చేసి ఎలకలొచ్చి మొక్కలను తవ్వుతున్నాయి అర్జంటుగా రమ్మనీ, లేకపోతే కాకులొచ్చి పళ్లుతిని పోతున్నాయి వచ్చి అడ్డం పడమనీ విసిగిస్తుంటాడు. చచ్చానురా దేముడా ... అనుకుంటూ సుజాత ఫోన్ ఎత్తింది.

"మొక్కలు నాటడానికి గోతులు తీయమన్నారు. అవి ఎలా తీయాలో మీరు కాస్త చెప్పాలి. అలాగే మొక్కజొన్న అంతరపంట వేయమన్నారు. అది ఎలా వేయాలో మా వాడికి కొంచెం చెప్పండి...'' ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతుంటే సుజాతకు చిర్రెత్తుకొచ్చింది. అప్పటికే ఇంజనీరుగారి లెక్కలతో విసుగ్గా వుందేమో "మీకు వ్యవసాయం నేర్పడం నా ఉద్యోగం కాదండి'' అంది విసురుగా. "అయినా మీ రైతుకు అన్నీ బాగానే తెలుసు. అతను చేస్తాడులేండి'' అంది.
"వాడి మొహం వాడికేం తెలుసు? వాడ్ని నమ్ముకుంటే అంతా నష్టమే'' అన్నాడు డా. ప్రభాకర్ వెంటనే. సుజాతకు సహనం పూర్తిగా నశించింది.

"మీ వైద్యవృత్తిలాగే వ్యవసాయం ఒక వృత్తి అని గుర్తించండి ప్రభాకర్ గారూ. మీరైతే పుస్తకాలు చదివి డాక్టరయ్యారుగాని రైతులు చిన్నప్పట్నించి తమ తాత తండ్రులను చూసి నేర్చుకున్న విద్య ఇది. వారి జ్ఞానాన్ని అపహాస్యం చేయకండి'' అని ఫోను పెట్టేసింది. సుజాత ఎజి. బి.ఎస్సీ చదివేటప్పుడు రైతులకు సరైన సలహాలు ఇచ్చి దేశానికి ఉపయోగపడాలని అనుకుందిగాని ఇలా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు చేసే వ్యవసాయ ప్రయోగాలకు, ప్రహసనాలకు తాను తోడ్పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు ఇంటికొచ్చాక కూడా సుజాత బుర్రనిండా అవే ఆలోచనలు. వ్యవసాయాన్ని ఒక జ్ఞానంగా ఎందుకు గుర్తించరు. ప్రతి ఒక్కళ్లకీ ఎంత చులకనైపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేషన్లు కూడా వ్యవసాయంలోకి దిగుతాయట. మన రైతుకున్న వ్యవసాయ జ్ఞానం జ్ఞానం కాదా? అది తరతరాలుగా సంతరించిన నైపుణ్యం కాదా? అది ఎంత అద్భుతమైన కళ. జాతీయ సంపద. రకరకాల ఆలోచనలతో సుజాత మనసు అల్లకల్లోలమైంది.

***

అన్ని సాయంత్రాలలానే పక్షులూ పశువులూ గూటికి చేరుకునే వేళ. కృష్ణంనాయుడు మాత్రం ఎందుకో ఇంకా తన కల్లం దగ్గరే వున్నాడు. అక్కడున్న పెద్ద చింతచెట్టు కింద కూర్చుని ఉన్నాడు. పశువులను ఇంకా విప్పలేదు. ఒక ఆవు, దాని పెయ్య రెండిటికీ మేతవేసి తన చేతులతో ప్రేమగా నిమిరాడు.
ఆ ఊరిలో ఎస్.ఈ.జెడ్ భూసేకరణ పనులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు నష్టపోతున్న భూముల్లో ఫలసాయాన్ని ఇచ్చే చెట్ల జాబితా రాయడానికి సుజాత వెంకటాపురం వచ్చింది. ఆ పెద్ద చింతచెట్టు కిందే కూర్చుని చెట్ల జాబితా రాస్తోంది. ఒక రైతు హడావిడిగా వచ్చి "అనాసపనాస రాయడం మర్సిపోనారు'' అన్నాడు. సుజాత తలెత్తకుండానే జవాబు చెప్పింది "అది రాయకూడదు. అది వార్షికపంట కదా. దానికేమీ నష్టపరిహారం ఇవ్వరు''.

పక్కనే కూర్చున్న కృష్ణంనాయుడు "అంటే మేడాముగారు నాకు తెలీకడుగుతాన్ను. మావేటి నష్టపోవాలో గూడా మీరే నిర్ణయించుకున్నారా? ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనీ పెబుత్వమే నిర్ణయిస్తది. మా నష్టాన్నీ నిర్ణయిస్తది, మాకిచ్చే సొమ్మునూ నిర్ణయిస్తది. ఆ తరువాత మావేటైపోవాలో మాతరం ఎవల్లూ సెప్పరు. ఆ ఊసెవల్ల కొద్దు. మా కర్మానికొగ్గీయండి'' అని ఆవేశంగా అన్నాడు. నాయుడు మాటల్లోని ఆవేదన - ఉద్వేగాన్ని అర్థం చేసుకుని సుజాత ఏదో చెప్పబోయింది. కాని అతను వినిపించుకునే స్థితిలో లేడు. "ఈ బూమ్మీద మావే బతికినామా? మాతోపాటు ఎన్నో జీవులు బతుకుతున్నాయి. ఈ సెట్టుందంటే ... దీని పండు నానొక్కణ్ణీ తింటన్నానా? దానిమీద ఎన్నో జాతులు పక్షులేటి, పురుగులేటి అన్నీ బతుకుతాయి. మీ ఇష్టమొచ్చింది రాసుకుని ... పోండి'' కోపంగా అన్నాడు.

పాలవలస కృష్ణంనాయుడు, తండ్రి అప్పలనాయుడు, గ్రామం వెంకటాపురం, మండలం అచ్యుతాపురం, ఎకరాన్నర చిన్నరైతు. తన రికార్డులో అదొక ఎంట్రీ మాత్రమే.
సుజాత కొక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది. అక్కడున్న చెట్లూ చేమలూ పశువులూ పంటచేలూ అన్నిటికీ నాయుడి బాధ అర్థం అయినట్లు కనబడింది, ప్రభుత్వానికి తప్ప. తనకు అర్థమైనా చేయగలిగిందేమీ లేదు.

***

సుజాత మనసు భారంగా ఉండి నిద్ర రావడం లేదు. గ్రామాలు ఇన్నాళ్ళలా లేవు. బ్రతకలేక బక్కచిక్కి పోతున్నాయి. తన చిన్నప్పటి పల్లెటూళ్లను గుర్తు చేసుకుంది. ఊరుకొక కళ ఉండేది. వ్యవసాయానికి ఒక గౌరవం ఉండేది. రైతుకు ఒక గుర్తింపు ఉండేది. ఇప్పుడు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. రైతులు వలస పోతున్నారు. వారి జాగాలోకి ఎవరెవరో వస్తున్నారు. గ్రామాలకేదో వెర్రి తెగులు సోకినట్లుగా అంతటా విషాదం కమ్మినట్లుంది. సుఖసంతోషాలు అలిగి పారిపోయాయి. రోడ్లు వెడల్పు చేసేటప్పుడు లాగిపారేసిన చెట్లలాగా మన ఆధునిక అవసరాలు రైతులను వేళ్లతో సహా పెళ్లగించి పారేస్తున్నాయి.

ఇంట్లో అందరూ నిద్రపోతున్నా సుజాతకు నిద్రపట్టడం లేదు. రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఉన్నట్టుండి ఈ గాలిదుమారమేమిటి? అన్నీ పడిపోతున్నాయి. తనింకా చింతచెట్టు కిందే వుంది ... అయ్యో అన్నీ ఎగిరిపోతున్నాయి. తన కాగితాలు ... వాటిని గట్టిగా పట్టుకుని నిలబడింది. అందరూ కొట్టుకుపోతున్నారేంటి? తను మాత్రం కదలకుండా ఉంది. కృష్ణంనాయుడు, అప్పలరాజు, దేముడు, అయ్యో! ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి వర్షం కూడా మొదలైంది. అంతా చీకటి ... ఏమీ కనబడటం లేదు. అందరూ మాయమైపోయారు. సుజాతకి బాగా భయం వేసింది. గట్టిగా కేకలేయడం మొదలుబెట్టింది.

"అమ్మా, అమ్మా లే'' ఎవరో తనని గట్టిగా తడుతూ లేపారు.
మంచం పక్కన ఆమె కూతురు కనబడింది. ఇదంతా కలేనా అని ఊపిరి పీల్చుకుంది.
"ఏమైందమ్మా ఎందుకలా అరిచావు?'' అనడిగింది పాప.
"భయం వేసిందిరా, రైతులంతా మాయమైపోయారు'' అని చెప్పింది సుజాత.
"అయితే ఏమవుతుంది?''
"వాళ్లు లేకపోతే మనకు అన్నం ఎలా వస్తుంది?''
"అన్నం లేకపోతే నూడుల్స్ తిందాం'' అని ఎగురుకుంటూ పోయింది.
ఆ రోజు ఎంతో దూరంలో లేదని నిట్టూరుస్తూ లేచింది సుజాత.

...............................................
రచయిత్రి సెల్: 94912 33002


Read More !

తిండిబోతుల తెలివి

సాక్షి, ఫండే, 12-12-2010 నుండి..
చంద్రగిరి, శివగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. ఒక పర్యాయం శివగిరి రాజ్యంలో క్షామం వచ్చింది. ప్రజలు తిండిలేక ఇబ్బందులు పడసాగారు.

చంద్రగిరి రాజు మహేంద్ర భూపతి, మానవతాదృక్పథంతో శివగిరి రాజ్యానికి సహాయం చేయాలని భావించాడు. కోశాగారం నుంచి కొంత మొత్తం తీసి, శివగిరి రాజ్యానికి పంపాలని నిర్ణయించాడు. ఆ బృహత్కార్యంలో తన ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయదలచి, రాజ్యంలోని ప్రజలందరూ ఒకపూట తిండి మాని, ఆ తిండి గింజలను శివగిరి రాజ్యానికి పంపాలని, అలా చేయనివారిని కఠినంగా శిక్షిస్తానని ప్రకటించాడు.

చంద్రగిరి రాజ్యంలో భీమరాజు, సింహరాజు అనే ఇద్దరు తిండిబోతులు ఉన్నారు. రాజు ప్రకటన విన్న వాళ్లిద్దరూ ఒక పూటంతా పస్తు ఉండటం తమ వల్ల కాదని భయపడిపోయారు. ఇద్దరూ ఒకచోట చేరి తీవ్రంగా ఆలోచించి ఒక పథకం వేశారు. దాన్ని అమలు చేసి పస్తు ఉండకుండా తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు.

రాజు ప్రకటించిన విధంగా చంద్రగిరి ప్రజలందరూ ఒకపూట పస్తు ఉండి, తిండి గింజలు శివగిరి రాజ్యానికి చేరవేశారు. అనంతరం మహేంద్ర భూపతి తన చాటింపును ఖాతరు చేయక, ఒకపూట పస్తు ఉండని ప్రజల జాబితా తయారుచేయమని వేగులను ఆదేశించాడు.

వారం తరువాత వేగులవారు మహారాజును కలిసి ‘‘రాజా! మీ చాటింపును ఖాతరు చేయక, పస్తు ఉండకుండా సుష్టుగా భోజనం చేసినవాళ్లు రాజ్యం మొత్తం మీద ఇద్దరే ఇద్దరు. వాళ్ల పేర్లు భీమరాజు, సింహరాజు’’ అని మనవి చేశారు.
మహేంద్ర భూపతి ఆగ్రహించి, వారిద్దరినీ తక్షణం తన ముందు హాజరుపరచమని ఆదేశించాడు. భటులు వారిద్దరినీ మహారాజు ముందు హాజరుపరిచారు.

‘‘నా ఉత్తర్వు ప్రకారం మీరిద్దరూ ఒకపూట పస్తు ఉన్నారా?’’ అని ప్రశ్నించాడు మహేంద్ర భూపతి.
‘‘క్షమించండి మహారాజా! మేం పస్తు ఉండలేదు’’ అని వాళ్లిద్దరూ బుద్ధిగా తప్పు ఒప్పుకున్నారు.
మహారాజు కొంచెం శాంతించి, ‘‘ఎందుకు అలా చేయలేదు’’ అని అడిగాడు.
‘‘మహారాజా! మీరు కుటుంబీకులను పస్తు ఉండమన్నారు గాని, అతిథులను పస్తు ఉంచమని చెప్పలేదు’’ అన్నారు తిండిబోతులు.

‘‘నిజమే! కానీ అది మీకు ఎలా వర్తిస్తుంది?’’ ఆశ్చర్యపోయాడు మహేంద్ర భూపతి.
‘‘మరేంలేదు మహారాజా! మేం గంట గంటకీ ఏదో ఒకటి తినకుండా ఉండలేం. అందుకే ఒకరింటికి మరొకరం అతిథులుగా వెళ్లాం. అప్పుడు మీ ఆదేశం వర్తించదని భావించి, కడుపునిండా భోజనం చేశాం. తప్పయితే క్షమించండి’’ అని చేతులు జోడించారు భీమరాజు, సింహరాజు.
వాళ్ల తెలివికి మహారాజు నవ్వుకుని, మందలించి పంపేశాడు.
- ఎన్.శివనాగేశ్వరరావు చందమామ స్టోరీ
Read More !

13 క్యారెట్ల వజ్రం

యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దుల్లో ఎందరు సైనికులు మరణిస్తారో తెలియదు గాని పేద, మధ్య తరగతి జీవితాలు మాత్రం చితికిపోతాయి. రోజు గడవటమే దుర్భరమైపోతుంది.

అవి బర్మా మీద జపాను దురాక్రమణ చేసిన రోజులు. మా పెళ్లయి రెండేళ్లయింది. కుటుంబ జీవితానికి
అలవాటు పడుతున్నాం. మా ఆయనకు మంచి ఉద్యోగమే ఉండేది. కాని యుద్ధంతో మా కల చెదిరింది.
ఉద్యోగమూడింది.

ఇంటద్దె కట్టలేక వీధిలో పడ్డాం. పసిపిల్లాణ్ని సముదాయించటం కష్టమైంది. వాడి ఆకలి కూడా తీర్చలేని
దీనస్థితి దాపురించింది. యుద్ధమంటే అదేను.

ఆ రోజుల్లో వ్యాపారమంటే తెలియనివాళ్లు కూడా చిల్లర వ్యాపారస్తులుగా మారారు. ఏదుంటే అది వీధిలో అమ్మకానికి పెట్టటమే. బజారులో నిలబడి బహిరంగంగా అమ్మలేనివాళ్లు, మా ద్వారా వస్తువులు బేరానికి పెట్టారు. ఎంతో కొంత కమీషన్ వస్తుంది, రోజు గడిస్తే చాలు, ‘నిస్సందేహంగా ఇది ఈజీ మనీ’ అంటారు మీరు. కాస్త ఓపిక పట్టండి. త్వరలోనే మీ అభిప్రాయం మారుతుంది.

మేం ఫుట్‌పాత్ మీద వస్తువులు పెట్టుకుని నిల్చుంటామా, కస్టమర్లు వచ్చి వాటిని ఎగాదిగా పరిశీలిస్తారు. ‘‘ఫ్రీగా ఇచ్చినా ఎవరూ తీసుకోరు వీటిని’’ అన్నట్టుగా ఉంటాయి వాళ్ల కళ్లు. చివరికి మామీద ‘జాలిపడి’,
‘‘ఈ బట్టల సబ్బులెంతకమ్ముతావు?’’

‘‘ఒక క్యాట్ (బర్మీస్ కరెన్సీ)కు అయిదు సబ్బులు.’’
‘‘అయ్య బాబోయ్, అంత ధరా? ఒక క్యాట్, పది పైసలకు ఆరిస్తావా?’’
నాకు బుర్ర తిరిగింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అని తెలుసు. కాని కస్టమర్ను వదులుకోగూడదు. ‘‘తీసుకోండి’’ అన్నాను. నష్టమే. కాని తప్పదు. అయితే, అప్పటికైనా అవి అమ్ముడుబోయాయనుకుంటున్నారా?
‘‘ఎనభై పైసలకు అయిదిస్తావా?’’
‘‘తీసుకోండి. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి’’ అంటూ కాస్త కోపంగా చూశాను.

మొత్తం మీద మా వ్యాపారం అలా వెలిగిపోయింది. జనం మమ్మల్ని చచ్చువెధవల్లా జమ కట్టారనటానికి చాలా ఉదాహరణలున్నాయి. కాని, ఆ ఉదాహరణలన్నీ ఇప్పుడు నెమరేసుకోవటమెందుకు. మా ఇంట్లో ఉన్న వస్తువులే కొద్ది. అవి కూడా అదృశ్యమైనాయి. బజార్లో నిల్చున్నప్పుడు వచ్చీ పోయే జనాన్ని చూసి, సంతోషంతో కేరింతలు వేసింది మా వాడే. మేం కస్టమర్లతో మాట్లాడుతుంటే, చేతుల్లోంచి జారి, అటూ ఇటూ పరిగెత్తటం వాడి ఆట.

కడుపు నిండినవాళ్లు, విలాస భవనాలలో సుఖాసీనులై పేదరికాన్ని అందంగా వర్ణిస్తూ కవిత్వం రాస్తారు. సింపుల్ లైఫే గొప్పదంటారు. మాది సింపుల్ లైఫంటారా? మా భాషలో ఓ సామెత ఉంది.
‘‘మట్టిని తొలిచే పురుగుకే తెలుస్తుంది - రాళ్లెక్కడ అడ్డం పడుతున్నాయో. పువ్వుల మీద వాలే సీతాకోకచిలుక ‘కష్టేఫలి’ అంటూ దానికి నీతి బోధ చేస్తుంది’’ సాధుపుంగవులకు పేదరికంలో మోక్షమార్గం గోచరిస్తుందేమో గాని, మాకు మాత్రం ఇది ప్రత్యక్ష నరకం.

కొన్నాళ్లకు, మాకు గవర్నమెంటాఫీసులో ఉద్యోగం వచ్చింది. అప్పటికి అమెరికా, ఇంగ్లండు సంయుక్త దళాల విమాన దాడులు ప్రారంభమయ్యాయి. పక్కా ఇళ్లలో ఉండటం వీలుపడదు. రోజుకో కొత్తచోట ఏ పాకలోనో తలదాచుకోవాలి. ఆ క్రమంలో ఒంటిమీది బట్టలు తప్ప మాకంటూ మరేమీ మిగల్లేదు. చివరికి, ఊరి పొలిమేరల్లో ఓ రేకుల షెడ్డులో కాపురం పెట్టాం. అదృష్టవశాత్తూ, అక్కడ నుండి మా ఆఫీసు చాలా దగ్గర. పనిచేస్తూ కూడా మధ్యలో వచ్చి మావాణ్ని చూసుకోగలిగాను. ఎయిర్‌రెయిడ్ సైరన్ వినిపించగానే, ఇంటికి పరిగెత్తి మావాణ్ని గుండెలకు హత్తుకుని ఓ మూలన నక్కుతాను.

రెయిడ్స్ సంగతెలా ఉన్నా మాకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. గవర్నమెంట్ నౌకరీ అంటే నలుగుర్లో కాస్త హోదా కూడా ఉంటుంది. జీతం సరిపోదు కాని, అది దిగువ మధ్య తరగతి వాళ్లందరికీ ఉండే సమస్యే. ఫస్టుకు జీతం రాక, ఉపవాసాలున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అవునండీ, పాలు, తేనె ప్రవహిస్తున్న బర్మాలోనే ఉన్నదీ పరిస్థితి.

బియ్యం దొరికేవి. కాని, ఉత్తర బర్మా నుండి రావలసిన వంటనూనె సరఫరా ఆగిపోయింది. ఒక దశలో, జంతువుల కొవ్వు మీదే ఆధారపడవలసి వచ్చింది. వంటల్లో వేస్తే ఆ కొవ్వు ఎలా ఉంటుందనుకున్నారు? పైన, తెట్టె కట్టినట్టు తేలుతుంది. దుర్వాసన. నూనె లేని వంటలతో ప్రయోగాలు చేశాను. చిలగడదుంప, సీమగోగు ఆకులతో వండితే బాగానే ఉందనిపించింది.

ఎన్ని కష్టాలొచ్చినా మా ఆయన మొహం మీద చిరునవ్వు చెరగలేదు. ఏది పెట్టినా సంతోషంగా తిన్నాడు. అంటే, వేదాంత ధోరణి అలవరచుకున్నాడు. భోజనం ముందర కూర్చోగానే, ‘అద్భుతం. ఏమి ఘుమఘుమ. నీ చేతివంట అమృతం’ అనటం అలవాటు చేసుకున్నాడు. ఆ పొగడ్తలే నా కొత్త ప్రయోగాలకు ప్రేరణ.

కట్టుకోవటానికి బట్టలు లేవంటారా? బెడ్ షీట్లు, కర్టెన్లు, టేబుల్ క్లాత్‌లు ఏవైనా సరే-పైజామాలు, అంగీలుగా కుట్టుకోవచ్చు. పాత నాప్కిన్‌లతో మావాడికి షర్టులు కుట్టాను.
యుద్ధం కొనసాగింది. రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. జపాన్‌వాడు యెన్ (జపాను కరెన్సీ) నోట్లు జారవిడిచాడు. కాని, అవి ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి. మాకేమీ దొరకలేదు. చిల్లర కొట్లవాళ్లు, పెద్ద వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు రెండు చేతులా సంపాదించారు. వాళ్ల ఇళ్లల్లో గోనెసంచుల నిండా డబ్బే.

ఒకప్పుడు మా ఇంట్లో బట్టలుతికిన పనిమనిషి ఇప్పుడు చిన్న కొట్టు తెరిచింది. వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది. కాస్త లావెక్కింది. ఖరీదైన దుస్తులు వేసుకుంది. నగలు పెట్టుకుంది. మాసిన, చిరిగిన డ్రస్సులో ఉన్న నన్ను చూసి, ఆశ్చర్యపోయింది. ఎరక్కపోయి ఆ కొట్టుకెళ్లాను. ఏదో మాట్లాడాలి గనక, ‘ఎండు చేపలెట్లా ఇస్తున్నా’వని అడిగాను. అవి చాలా ఖరీదని నాకు తెలుసు. నా దగ్గర అంత డబ్బులేదు.

‘‘జబ్బుపడ్డారా? ఇదేం వాలకమమ్మా?’’ అని అడిగిందావిడ. నోట మాట రాలేదు. నా ఇబ్బందిని గమనించిందేమో, అయిదారు చేపలు పొట్లం కట్టించింది. తలకొట్టేసినట్టయింది. ‘వద్ద’న్నాను. ‘తీసికెళ్ల’మని బలవంతం చేసింది. నాకు దుఃఖం ఆగలేదు. ఎంతగా ఏడ్చానంటే, పొట్లంలోని చేపలు, ఆ కన్నీటిలో ఈదులాడగలవు.

ఆ రాత్రి భోరున వర్షం కురిసింది కాని, విమాన దాడుల నుండి ఒక్కరోజన్నా విరామం దొరికినందుకు మహా సంబరపడిపోయాం. చూరు కారింది. ఇల్లు కొలనైంది. పొడిగా ఉన్న నేల, అంగుళమైనా మిగల్లేదు. టిన్ను డబ్బాల్లో కురుస్తున్న నీటి సంగీతంతో, మావాడు బాగానే నిద్రపోయాడు. కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం. మా ఆయన చుట్ట వెలిగించి, హాస్యకథల పుస్తకమొకటి తీసి, బిగ్గరగా చదివాడు. నేను నవ్వలేకపోయాను. ఎండుచేపలు జ్ఞాపకం వచ్చి, సిగ్గు, అవమానంతో కుంచించుకుపోయాను.

మా ఆయన నా ఆలోచనల్ని బాగానే పసిగట్టగలడు. నవ్వకుండా, ఊఁ కొట్టకుండా వింటే ఎవరికైనా అనుమానమొస్తుంది. ఇక, లోపలి ఆరాటాన్ని అణచుకోలేక, ‘‘జపాను వాడి నోట్లు మనకెందుకు దొరకవు? ఈ ఉదయం మన పాత పనిమనిషి కనిపించింది. బాగా సంపాదిస్తున్నది. ఇప్పుడు నువ్వామెను గుర్తుపట్టలేవు. ఎన్ని నగలో, ఎంత ఠీవో!’’ అంటూ అరిచాను.

‘‘మనమూ ప్రయత్నిస్తున్నాంగా!’’ అన్నాడు ఆయన.
‘‘ఇదేనా బతుకంటే? అందరూ డబ్బు చేసుకుంటున్నారు. బ్రోకర్లు, ఏజెంట్లు రాత్రికి రాత్రే లక్షాధికారులైపోతున్నారు. వాళ్లకు చదువు రాదు. పెద్దగా పెట్టుబడి కూడా పెట్టలేదు. అమ్ముకున్న వాడికేమీ గిట్టదు. కొన్నవాడి దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. దండుకునేది మాత్రం మధ్య దళారులు.’’

మా ఆయన నవ్వుతూ, హాస్యకథల పుస్తకాన్ని చూపించి, ‘‘ఇందులో నీలాంటి పాత్రలే ఉంటాయి’’ అన్నాడు.
‘‘నీ జోకులు చాల్లే. ‘రోజులు బాగాలేవు. కాగితం నోట్లను బంగారం, వజ్రాలుగా మార్చి దాచుకోవాలి’ అని చెబుతున్నారు తెలివైనవాళ్లు.’’
ఆయన అర్థంకానట్టుగా చూశాడు.
‘‘అయితే నన్నేం చేయమంటావు? నా దగ్గర బంగారమూ లేదు. వజ్రాలూ లేవు.’’
నేనే మూర్ఖురాలిననుకుంటే, మా ఆయన మహామూర్ఖుడిలాగున్నాడు.

‘‘నీ దగ్గర లేవని నాకూ తెలుసు. అవి ఉన్నవాళ్లను పట్టుకోవాలి. అలాగే, కొనేవాళ్లనూ వెదకాలి. ఇక్కడ కొని, అక్కడ అమ్ము. కమీషన్ తీసుకో. ఒక్క వజ్రం అమ్మినా, ఏడాది పాటు ఇద్దరం కలిసి సంపాదించిన దానికన్నా రెట్టింపు వస్తుంది. వంటనూనె లేక, ఎంత ఇబ్బందిగా ఉందో! డబ్బొస్తే ఒక టిన్ను నువ్వుల నూనె కొనుక్కోవచ్చు.’’
ఆ మాటకే నోట్లో నీరూరినట్టుంది.
‘‘అవును. నువ్వుల నూనె భలే రుచిగా ఉంటుంది. కాని వజ్రాలు అమ్మేదెవరు? కొనేదెవరు?’’
‘‘ఆ విషయం నాకు వదులు’’ అన్నాను.

- 2 -
అలా ప్రారంభమైంది కథ. ఆఫీసులో, ఒకరి కష్టాలొకరం చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు, ‘‘నీకొక్కడే కొడుకు. నాకు ముగ్గురు పిల్లలు. నా జీతం మీదే ఆధారపడితే ఇల్లు గడవదు. అందువల్ల మా ఆవిడ అదనంగా సంపాదిస్తుంది. ఆమె పెద్దగా చదువుకోలేదు-పేరు రాయగలదు. అంతే. మొన్న మా ఇంటి పక్కనున్న ధనికురాలొకావిడ డైమండ్ బ్రేస్‌లెట్ కొంటానన్నదట. నగ బాగుంటే లక్షయినా ఫరవాలేదన్నదట. ఇంకేముంది. మా ఆవిడ అమ్మటానికి సిద్ధంగా ఉన్న మరో ఆసామిని పట్టుకుని తొంభై వేలకే కొని లక్షకమ్మింది.’’

‘‘పదివేలు లాభమా!’’ అంటూ నోరెళ్లబెట్టాను.
‘‘లేదు. అంతకన్నా ఎక్కువే. అమ్మకానికి పెట్టినాయన 25 శాతం కమీషన్ కూడా ఇచ్చాడు.’’
నాకు లెక్కలు బాగా రావు. అంటే, 10,00-0+ 25-/-1-00x1,00,000. ఎంతన్నమాట? కాగితం, పెన్ను లేకుండా పెద్ద లెక్కలు చెయ్యటం కష్టమే.
‘‘ఏమీ చదువుకోని మా ఆవిడ చెయ్యగలిగినప్పుడు నువ్వెందుకు చెయ్యలేవు?’’ అంటూ నాకు పురెక్కించారు మిత్రులు.
మరునాడు, మా కొలీగ్ భార్యను కలిశాను. చదువు రాకపోతేనేం? ఆమె ఎంత తెలివైందో తెలుస్తూనే ఉంది. ఇక్కడ కొని, అక్కడ అమ్మినందుకు ముప్ఫై అయిదు వేలు సంపాదించింది.

‘‘మీ చదువుకున్న వాళ్లంత తెలివితక్కువ వాళ్లు లేరు. బేరం చేసి పెట్టగలిగినవాళ్లకు మంచి గిరాకీ ఉంది. ఒకాయనకు పదమూడు క్యారెట్ల వజ్రం కావాలట. క్యారెట్‌కు లక్ష కాకుండా, 25 శాతం కమీషన్ కూడా ఇస్తాడట. నువ్వు బేరం చేసి తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకమ్మితే, మరింత డబ్బు అదనంగా మిగులుతుంది. పోనీ, అది లేదనుకున్నా, నీకెంతొస్తుందో తెలుసా? 25/100x1,00,000 x13!!

13 క్యారట్ల వజ్రం ఎక్కడ దొరుకుతుంది?
‘‘ఆ విషయం తెలియదు. కాని, కొనటానికి ఎబ్రహీం అని ఒక పెద్దమనిషి రెడీగా ఉన్నాడు.’’
ఇంటికొచ్చి, ఆ రాత్రి మా ఆయనతో చెప్పాను. ధనిక బంధువుల, పరిచయస్తుల పేర్లన్నీ పరిశీలించాం. తింగాంగ్యున్‌లో ఒకావిడ బంగారు నగల వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. కాని, అక్కడికి చేరుకోవటానికి బస్సులో అయిదారు గంటలు పడుతుంది. ఫరవాలేదు. బస్సు చార్జీలకు డబ్బెందుకు తగలెయ్యాలి.

మా దగ్గరో సైకిలుంది. ఏ కాలంనాటిదో తెలియదు, బహుశా మొదటి తరం సైకిలు కావచ్చు. ఫ్రేము ‘రాలే’ కంపెనీది. చక్రాలు హంబర్‌వి. టైర్లు పంచరైనట్టుంది. రబ్బరు ముక్కలతో అత్యవసరమైన రిపేర్లన్నీ చేశాం. అయితే, చక్రాలకు సాలిడ్ రిమ్స్ ఉన్నాయి. అంటే, గాలికొట్టవలసిన పనిలేదు.

ఆదివారం, ఇంకా తెల్లవారకముందే లేచి, మా ప్రయాణం ప్రారంభించాం. నేను వెనక సీటు (తుప్పు పట్టింది) మీద, మావాణ్ని ఒళ్లో పెట్టుకుని కూర్చున్నాను. గుంతల రోడ్డుమీద మా ఆయన సైకిలు తొక్కాడు. నేను పాటలు పాడాను. మావాడు సంతోషం పట్టలేక, నానా అల్లరీ చేశాడు.
అదృష్టవశాత్తూ, మా ఆంటీ ఇంటి వద్దే ఉంది. వజ్రం కావాలి. వచ్చిన లాభంలో ఆమెక్కూడా కొంత ఇస్తామని చెప్పాం.

‘‘అబ్బే, నా దగ్గరేమీ నగలుండవు. మీలాగే నేను కూడా ఏజెంటును. వారం తర్వాత రండి. ప్రయత్నిస్తాను’’ అందావిడ.
ఆ రోజు వాతావరణం బాగుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. అంటే ఎయిర్ రెయిడ్స్‌కు అనుకూలంగా ఉందన్నమాట. తిరుగు ప్రయాణంలో సైరన్ మోగింది. ఎప్పుడైనా బాంబులు పడవచ్చు. ఇంటికి చేరుతామని ఆశలేదు. కాని, అదృష్టం కలిసొచ్చింది.

- 3 -
వారమంతా విమానదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కనాడూ కడుపునిండా తిన్నామని చెప్పుకోవటానికి లేదు. వజ్రం అమ్మితే, వచ్చే కమీషన్ లెక్కలు వేసుకుంటూ గడిపాను. అన్నీ కూడికలు, గుణకారాలే.
ఆదివారం నాడు మళ్లీ ఆంటీ ముందర వాలాం. 13 కారెట్ల వజ్రం ఎవరి దగ్గరుందో తెలుసంది. అంతకన్నా సంతోషకరమైన వార్త మరేముంటుంది! ‘‘మీరు ఎబ్రహీంను తీసుకురండి. అమ్మే ఆసామితో కలిపిస్తాను’’ అంది.

ఈల పాట పాడుకుంటూ సైకిల్ మీద ఇంటికి బయల్దేరాం. ప్రతీ ఆదివారం ఇలాగే సైడ్ బిజినెస్ చేస్తే, మా కష్టాలన్నీ తీరవా! అంతా అనుకున్నట్టే జరిగితే, ఉద్యోగాలకు రాజీనామా చేయొచ్చు. హీనపక్షం వారానికి పదివేలు సంపాదించామనుకో... అయితే, సైకిల్ గుంతలో పడి చక్రం వంగిపోవటంతో నా కలలకు బ్రేకుపడింది. టైరు ఊడి వచ్చింది. చేతిలో పట్టుకుంటే చచ్చిన పాములాగుందది.

రిపేర్ చెయ్యటానికి పనిముట్లు లేవు. అక్కడ ఉండిపోవటానికే లేదు. సైరన్ మోగింది. సైకిల్ తోసుకుంటూ ముందుక్కదిలాం. ఇంటికి చేరి, మళ్లీ ఆదివారం, రెబ్రహీంను తీసుకుని తింగాంగ్యున్‌కెళ్లాలి. ఆ తర్వాత డబ్బే డబ్బు. రోజూ విందు భోజనాలారగిస్తాం. మఖమల్ దుస్తులు వేసుకుంటాం.

రాత్రంతా కష్టపడి మా ఆయన సైకిల్ రిపేర్ చేశాడు.
ఆదివారం రానే వచ్చింది. సైకిల్ తొక్కుకుంటూ ఎబ్రహీం కూడా వచ్చాడు. నలుగురం (మా వాడితో సహా) తింగాంగ్యున్‌కి బయల్దేరాం.

ఆంటీ మమ్మల్ని లోపలికి ఆహ్వానించి, అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు పరిచయం చేసింది. అందులో ఒకడు కుర్రాడు. మరొకతను మెడలో బంగారు గొలుసు, ఉంగరాలు, బంగారు వాచ్ పెట్టుకుని హుందాగా కూర్చున్నాడు. అతని దగ్గరే ఉండాలి వజ్రం. ఆయన పేరు కోసెట్ క్వాన్.
వజ్రం చూపించమన్నాడు ఎబ్రహీం.

‘‘కొనేది నువ్వేనా?’’ అన్నాడు కోసెట్ క్వాన్.
ఇదే అవకాశంగా ఎబ్రహీం తన ఆస్తిపాస్తుల వివరాలన్నీ చెప్పాడు. కాని, కోసెట్ క్వాన్ ఇంప్రెస్ అయినట్టుగా లేడు.
‘‘నిజంగా కొంటావా? కొనగలవా?’’
ఎబ్రహీంకు కోపం వచ్చిన మాట నిజమే. అయినా కోటీశ్వరుల ముందు లక్షాధికారులు తలవంచక తప్పదు.
తను కూడా ఒక ఏజెంటుననీ, మరొకరి తరఫున వచ్చాననీ చెప్పాడు ఎబ్రహీం.

‘‘నేను డెరైక్టుగా ఆయనతోనే మాట్లాడతాను’’ అన్నాడు కోసెట్‌క్వాన్.
వెంటనే అసలు కొనుగోలుదారుణ్ని వెతకటానికి బయల్దేరాం - ఎబ్రహీం, నేను, మా ఆయన, ఆంటీ తరఫున అక్కడున్న కుర్రాడు, మరీ ముఖ్యంగా కోసెట్ క్వాన్. మొత్తం నాలుగు సైకిళ్లు.
దారిలో ప్రతి టీషాపు వద్దా బ్రోకర్ల కోలాహలమే.

కొన్ని మైళ్ల ప్రయాణం తర్వాత ఎబ్రహీం ఓ ఇంటి ముందాగాడు. అందరూ ఇంట్లోకెళ్లారు. నేను సైకిళ్లకు కాపలాగా అక్కడే నిలబడ్డాను. అయిదారు నిమిషాలైందో లేదో మా ఆయన బయటికొచ్చాడు. ఆయన మొహం చూడగానే విషయం అర్థమైంది. ప్రాచీన గ్రీకు నాటకాలలో అత్యంత విషాదకరమైన సంఘటనలను ప్రతీకాత్మకంగా మాత్రమే ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఆయన కూడా మరెవరికో ఏజెంట్ అని గ్రహించాను.

అమ్మేవాళ్లకు వందమంది బ్రోకర్ల గొలుసుంటే, కొనేవాళ్లకు రెండు వందలమంది బ్రోకర్ల గొలుసుంటుంది.
ఆ పదమూడు క్యారెట్ల వజ్రం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసినా నా జన్మధన్యం కాదా!

రచయిత్రి పరిచయం
మయన్మార్‌కు చెందిన డా ఖిన్ మ్యో చిట్ (1915-99) కథలు బర్మీస్‌తోపాటు ఇంగ్లిష్ పత్రికల్లోనూ అచ్చయినాయి. స్కూలు టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే బౌద్ధ ధ్యానమందిరాన్ని నిర్వహించిన ఈమె కథా సంకలనం ‘13 క్యారెట్ డైమండ్ అండ్ అదర్ స్టోరీస్’.

రెండవ ప్రపంచయుద్ధ కాలంలోని సంక్షుభిత బర్మీస్ సమాజానికి అద్దంపట్టిన ‘13 క్యారెట్ల వజ్రం’ ఆమె స్వానుభవంలోంచి వచ్చింది. రచనాకాలం 1946. బ్యాంటమ్ క్లాసిక్స్ వారు వెలువరించిన ‘50 గ్రేట్ ఓరియెంటల్ స్టోరీస్’లో ఈ కథను చేర్చారు.

బర్మీస్ మూలం: డా ఖిన్ మ్యో చిట్
తెలుగు: ముక్తవరం పార్థసారథి


సాక్షి, ఫండే, 12-12-2010 నుండి..
Read More !

7, డిసెంబర్ 2010, మంగళవారం

గాలిపటం

---------------------------------------------------------------- కె. వరలక్ష్మి
స్తంభం మీద గాలిపటం ఒకటి చిక్కుకు పోయింది. గాలి వీచినప్పుడల్లా ఎగరాలని ప్రయత్నిస్తోంది. చాలా సేపట్నుంచి సుమ దాన్నే చూస్తోంది. నిన్న లేదు. ఎప్పుడొచ్చి చిక్కుకుందో తెలీదు.

పగటి ఎండ ఇప్పుడిప్పుడే వేడిమిని పుంజుకుంటోంది. ఆ వేడికి గది చుట్టూ ఇటుకల కొలిమి పెట్టినట్టయింది. ఆ కాక భరించలేక వచ్చి వాకిట్లో చతికిలబడింది సుమ. బైటకొచ్చి కూర్చుని పదినిమిషాలు కాలేదు, ముంచుకొచ్చింది దగ్గుతెర. దగ్గి దగ్గి కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. పైట చెంగుతో కళ్లొత్తుకుని మెడ పైకెత్తి చూసింది.
చుట్టూ నిర్మాణంలో వున్న ఆకాశ హర్మ్యాలు. సగంలో ఆగిపోయినవి కొన్ని. తప్పదన్నట్టు అనాసక్తంగా నెమ్మదిగా పని జరుగుతున్నవి కొన్ని. సిటీ బయట పల్లెలా పచ్చగా ప్రశాంతంగా వుండే కాలనీ మొత్తం ధూళిమయమైపోయింది.
కాలనీలో తాముంటున్న ఇల్లొక్కటే పాతది. ఓనరు ఎక్కడో విదేశాల్లో వుండి పట్టించుకోక ఇదిలా వుండిపోయింది. అతని తాలూకు బంధువునని నెలకోసారి ఒక బట్టతల మీసాలాయన అద్దెకోసం వస్తుంటాడు. అవతలి పక్క గది, వాకిలి వాడుకుంటున్న తాపీ పనివాళ్లు అద్దె కరెక్టుగా ఇచ్చేస్తారు. అతనొచ్చే వేళకి కరుణ ఎప్పుడూ ఇంట్లో వుండడు. సుమ దగ్గర డబ్బులుండవు. అతను తాపీ పనివాళ్ల్ల వంటామె సుబ్బమ్మతో కాస్సేపు కబుర్లు చెప్పి, వెళ్లేటప్పుడు "అడుక్కు తినే వాడికి అరెసెల్తో భోజనం పెట్టినట్టు ఆడి బాబు చూడు ఆడికెలాంటి పేరెట్టాడో కరుణామూర్తంట. అడుక్కుతినే మూర్తి'' అని సాగదీసి తిట్టుకుంటూ వెళ్తాడు. మొదట్లో సుమకి చాలా కోపం వచ్చేది. పోగా పోగా ఆ కోపం స్థానాన్ని దైన్యం ఆవరించుకుంది. అప్పుడప్పుడూ తామిచ్చే వంద, నూటేభై పుచ్చుకుని ఖాళీ చేసి పొమ్మని అననందుకు ఇప్పుడు అతనే నిజమైన కరుణామూర్తి అనుకుంటోంది.
సుమ పాలిటి మరో కరుణామూర్తి సుబ్బమ్మ. పాతికమంది పనివాళ్లకి వండే గుండిగలో మరో దోసెడు బియ్యం పోసి వీళ్ల కడుపులూ నింపుతుంది. ఈ మధ్య బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయిందని ఏ పూట కాపూటే కొని తెచ్చి ఇస్తున్నారట. అన్నం మిగిలిన రోజు మిగుల్తుంది, లేని రోజు లేదు.

గాలికి కొట్టుకొచ్చిన ఎండుటాకులా సంధ్యవాలే సమయానికి కరుణ వేళ్లాడిపోతూ వచ్చాడు. వాకిట్లో చాప మీద చతికిలబడి సుమ గ్లాసుతో నీళ్లు తెచ్చిచ్చేవరకూ ఆగలేక వెనక్కి వాలిపోయాడు. సుమ వచ్చేసరికి అతను కరెంటు స్తంభం మీది గాలిపటాన్ని చూస్తున్నాడు. నీళ్లు తెచ్చిన సుమ రెండు నిమిషాలు అతన్నే చూస్తూ ఉండిపోయింది. మాసిన గడ్డం, లోపలికి పోయిన చెంపలు, ఆర్చుకుపోయిన కాలర్ బోన్స్, ఉతికి ఉతికి బూడిద రంగు తేలిన బట్టలు. ఎలాంటి వాడు ఎలాగైపోయాడు! అందంగా మెరిసిపోయే కరుణ తెరపైన హీరోగా కనపడాలనే కలల్తో ఉన్న ఊరినీ, అయిన వాళ్లనీ విడిచిపెట్టి నగరానికొచ్చి పడ్డాడు.

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దగ్గరున్న తమ చిన్న పల్లెటూరు గుర్తుకొచ్చి ఆ పచ్చదనానికి దూరమైపోయినందుకు పశ్చాత్తాపంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి సుమకి.
తెలిసీ తెలీని ఇంటర్మీడియట్ రోజులు. లోకమంతా అందం, ఆనందం వెల్లువెత్తుతున్నట్టు కన్పించేది. ఆర్థికపరమైన తమ అవసరాలు అడగక ముందే తీరుస్తున్న పెద్దవాళ్ల కారణంగా తాము ఆనందంగా జీవిస్తున్నామనే సంగతి తెలీని అమాయకత్వం. ఎక్కడున్నా ఎలా ఉన్నా అంతే ఆనందంగా జీవించగలమనే మూర్ఖపు నమ్మకం.
పంపా రిజర్వాయరు దగ్గర అన్నవరం కొండపైన జరుగుతున్న సినిమా షూటింగ్ చూడ్డానికి కాలేజ్ ఎగ్గొట్టి రోజూ వెళ్లేటప్పుడు తెలీదు తమ ఇద్దరి జీవితాల్ని ఆ షూటింగ్ ఇంత మలుపు తిప్పుతుందని. పరీక్షలు దగ్గరకొస్తున్నా లెక్క చెయ్యకుండా సినిమా వాళ్లకి అవీ ఇవీ అందిస్తూ అక్కడే ఉండిపోయేవాడు కరుణ. వాళ్లతో పెంచుకున్న పరిచయం వల్ల ఒక్క నిమిషం తెరపైన కన్పించే పాత్ర ఒకటి దొరికింది. ఆ సినిమా రిలీజైన రోజున ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టాల్సిన తమ ఇద్దరి డబ్బుల్తో స్నేహితులందర్నీ తీసుకెళ్లి సినిమా చూపించాడు. ఫోన్ చేస్తే అప్పటి అసిస్టెంట్ డైరెక్టరు "నువ్వు స్క్రీన్ మీద బలే అందంగా కన్పించావయ్యా, ఫీల్డుకి కొత్త హీరోల అవసరం బోల్డంతుంది. వచ్చెయ్'' అన్నాడట. అప్పటికే తమ ఇద్దరి మధ్యా చిన్న చిన్న ఉత్తరాలు ఇచ్చుకోవడం లాంటి ప్రేమాయణం నడుస్తోంది. కరుణ తనతో సంప్రదించినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా అతన్తో వస్తాననేసింది.

హోరున కురుస్తున్న వర్షపు రాత్రి తండ్రి వ్యవసాయపు పనుల కోసం తెచ్చిపెట్టుకున్న డబ్బుతో కరుణ, ఒంటిమీద నగానట్రాతో సుమ సామర్లకోట వెళ్లి హైదరాబాదు బండెక్కేసారు. తీరా ఇక్కడికొస్తే పట్టించుకునే నాథుడే లేడు. కరుణ తెచ్చిన డబ్బు, సుమ వొంటి మీద నగలు కరిగిపోడానికెంతో సమయం పట్టలేదు.
డబ్బుతో బాటు ధైర్యం కూడా కరిగిపోయాక ఇంటికి ఫోన్ చేస్తే సుమ ఇంటి వాళ్లు ఊళ్లో అడుగుపెడితే చంపేస్తామన్నారు. కరుణ తండ్రి బడుగు రైతు. అతన్ని నమ్ముకుని ఊరు వెళ్లలేక అలవికాని పరిస్థితుల మధ్య ఇక్కడే ఉండిపోయారు.
"ఏంటలా నిలబడి పోయావు. నీళ్లివ్వవా'' అంటున్నాడు కరుణ జాలిగా నవ్వుతూ.
క్షణాల్లో సంధ్య వెడలి చీకట్లు ముసురుకున్నాయి. చుట్టూ ఉన్న భవంతుల్లో లైట్లు వెలిగాయి. కరుణ కాళ్ల దగ్గర చతికిల పడింది సుమ. లేచి అటు తిరిగి సుమ వొళ్లో తల పెట్టుకున్నాడు కరుణ. అతని జుట్టులో చేతిని జొనిపి నిమురుతూ ఉండిపోయింది సుమ. ఏ ఎండన పడి తిరిగాడో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు కరుణ. కరెంటు స్తంభం మీది గాలిపటం చీకట్లో కన్పించడం లేదు కానీ, దాని రెపరెపలు మాత్రం విన్పిస్తున్నాయి. ఉదయం నుంచి సుమకి మళ్లీ కడుపులో ఏదోగా తెములుతున్నట్టుంది. ఎంత జాగ్రత్తపడినా ఎలా తగులుకుందో ఈ పీడ! క్రితంసారి సుబ్బమ్మ అన్నట్టు 'తాను దూర కంతలేదు మెడకో డోలా'. బలహీనంగా పుట్టిన పాపాయిని బతికించుకోవాలని తాపీపని వాళ్లని బతిమలాడి పని సంపాదించాడు కరుణ. కాని, రెండు రోజులు పనికెళ్తే నాలుగు రోజులు పడకేసేవాడు.
"ఈ సదువులొచ్చాక నాజూకు తేలిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు కుర్రనా కొడుకులు. పల్లెటూళ్లో పుట్టినోడు ఎంత చేవగా ఉండాల? అమ్మా బాబూ ఏ గడ్డి కరిసినా ఈళ్లు మాత్రం ఇడ్డిన్లు తిని, కాపీలు తాగి పెరుగుతారు. బతుకంటే సినిమా తెర మీద గెంతులనుకుంటన్నారు. పనికిమాలిన్నా కొడుకులు'' అంటూ ఒకరోజు ఆపకుండా తిట్టిపోసింది సుబ్బమ్మ. పాపాయి పోయాక మళ్లీ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు కరుణ.

అవతలి వాకిట్లో పనివాళ్లు భోజనాలు ముగించి కబుర్లలో పడ్డారు. 'ఇళ్లదగ్గరున్న భార్యా పిల్లల్ని గురించి ఎన్నెన్ని కబుర్లు కలబోసుకుంటారో. రోజూ చెప్పుకున్నా నూతిలో జల ఊరినట్టు ఇంకా ఊరుతూనే ఉంటాయి కబుర్లు. అలా మాట్లాడుకోవడం వల్ల కుటుంబాలకు దూరంగా ఉన్నామన్న బెంగ తీరుతుందనుకుంటాను' అనుకుంది సుమ. చిన్నదో పెద్దదో ఒక ఆర్ధికపరమైన నిశ్చింత ఉంది వాళ్లకి. తమలాగ తెగిన గాలిపటం కాదు వాళ్ల జీవితం.
ఈ రోజు అన్నం మిగల్లేదల్లే ఉంది. సుబ్బమ్మ గిన్నెలు కడుగుతున్న చప్పుడు విన్పిస్తోంది. మధ్యాహ్నం తినబుద్ధిగాక సుబ్బమ్మ ఇచ్చిన అన్నం, చారు అలాగే ఉంచేసింది. లేచివెళ్లి అన్నంలో చారు వొంపుకొచ్చింది. పలుకు మీద వార్చిన కొత్త బియ్యపన్నం ఆరిపోయి మేకుల్లా తగుల్తోంది చేతికి. కరుణని లేపి నాల్గు ముద్దలు తిన్పించి, తనో రెండు ముద్దలు తిన్నానన్పించి కడుపునిండా నీళ్లు తాగింది. అతనికో చెంబుతో నీళ్లిచ్చింది.

మర్నాడు అతను బైటకెళ్లేక సుబ్బమ్మను వెంటబెట్టుకుని పబ్లిక్ హెల్త్ సెంటరుకు వెళ్లింది సుమ. యూరిన్‌టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అబార్షన్ చేయించుకుంటానంటే డాక్టరు తిట్టిపోసింది. "ఇంత బలహీనంగా ఉన్నావు. ముందే జాగ్రత్త తీసుకోవడం తెలీదా?'' అంటూ. సుమ అభావంగా ఉండిపోయింది. "సర్లే, రేపురా'' అంది డాక్టరు కొంత చల్లబడి.
ఆ రాత్రి "ఈ బిడ్డనైనా దక్కించుకుందామా మన ఊరెళ్లిపోయి'' ఒక చిన్న ఆశతో అడిగింది.
"మీ వాళ్లు?'' అన్నాడు కరుణ.
"మా వాళ్లు మనల్ని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు''.
చాలాసేపు మౌనం తర్వాత "చిరంజీవిగారు సినిమా ఛాన్స్ కోసం ఎంతకాలం నిరీక్షించేరో తెలుసా?'' అన్నాడు.
'ఇంకా ఈ పిచ్చి వదల్లేదు' అనుకుంది సుమ. 'అసలు ఈ జీవితానికి వదుల్తుందా?'
"షూటింగ్స్ దగ్గర వాళ్లు పెట్టిందేదో తిని కడుపు నింపుకుంటున్నాను. సుబ్బమ్మగారు పెట్టింది నా కోసం దాచిపెట్టి నువ్వు కడుపు మాడ్చుకోకు'' అన్నాడు.
కరెంటు స్తంభం మీది గాలిపటం గాలిలేక అణకువగా తీగల్ని కౌగిలించుకొని ఉంది. తోక మాత్రం కిందికి వేలాడుతోంది. కాళ్లీడ్చుకుంటూ నడుస్తున్న కరుణనీ, గాలిపటాన్నీ మార్చి మార్చి చూస్తూ వుండిపోయింది సుమ. మధ్యాహ్నం ఎవరో ఇద్దరు కరుణని వెతుక్కుంటూ బైక్ మీద వచ్చారు. సుమ ఎదుట నిలబడి కరుణని బూతులు తిట్టారు. మలేషియా టౌన్‌షిప్ నుండి వచ్చేరట. "మూడు నెలల క్రితం నా పెళ్లామూ నేనూ ఆకల్తో చచ్చిపోతున్నాం బాబూ, ఏదన్నా పనుంటే ఇప్పించండని వచ్చేడు. పోన్లే కదా అని నమ్మి గుమాస్తాగా పెట్టుకున్నాం. ఇటిక బట్టీల వాళ్లకి అడ్వాన్సు ఇచ్చిరమ్మని అయిదు వేలిచ్చి పంపిస్తే రెండు వేలు నొక్కేసేడు. అప్పట్నుంచి అయిపులేకుండా పోయేడు. కనపడనియ్ చెప్తాను'' అంటూ ఏమిటేమిటో అన్నాడు అందులో ఒకతను. కరుణ ఆ మధ్య పదికేజీల బియ్యం, ఒక వాయిలు చీర కొనుక్కొచ్చేడు. ఓ వారం రోజులు కొంచెం ధీమాగా తిరిగేడు. ఆ డబ్బుల్తోనే కాబోలు.

సుమ నమ్మలేకపోయింది - కరుణ అలా చేసేడంటే. మర్నాడు సుమ డాక్టర్ని కలిసినప్పుడు ఏవేవో పరీక్షలు చేసింది.
"తల్లీ, నీకేమైనా అయితే నా మెడకి చుట్టుకుంటుంది. నాలుగురోజుల్లో మునిగిపోయేదేం లేదు కానీ, బలానికి నా దగ్గరున్న విటమిన్ కేప్స్యూల్స్ ఇస్తున్నాను. కాస్త ఓపిక పుంజుకున్నాక అప్పుడురా'' అని పంపించేసింది.
ఆ సాయంకాలం కరుణ మూడువేలు తెచ్చి ఇచ్చేడు. "బలమైన తిండి తిను. ఈసారి పాపాయిని తప్పకుండా కాపాడుకుందాం'' అన్నాడు. సుమకేమీ ఆనందం కలగలేదు. "ఈ డబ్బు ఎక్కడిది?'' మొహం గంటు పెట్టుకుని అడిగింది.
కరుణ చేతిలో ఉన్న మాంసం పొట్లాన్ని విసిరికొట్టాడు. "ఏం ఎక్కడైనా ఎత్తుకొచ్చేననుకున్నావా? ఆరాలెక్కువయ్యాయే'' అని గయ్యిమని అంతెత్తున లేచేడు.
అలిగి బైటికెళ్లిపోతూ "నా మెడకు నువ్వొక గుదిబండవి. లేకపోతే ఇవాళ ఎక్కడుండేవాణ్నో తెలుసా'' అన్నాడు. ఆ మాట సుమ మనసుకి ముల్లులా గుచ్చుకుంది.
రెండోరోజు ఎక్‌స్ట్రా ఆర్టిస్టు సప్లయిర్ వచ్చేడు ఇల్లు వెతుక్కుంటూ. "నా పెళ్లాం మెళ్లో గొలుసు తెచ్చి ఇస్తాను. హఠాత్తుగా ఆమెకి ప్రాణం మీదికొచ్చిందని ఫోనొచ్చింది'' అని కరుణ నిన్న అయిదువేలు పుచ్చుకున్నాడట అతన్దగ్గర.
వాడకుండా పెట్టెలో పెట్టిన మూడువేలు తీసి అతని చేతిలో పెట్టి చేతులు జోడించింది సుమ.
"ఎదుటివాళ్ల కడుపో కాళ్లో పట్టుకుని పని సంపాదించుకుని బతకాలిగాని ఇలాగ ఎందర్ని మోసం చేసి ఎంతకాలం బతుకుతారమ్మా'' అని వాకిట్లో కాండ్రించి ఉమ్మేసి వెళ్లేడు అతను.

సుమ మోకాళ్లలో తల పెట్టుకుని ఏడుస్తూ కూచుంది. తిండిలేకపోయినా ఏనాడూ బాధపడలేదు. పేదరికంలోనూ ఆనందాన్ని వెతుక్కుంది. కానీ, కరుణ ఇలా మారడం ఆమెకు మింగుడు పడడం లేదు.
ఆ సాయంకాలం హఠాత్తుగా మొదలైన గాలివాన రాత్రి పొద్దు పోయేవరకూ కురుస్తూనే ఉంది. ఆ రాత్రి కూడా కరుణ ఇంటికి రానేలేదు. రాత్రంతా సుమ ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారి లేచి బయటకొస్తే వాకిలి నిండా రాలిన చెట్ల ఆకుల్తో బాటు గాలిపటం పడివుంది. చీపురు, చేట తీసుకుని బైటకొచ్చేసరికి సుగాలీల కుర్రాడొకడు తెగిన గాలిపటం దారాన్ని పట్టుకుని పరుగెడుతున్నాడు. అది వాడి తలపైన రెక్కలు విప్పుకోడానికి ప్రయత్నిస్తోంది.
సుమ వాకిలంతా శుభ్రంగా తుడిచి చెత్తకుండీలో పోసింది. స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుంది. రెండు నెలలుగా కరుణకి తెలీకుండా కాలనీలో రెండు ఇళ్ల పిల్లల్ని దగ్గర్లో ఉన్న స్కూలుకి దిగబెట్టి తిరిగి సాయంకాలం తీసుకొస్తోంది. ఆ రోజు పిల్లల్ని దిగబెట్టి రేపట్నించి ఇక రాలేనని చెప్పేసింది. వాళ్లు చెరో నాలుగొందలూ చేతిలో పెట్టేరు. మధ్యాహ్నం సుబ్బమ్మ పెట్టిన వేడి వేడి అన్నం తిని, పెట్టెలో కట్టుకోకుండా దాచిన వాయిలు చీర తీసి ఆమె చేతిలో పెట్టి కాళ్లకి దణ్ణం పెట్టింది. మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి లేచింది. గదికి గొళ్లెం పెట్టి, పెట్టె తీసుకుని బైటకి నడిచింది. కాలనీలో సిటీబస్సెక్కి రైల్వేస్టేషన్ చేరుకుంది. మర్నాడు ఉదయం అన్నవరం స్టేషనులో దిగింది.
రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చిన కరుణ తన పెట్టెమీద సుమ రాసిపెట్టిన చీటీని విప్పేడు.
"పుట్టిన ఊళ్లో కట్టెలమ్ముకున్నా మేలే కదా'' అని ఉంది చీటీలో.

*

ఇప్పుడెవరైనా అన్నవరం వెళ్తే కాలి దారి దగ్గర మెట్లకి దిగువన కొత్తగా వెలిసిన పెద్ద కొబ్బరికాయల దుకాణంలో ఒక వైపు సుమ, మరోవైపు కరుణ ఉండి బేరం చూస్తూ కన్పిస్తారు. జీతానికి పెట్టుకున్న నలుగురు కుర్రాళ్లు వాళ్లకి సాయం చేస్తూ ఉంటారు. మీరు పలకరించాలనుకున్నా వాళ్లకి పలికే తీరిక ఉండదు.

...............................................
రచయిత్రి సెల్ : 98664 ౬౭౦౬౨

05-12-10, ఆంధ్రజ్యోతి, ఆదివారం అనుబంధం నుండి..
Read More !

చావు భయం

కొల్లాపురం గ్రామంలో విశాలాక్షుడనే సాధువు సత్రంలో బస చేశాడు. ఆయన చాలా మహిమాన్వితుడనీ, తమ సమస్యలు పరిష్కరిస్తాడనీ జనం చెప్పుకోసాగారు.
ఒకరోజు మల్లయ్య సత్రానికి వెళ్లి, ‘‘స్వామీ! తమరే నాకు న్యాయం చేయాలి’’ అని వేడుకున్నాడు.
‘‘ఏమిటి నీ సమస్య?’’ అని విశాలాక్షుడు అడిగాడు.

‘‘నేను గ్రామంలో చిన్న రైతును. నాలుగు ఎకరాల పొలంలో పంట పండించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. సంవత్సరం క్రితం నా పక్కనున్న పొలం యజమాని శివయ్య, పట్టణం వెళ్లిపోతూ భూషయ్యకు అమ్మాడు. భూషయ్య ఊళ్లో పెద్ద భూస్వామి. నా పొలంలో కొంత భాగం తనకు రావాలని పేచీ పెట్టుకున్నాడు. నేను గ్రామాధికారి నాగరాజుని న్యాయం చేయమని అడిగాను. ఐతే, నాగరాజుకి దగ్గర బంధువు భూషయ్య. అందువల్ల పక్షపాత ధోరణితో తీర్పు చెప్పడానికి తాత్సారం చేస్తున్నాడు.

ఇద్దరి పొలాలు సరిహద్దులు కొలతలు వేయించాలనీ, పట్నం నుంచీ నిపుణులు రావాలనీ, అంతవరకు ఎవరూ పొలం సాగు చేయవద్దనీ నాగరాజు చెప్పాడు. భూషయ్య పెద్ద భూస్వామి. ఆ పొలం సాగు చేయకపోయినా దిగులు లేదు. కాని, నాకు ఆ నాలుగు ఎకరాలే ఆధారం. పంట లేక, నేను కూలీ పనులకు వెళ్తూ నానా ఇబ్బందులు పడుతున్నాను. తమరు గ్రామాధికారితో చెప్పి, నాకు న్యాయం చేయండి’’ అని తన గోడు వెళ్లబోసుకున్నాడు మల్లయ్య.
‘‘గ్రామాధికారి ఎందుకలా తీర్పు వాయిదా వేస్తున్నాడు?’’

‘‘నేను గత్యంతరం లేక నా పొలాన్ని కూడా భూషయ్యకు అమ్ముతానని తాత్సారం చేస్తున్నాడు స్వామీ’’
‘‘సరే మల్లయ్యా! ధర్మం నీ పక్షాన ఉంది. ఎప్పటికైనా నీకు న్యాయం జరుగుతుంది. అధైర్యపడకు’’
‘‘స్వామీ! తమరు ఎలాగైనా గ్రామాధికారి నాగరాజు మనసు మార్చి, నాకు న్యాయం జరిగేటట్లు చూడండి’’ అని వేడుకున్నాడు మల్లయ్య.
‘‘గ్రామాధికారి మనసు మార్చడానికి నాకేమీ మహిమలు లేవు. దేవుడే నిన్ను కాపాడతాడు’’ అన్నాడు విశాలాక్షుడు.

విశాలాక్షుడు కొల్లాపురం విడిచి, మరొక గ్రామానికి వెళ్లిపోతున్నాడని తెలిసి, గ్రామాధికారి నాగరాజు వీడ్కోలు చెప్పడానికి కుటుంబ సమేతంగా వచ్చాడు.
నాగరాజుని గమనించిన విశాలాక్షుడు, ‘‘నాగరాజూ! గ్రామాధికారివైన నీవు గ్రామస్తులను కన్నబిడ్డలుగా కాపాడాలి. అందరి క్షేమం చూడాలి. పక్షపాత బుద్ధి కూడదు’’ అన్నాడు.
నాగరాజు కలవరపడి, ‘‘స్వామీ! వీలైనంత వరకూ నేను న్యాయంగానే వ్యవహరిస్తాను’’ అన్నాడు.
‘‘మంచిది. నీకు ఆయువు దగ్గరకొచ్చింది. నెల రోజుల తర్వాత మరణిస్తావు. ఈ లోపల మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకో. స్వర్గ ప్రాప్తి లభిస్తుంది’’ అన్నాడు విశాలాక్షుడు.

నాగరాజు భయపడిపోయి, ఆ రోజు నుంచే మంచి పనులు చేయడం ఆరంభించాడు. అలాగే మల్లయ్య పొలం సరిహద్దులు సక్రమంగా ఉన్నాయనీ, ఇక నుంచి పొలం సాగుచేసుకోవచ్చనీ తీర్పు చెప్పాడు.
మల్లయ్య సంతోషించి యథాప్రకారం తన పొలం సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
గ్రామాధికారి నాగరాజు చాలా మంచి పనులు చేస్తూ గ్రామస్తుల మెప్పు పొందాడు.

మళ్లీ సంవత్సరం తర్వాత, విశాలాక్షుడు కొల్లాపురం వచ్చి సత్రంలో విడిది చేశాడు. అప్పుడు నాగరాజు కలుసుకుని తన సందేహం గురించి అడిగాడు.
‘‘స్వామీ! తమరు లోగడ వచ్చినప్పుడు నేను నెల రోజులే బతుకుతానని సెలవిచ్చారు. సంవత్సరం గడిచింది. నేను నిక్షేపంగా ఉన్నాను.’’
విశాలాక్షుడు నవ్వి, ‘‘నాగరాజు! అప్పటి పరిస్థితిని బట్టి అలా చెప్పాను. నువ్వు ఆ నెలలోనే పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించుకున్నావు. అందువల్ల నీ ఆయుష్షు పొడిగించబడి ఉంటుంది’’ అని వివరించాడు.
నాగరాజు సంతృప్తి చెంది, అప్పటి నుంచి న్యాయ మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజల మెప్పు పొందాడు.
- వాణిశ్రీ

05-12-10, సాక్షి, ఆదివారం అనుబంధం నుండి..
Read More !

బ్లాక్ అండ్ వైట్

కలకీ, మెలకువకీ కాని మధ్యస్థమైన స్థితి. అటు కలా కంటిన్యూ అవుతుంటుంది. ఇటు బాహ్య ప్రపంచపు స్పృహ కూడా తెలుస్తూ ఉంటుంది.
ఒళ్లంతా మెత్తగా తగులుతోన్న సుతిమెత్తటి స్పర్శ. ఆ స్పర్శ వల్లనే కలవైపునించి మెలకువ వైపుకి వచ్చి ఉంటాను. చూస్తే కదులుతోన్న నా భార్య శరీరం. అప్పుడే లేచినట్టుంది.

ఒంటిమీది బట్టలూ, మెళ్లో నల్లపూసలూ, తాళిబొట్టూ అవీ సర్దుకొంటున్నట్టు గాజుల సవ్వడి. ఆ సవ్వడి ఆగిపోయాక, నా బుగ్గమీద నులివెచ్చగా చిరు స్పర్శ.
రోజూ లేవగానే నాకో ముద్దుపెట్టడం ఆమెకి అలవాటు.
నా ఒంటిమీది దుప్పటి సరిగ్గా కప్పి, ఆమె మంచం దిగింది. నా చుట్టూ గిరికీలు కొడుతున్న నిద్ర పిట్ట, మళ్లీ నా రెప్పల మీద వాలింది.

మళ్లీ కమ్మటి కల...
చిన్నగా వీపు మీద తడుతోన్న స్పర్శకి మెలకువ వచ్చింది.
ఆమే. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. రాత్రంతా మంచుకి తడిసిన నందివర్ధనం పువ్వులా ఫ్రెష్‌గా, అందంగా ఉందామె. చేతిలో కాఫీ కప్పు.
నిద్రకీ, కాఫీకి పడదు. కాఫీ వాసనకీ ఎటో చక్కాపోయింది నిద్ర.

లేచి కూర్చుని కాఫీ తాగాను. అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్లేసరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయనుకోండి.
కమోడ్, టూల్ బ్రష్, టంగ్ క్లీనర్, షాంపూ, సబ్బు, రెండు బక్కెట్ల నీళ్లు, టవల్... అన్నీ వాడి బయటకొచ్చేసరికి మంచం మీద వేసుకునే డ్రెస్ సిద్ధం. డ్రెస్ చేసుకుని వచ్చేసరికి టిఫిన్ సిద్ధం. నాకన్నీ పద్ధతి ప్రకారం, టైమ్ ప్రకారం అమరిపోవాలి. లేకపోతే అసహనం నాకు.

ఆ అసహనాన్ని ఎవరూ భరించలేరని నాకు తెలుసు. నా భార్యక్కూడా తెలుసు కాబట్టే, ముందే ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఉంచిన కంప్యూటర్‌లా చకచకా చేసుకుపోతుంటుంది పనులు. టిఫినూ, కాఫీ కానిచ్చి పేపరు తిరగేసి, కాసేపు టీవీ చూసేసరికి ఆఫీసు టైమైంది. బైక్ మీద ఆఫీసు చేరేసరికి పది.

అయిదింటికి ఆఫీసునుంచి బయటకొచ్చేసరికి జోరుగా కురుస్తోన్న వర్షం. మొత్తం నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ఏక పాత్రాభినయం చేసి చూపిస్తోంది వాన.
బైక్ ఆఫీసులో పడేసి, వర్షంలో ఆటోలో ఇంటికి వెళ్లిపోవడం బెటర్. ఈ వెదర్ ఇలా ఉండగానే ఇంటికి పోయి, వేడివేడిగా పకోడీలో, మిరపకాయ బజ్జీలో చేయించుకుని తింటూ, వెచ్చటి కాఫీ తాగుతూ, హోమ్ థియేటర్లో మంచి సినిమా చూస్తూ ఉంటే... ఆ ఊహే ఎంతో బావుంది నాకు.

చినుక్కీ, చినుక్కీ మధ్య తడవకుండా వెళ్లిపోయే వాడంట నకులుడో ఎవరో. మనకా విద్య రాదు కాబట్టి నాలుగైదు చినుకులు ఆక్షింతల్లా నెత్తిమీద పడ్డాయి ఆటోలో ఎక్కేసరికి.
తాపీగా నడుస్తోన్న ఆటోలోకి, చల్లగా వీస్తోన్న గాలిని ఆస్వాదిస్తున్నాను. రోడ్డు మీద వాన సృష్టించిన అలజడి... జనంలో.

ఆటోవాడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నాడు. చూస్తే నా పక్కన ఒక అమ్మాయి. ఒకే ఒక సహ ప్రయాణికురాలు.
ఆటోవాడి పంచేంద్రియాల్లోనూ వాడి కళ్లొక్కటే రోడ్డుమీద. మిగతావన్నీ ఆ అమ్మాయి మీదే.
వాడి ప్రతి మాటలోనూ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్న తపన. ఆ అమ్మాయి మాటల్లో నీ తపనని నేను గుర్తించాను సుమా అన్న సూచన.
వాళ్లిద్దరి మధ్యా చకచకా నడచిపోతున్న సంభాషణ.

నాకు నవ్వొచ్చింది. ఉత్తి మామూలు నవ్వు కాదది. కాస్త వెటకారం మిళితమైన వంకర నవ్వు. కారణం, ఆ అమ్మాయి నల్లగా ఉంది. నలుపు కూడా కాదు. నల్లగా ఉండేవాళ్లు కూడా కొంతమంది బావుంటారు. ఆ నలుపులో కళ ఉంటుంది. ఈ అమ్మాయిలో అలాంటివేమీ లేవు.

అబ్బాయి కూడా అంతే. రోడ్డు క్లియర్‌గా ఉన్నప్పుడు మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆ అమ్మాయిని చూసి నవ్వుతుంటే మెరిసే పళ్లు, అంతకన్నా ఎక్కువగా మెరిసే కళ్లు తప్ప, అంతా కారు నలుపు.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఈ జంటే కాబోలు అనుకుంటుంటే మళ్లీ నవ్వొచ్చింది.

నలుపు మీద కామెడీ తీసే సినిమావాళ్లకి రాస్తే మంచి కామెడీ సీనవుతుందిది. ‘అమ్మ బ్రహ్మదేవుడో! కొంప ముంచినావురో. ఎంత గొప్ప సొగసురో. ఏడ దాచినావురో’ లాంటి పాటని పెడితే సీను బాగా పండుతుంది.

ఆలోచనలు ఒక పక్క ఇలా సాగిపోతుంటే మరోపక్క గిల్టీ ఫీలింగ్ లోలోపల్నించి తన్నుకొస్తోంది.
చాలా పురాతనమైన... ఊహూ! పరమ ప్రాచీనమైన వివక్ష. నల్లజాతి జెండా అమెరికా శ్వేతసౌధం మీద ఎగిరినా కూడా మనిషి మనసులోంచి పోని వర్ణ వివక్ష.

నిజానికి నలుపైతేనేం, తెలుపైతేనేం. తెల్లవాళ్లనేమీ కొరుక్కుని తినం కదా. అలా అనుకుంటుంటే నా భార్య గుర్తొచ్చింది. తను కూడా నాలాగే మంచి ఛాయ. ఆ రంగూ, రూపూ చూసే చేసుకున్నాన్నేను. ఆ రంగు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ, అంత అందగత్తె కదాని నిత్యం నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నానా?

కనీసం ఆమె ఒంటి రంగు రోజు మొత్తం మీద ఏ క్షణమైనా గుర్తొస్తుందా నాకు? ఇంకెందుకు పనికొస్తుందా రంగు? వర్ణాంధత్వంతో కళ్లు మూసుకుపోయి, తెలుపుని తప్ప నలుపుని గుర్తించలేని నాలాంటి వాళ్లతో నిండిపోయిన సమాజానికి ప్రదర్శించడానికి తప్ప.

- వెంకటేష్ పైడికొండల

05-12-10, సాక్షి, ఆదివారం అనుబంధం నుండి..
Read More !

మూడు కతలు నావీ, నాలుగోది శిష్ట్లాదీ!

మా ఊరి గెమిని దగ్గర చెరువు కాలవ దాటతా వుండా, అప్పుడినిపించింది నాకు యెంగట్లచ్చిం నోటమ్మట వొచ్చిన ఆ మాట. ఒకే మాట, అదిదీ, అచ్చిరం పొల్లు బోకుండా!
‘‘నా కూలిపొయ్‌న బతుక్కిప్పుడదొక్కటి తక్కవ!’’

నా మెల్లకన్నుతో యెంగట్లచ్చిం యింటికల్లా అట్ట జూసినా. ఆ రోజు శుక్రోరం. శుక్రోరం శుక్రోరం ఒకాయన మల్లెపూలూ, చామంతి పూలూ, చెండు మల్లిపూలూ తట్టలో పెట్టుకోని తిరప్తి యేశాలమ్మ యీది నుంచి మా వూరికి సైకిల్లో వొచ్చి- యాపారం జేసుకునేవోడు. యెంగట్లచ్చిం యింటి ముందర సైకిలు నిలబెట్టుకోని ఆయనుండాడు. యెంగట్లచ్చిం వాళ్లమ్మ కిష్టమ్మత్త తిన్నెమింద కుచ్చో నుండాది. యెంగట్లచ్చిం చలికాలం గాబట్టి రేపటెండలో కూచ్చోని చలి కాంచుకుంటా వుండాది, ముడుక్కోని.

చెరువు కాలవ దాటక ముందు కిష్టమ్మత్త అన్న మాట కూడా నా చెవల్లో పడిందిగానీ అంతగా పట్టించుకోలా. అదిదీ, అచ్చిరం పొల్లు బోకుండా!
‘‘ఈ రోజు శుక్రోరం గదా. తలకు పోసుకోని పూలు బెట్టుకో. దుడ్డు నేనిస్తాన్లే!’’

ఈ కాసింతా నా కండ్లల్లో, చెవల్లో పడేదానికి వక్క కొరికినంత సేపయినా పట్టిందో లేదో! ఎట్ట యేసినానో గానీ 40, 50 అడుగులేసే సరికి మా వూరి దింపుడు కళ్లం వొచ్చింది. తెల్లారి ఎనిమిది గెంటలైనా ఒక పిట్టికోడి లేదు. అప్పుడు నేను యూనివర్శిటీలో ఎమ్మెస్సీ ఫస్టియర్ చదవతుండా (1981). ఇంక నాలుగు బారలేస్తే బస్సు బాట వొచ్చేస్త్తింది.


నా ఆవజీవాలన్నీ అణిగిపొయ్‌నాయి. దింపుడు కళ్లం దగ్గర టెంకాయ కొట్టుకునే దానికి ఒక బండరాయి పడుంటే దానిమింద కుచ్చోని మోకాళ్ల సందన తల బెట్టుకోని ఓ అని ఏడ్చేసినా. నా కండ్ల ముందర్నే నేనె క్కాల్సిన బస్సు తిరప్తికి పూడిసింది. పూడిస్తే పూడిసింది, నేను దింపుడు కళ్లం కాడ కూచ్చోని ఏడస్తా ఉండడం చూసి మా వూళ్లో ఒకాయన మాయమ్మకూ, మా అక్కకూ చెప్పేసినాడు!

మాయమ్మా మాయక్కా ఏందో జరిగిపోయినట్టు లబలబా నోరు కొట్టుకుంటా దింపుడు కళ్లం కల్లా పరిగెత్తతా వుండారు. వూరంతా వుడ్డ జేరిపోతారేమోనని బిత్తరపోయ్‌నా. ముక్కుల్లో వున్న చీమిడినంతా చీదేసి ప్యాంటుకు తుడుచుకుని పైకిలేచి నిలబడుకొనే సరికి మాయమ్మా మాయక్కా ఇద్ద్దురూ నన్ను చెరొక రెక్కా పట్టుకొని దింపుడు కళ్లానికి దూరంగా జవు రుకొని పోయినారు ఓ అని ఏడ్చుకుంటా.

‘ఇంకెట్ట కొడకా!’ అంటా మాయమ్మా, ‘ఇంకెట్ట సినబ్బా!’ అని మాయక్కా ఏడ్చేదానికి పెట్టుకున్నారు.
నేనెంత తప్పు చేసినానో తెలిసే సరికి నాకు గుండికాయలు నీళ్లయిపోయినాయి. దింపుడు కళ్లం రాయి మింద నరమానుడెవుడూ కుచ్చోడు. పైగా ఆడికొచ్చేసరికి ఆ రాయి మింద తుపుక్కు తుపుక్కు అని మూడుసార్లు ఎంగిలి కూడా వూంచతారు.

‘‘అమా, నువ్వు అబ్బ దగ్గిర్నే వుండు. నేను యింటికి పొయ్ ఇన్నూర్రూపాయలెత్తుకోనొస్తా. అబ్బను రూంతసేపట్లో డాకట్ర దగ్గ్గిరికి తీసకపోకపోతే చచ్చిపోతాడు!’’ అంటా మా అక్క వూళ్లోకి పరిగెత్తబోయింది. మా అక్క నాకంటే ఎనిమిదేండ్లు పెద్దది. మా మేనత్త కొడుక్కే యిచ్చినాం. మా మేనత్తోళ్లు మా వూరికే మహరాజులు కావడం వల్ల మా అక్కకు ఇన్నూర్రూపాయలంటే రెండ్రూపాయల్తో సమానమే. ‘‘నా సిన్న కొడుకుని, నా చక్రవర్తి కొడుకుని దెయ్యం తొక్కేసిందమ్మా.

అందుకే సోదీనం తప్పి దెయ్యం బట్టి ఏడ్చుకుంటా వుండాడు!’’ అని మాయమ్మ ఎదుర్రొమ్ము గుద్దుకునేదానికి మొదులైంది. నేను తెంపుగా నా కందగెడ్డ మొకం మిందికి నవ్వు తెచ్చుకోని, ‘‘అకా అకా! ఇట్రా, నిజ్జం జెప్తా. ఇట్రా. మంచి మద్యానమైనా దెయ్యాలుంటాయి గానీ తెల్లారి పూట దెయ్యంలా గియ్యంలా’’ అనన్నా. మా అమ్మ ఏడుపు ఆపలేదుగానీ, మా అక్క ఆపి, ‘‘ఏమి కొండా! మా గుండికాయలు నీళ్లయిపోయినాయి గదరా. నిన్ను నమ్ముకోని బతకతా వుండాం గదరా.

నీకేమి సంకటం వొచ్చిందిరా? నీ వొగిసు బిడ్డ దింపుడుకళ్లం కాడ కుచ్చోని గుండెలు పట్టుకోని ఏడస్తావుంటే దెయ్యం తొక్కేసిందనుకోక ఏమనుకోమంటావురా?’’ అని అంటా కండ్ల నీళ్లు తుడుచుకొనింది. నా ఏడుపుకు ఏం అపద్దం చెప్పాలిప్పుడు? టకీమని చెప్పేసినా: ‘‘అకా! నీకు ముగ్గురు తోడికోడాండ్లు గదా. అందరూ బిడ్డా పాపతో వుంటే నీ కడుపునింకా ఒక కాయ కాయలేదు గదా. అందుకని దుఃక్కమొచ్చింది.’’

అమ్మయ్య! మా అక్కకు ఏనుగంబారీ మింద ఎక్కినంత కుశాలేసింది. నిజంగానే నేను మా అక్కకు పెండ్లయినప్పటి నుంచి ఏ తేదీన ముట్టవుతుందో తెలుసుకుని, అదే తేదీకి ఈ ఏడెనిమిదేండ్లుగా అడగతానే వుండా. ‘‘అకా! ఈ నెలన్నా అంటు తప్పినావా?’’ అని! మా అక్కకు ఈ సంగతి బాగా తెలుసు (నా బాద చూళ్లేక నేను ఎమ్మెస్సీ రెండో సంవత్సరంలో వుండంగా మా అక్క అంటుతప్పి నా చేతుల్లో తులసిని పెట్టింది).

‘‘నా తమ్ముడికి నేనంటే ఎంత గ్నేపకమో!’’ అని నా మూతి చుట్టూ మెటికలిరిచి నా చేతి కేరీరు పెరుక్కోని, ‘‘ఈ రోజు ఈ చద్ది కేరీరొద్దు. శీనయ్య మెస్సులో మటను బోజనం తిను. కాలేజీక్కూడా పోబాక. సిల్మా చూడు’’ అంటా నూర్రూపాయలు చేతిలో పెట్టింది. నేను కాలేజీకి నడవలూరు బస్సు ఎక్కేసినాను.

దింపుడుకళ్లం కాడ నేనెందుకేడ్చినానో చూసి రమ్మంటే కాల్చి వచ్చే పాఠకులకు చెప్పాల్సిన పనిలేదు. కానీ, చూసి రమ్మంటే ఒకటి సగంగా చూసి వచ్చేసే పాఠకులకు మాత్రం చెప్పాల్సిందే:
నేను ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నానంటే 20 నిండి, 21లోకి వచ్చినట్టు గదా లెక్క. యెంగట్లచ్చిం నాకంటే రెండేండ్లు చిన్న. యెంగట్లచ్చిం మేకలు తోలుకోని అడివికి పోతే నేను ఇస్కూలు సెలవుల్లో ఎనపగొడ్లు తోలుకోని పొయ్యేవాణ్ని.

చేసిపెట్టిన బొమ్మ మాదిరుండే యెంగట్లచ్చిం అడివంతా తిరుగుతూ నేనెంత వెదికినా దొరకని నెమటాయిల్నీ, ఎలికింజివ్వల్నీ ఏరుకొచ్చి దోసిట్లో పోసేది. పిడికిళ్లు పిడికిళ్లుగా కలిమి కూడు తెచ్చి పెట్టేది. అవి తిన్నాక, ‘‘ఈ నీళ్లు తాగు, నోరంతా ఎంత తియ్యంగా అయిపోతుందో చూడు.’’ అని సొరకాయ బుర్ర అందించేది. మొగ పిలకాయలందరితో కబాడీ ఆడేది. గుడ్డలిప్పి కడగా పారేసి, చెరువులోకి దూకి, ‘‘ఈత నేర్పిస్తాన్రారా సిన్నోడా!’’ అని పిలిచేది. అడివిలో వుండే తెల్లరాళ్ల మిట్ట కాడా, నూగుజేను మిట్ట కాడా, అండా సామిగెండి కాడా సొర్గం చూపించేది. ఇదంతా ఎప్పుడు?

ముందు జల్మంలోనా? ఏడెనిమిదేండ్లకు ముందర్నే! సమర్తాడిందో లేదో పద్నాలుగేండ్లకొక యింటిదై పొయ్యింది. పజ్జెనిమిదేండ్లకంతా ఆ చంకనొక కొడుకూ, ఈ చంకనొక కూతురూ!
శ్రీశ్రీ తాజ్‌మహల్‌కు రాళ్లెత్తిన కూలీలెవరు... నాకు అర్జంటుగా లిస్టు కావాలని ఆగడం చేసేసినాడు కవిత్వంలో! పెండ్లయ్యింది యెంగట్లచ్చానికి! ఈ ఏడెనిమిదేండ్లూ ఆ అమ్మి నిమిస నిమిసం ఎట్టా బతకబట్టి, ‘‘నా కూలిపొయ్‌న బతుక్కిప్పుడదొక్కటి తక్కువ!’’ అని అనగలిగింది! ఇది గావాల నాకిప్పుడు.

ఈ యెంగట్లచ్చిమేనా ఏడెనిమిదేండ్లకు ముందర కొంగుతో కొంగుడు తంగేడు పూలను ఏరుకొచ్చి అడివిలో వుండే మొగోళ్లందరి మిందా దోసిళ్లతో నెత్తిన పోసి, ఎవురో చక్కలగిల్లి పెట్టినట్టు గెంటలసేపు నవ్వింది!

నేరుగా పోయి మా యూనివర్శిటీ మేథమేటిక్స్ ప్రొఫెసర్ పి.వి.అరుణాచలం చొక్కాను పట్టుకోని, ‘‘సార్! ఒక తల్లికి 40 ఏండ్లుంటాయి. కూతురికి 19. శుక్రవారాన్ని గుర్తు చేసి తలంటుకోని అన్ని పూలు పెట్టుకోమంది తల్లి. దుడ్డు కూడా ఇస్తాననింది! కానీ ఆ టీనేజీ కూతురు ‘ఇప్పుడీ కూలిపోయ్‌న బతుక్కి అదొక్కటి తక్కవా?’ అని తల్లిని ప్రశ్నించింది. ప్రశ్న అంటే ప్రాబ్లెమే గదా! బీఎస్సీలో మ్యాథ్స్‌లో నాకు 95% వచ్చినాయి. ఎమ్మెస్సీలో చేర్చుకోడానికి మీరు పెట్టిన పరీక్షలో యూనివర్శిటీ ఏరియాలో ఐదో ర్యాంకు వచ్చింది. ఈ ప్రాబ్లెమ్ నాకెంతకీ అర్థం కావడం లేదు.

విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన తమరు నాలుగు పీరియడ్లయినా సరే తీసుకుని సాల్వ్ చెయ్యండి. లేకుంటే చిత్తు పేపర్ల మీద రాసుకోనొచ్చి బోర్డు మింద మీరు చూసి రాసేసి పోయే మీ మ్యాథమాటికల్ థీరమ్స్ అవి అపై ్లడ్‌వో ప్యూర్‌వో బొచ్చువో మీ నెత్తినేసుకోని రోజూ తలస్నానం చేసుకోండి.’’ అని అడగలేక... ఆ రాత్రి యింటికి రాంగానే నేను చేసిన పనేందంటే అప్పటిదాకా నేను చదువుల ద్వారా సంపాయించుకున్న ఫస్ట్‌క్లాస్ సర్టిఫికెట్లన్నీ మూడో కంటికి (ఈ రోజు టికీ) కూడా తెలీకుండా చింపి పవిత్రమైన మా పేడదిబ్బలో ఆ కల్మషాన్ని కలిపేసి గుర్రుపెట్టి నిద్రపోయినాను.

ఇంక రెండోకత చిన్నది. మాంగల్య బలాన్ని ఎగిసి ఎడమ కాలితో తన్ని నాకు అక్క వరసైన ఒకామె- పది రూపాయలు జేబీలో మెదిలే ఒకాయన్ని పెట్టుకొనింది. లేదా పది రూపాయలు జేబీలో మెదిలే ఆ నా కొడుకే ఆమెకి ఆ మాటా ఈ మాటా చెప్పి పెట్టుకున్నాడు. వాడు రెండు మూడేండ్లు ఆమె గుండు గుడిసెకి వస్తా పోతా వుండినాడు. మూడు నెల్లు అయిపు లేకపోయే సరికి నేనా అక్కతో, ‘‘అకా అకా వాడేమన్నా పది రూపాయలు సఖాయం చేసినాడా? ఈ నడమన్నే నీ పెద్ద కూతురికి పెండ్లి చేస్తివి గదా. అయిదు వేలో పది వేలో కర్జేమన్నా పెట్టినాడా?’’ అనడిగినా.

ఆ అక్క అన్న మాట అచ్చిరం పొల్లు పోకుండా:
‘‘సినబ్బా! ఎండకేసిన పందిరి గాలీవానకి నిలిస్తిందంటావా?’’
ఆ నిమిసాన- ఆ అక్క నోట్లో రష్యన్ మహా రచయితలైన గోగోల్, చెహోవ్, గోర్కీ... ఇంకా చార్లెస్ డికెన్స్, మార్క్ ట్వెయిన్, మరీ ముఖ్యంగా అవుట్ సైడర్ నవల రాసి నోబెల్ బహుమతి పొందిన ఆల్బర్ట్ కామూ వీళ్లంతా కండ్లకు కట్టినట్టు కనిపించినారు మరుగుజ్జులు మాదిరిగా.

యిపుడు నేను చెప్పబోయ్యే మూడోకత మూడేండ్లకు ముందర యిప్పుడు నేను చచ్చుండే అన్నమయ్య టవర్స్ సెల్లార్‌లో జరిగిన కత. తెల్లారి ఆరున్నరకు నేను టీ తాగి సెల్లార్‌లోకి వచ్చి సిగరెట్టు అంటించినానో లేదో ఒక పేదరాలు 22, 23 ఏళ్లుంటాయి మహా అయితే... ఎదురుగా మూడు నాలుగేండ్ల చిన్న బిడ్డలిద్దురు! ఆమె పారిపోకుండా స్తంభానికి కట్టేసి వుండారు. సెల్లార్‌లో అప్పటికే అయిదారుగురు మగధీరులు ఆ (దొంగ) తల్లిని పట్టుకుపోదురు రమ్మని పోలీస్ స్టేషనుకు సెల్‌ఫోన్లలో ఓ అని మాట్లాడేస్తున్నారు. ఈ మెల్లకన్నుతో ఆమెను చూస్తి.

నల్ల రూపాన నాణ్యంగా వుండాది. సరైన పోషణ లేక ఆ పొడుగాటి చేతల మింద చిన్న చిన్న పుండ్లు కూడా! టైం ఎనిమిదై పోతా వుంది. మా సెల్లార్‌లో వున్న కొంతమంది నీతిమంతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి, ఎంతకీ పోలీసులు రారేమని! సెల్‌ఫోన్లల్లో మాట్లాడే వాళ్ల దగ్గరికి పోయి కుయ్యో మొర్రో అందామంటే దైర్నం చాలడంలా. నేనుండేది బాడిక్కి. పైగా (చూపులకు) పిచ్చోడి మాదిరుంటా. నా మాట చెల్లతాదా!

స్తంభానికి కట్టేసి వున్న ఆ క్లియోపాత్రా దగ్గరకు సిగ్గుగా, గుండెలదురుతుండగా పోయినాను. తలొంచుకోని ఒక మాట అన్నా; బహువచనంలో సంబోధిస్తూ... ‘‘మీరేం భయపడకండి. నా గొంతులో వూపిరుండంగా మిమ్మల్నీ, మీ బిడ్డల్నీ పోలీసుల పరం చెయ్యను. నా మాట నమ్మండి.’’ అనేసి కాలవ పక్కన బండి దగ్గరికి పోయి మూడు నాష్టా పొట్లాలు తెచ్చి ఆమె ముందు పెట్నాను.
బిడ్డలు తిన్నారు. ఆ తర్వాత ఆమె తినింది.
అక్కడున్న మొగోళ్ల ద్వారా ఆమె చేసిందడిగి కనుక్కుంటే జరిగిందిదీ:

గుండె దిటవు చేసుకుని వినండి! ఈ అపార్ట్‌మెంట్‌లో అప్పటికింకా 5, 6 శాతం చిన్న చిన్న పనులేవో మిగిలే వున్నాయి. అందువల్ల సెల్లార్‌లో ప్లాస్టిక్ పైపుల తునకలు జానడేసీ, పగిలిపోయిన ప్లాస్టీకు బిందెలూ, ఇంకా తాగి పారేసిన వాటర్ బాటిళ్లూ... ఇట్లా ఎన్నో! ఆ నల్లటామె తెల్లవారు జామున నాలుగ్గంటలకు నిద్రలేచి, ఇద్దరు బిడ్డల్నీ చెరో చంకనా వేసుకోని మా సెల్లార్‌లో వున్న యావత్ భారతదేశ సంప దనీ కొల్లగొట్టడానికి దొంగతనంగా దూరిందంట.

బిడ్డల్ని కిందికి దించి ఆ ప్లాస్టీకు ముక్కా ఈ ప్లాస్టీకు ముక్కా ఏరుకుంటా వుంటే కత్తి లాంటి మా నైట్ వాచ్‌మన్ చూసేసినాడు. ఆమె పరిగెత్తేసింది, ఆ తొందర్లో బిడ్డల్నొదిలేసి! వాచ్‌మన్ తెలివి తేటల్ని చూడండి- ఆమె ఇద్దరు బిడ్డల్నీ పట్టుకుని కాలు మింద కాలేసుకుని కూర్చున్నాడు.

దూడల కోసరం ఆవు తిరిగొచ్చినట్టుగా బిడ్డల కోసరం ఆ నల్లటామె వాచ్‌మన్‌కి లొంగిపోయింది. వాచ్‌మన్, ‘నా దగ్గర్నా నీ తెలివీతేటా? చూసినావా నా పనితనం?’’ అని తలెగరేసి ఆమెని స్తంభానికి కట్టేసినాడంతే.

నేను విన్నదాన్ని బట్టి మనది ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలోని ప్రతి స్ర్తీ భరతమాతే! గొప్పింటి స్ర్తీలే కాదు! తెల్లారుజామున ఒక భరతమాత బిడ్డలిద్దరిని చంకకెత్తుకుని తుక్కు సామాను దొంగిలించడానికి బయలుదేరిందంటే... ఆ తప్పెవరిది? ఆమె పరిస్థితికి నా బుద్ధికి తోచిన ముద్దాయిలు వీళ్లు:

1) ఇది తిరప్తిలో జరిగింది కాబట్టి ఇక్కడి ప్రథమ పౌరుడు మునిసిపల్ ఛైర్మనో, కమిషినరో ఎవడైతే వాడు.
2) తిరప్తి ఎమ్మెల్యే.
3) తిరప్తి చిత్తూరు జిల్లాలో వుంది కాబట్టి ఆ జిల్లా కలెక్టరు, ఎస్.పి.
4) ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కాబట్టి గవర్నరు, ముఖ్యమంత్రి.
5) ఇది భారతదేశంలో జరిగింది కాబట్టి ప్రధానమంత్రి , రాష్టప్రతి.
6) ఇది ప్రపంచంలో జరిగింది కాబట్టి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు.

అప్పటికప్పుడు సైకిలేసుకుని పోలీసు స్టేషనుకు పరిగెత్తినా. ‘అన్నమయ్య టవర్స్’ అనగానే, ‘‘నువ్వు వాచ్‌మన్‌వా? మీవాళ్లు ఫోన్ల మింద ఫోన్లు చేసి చంపేస్తుండారయ్యా!’’ అన్నాడు అక్కడున్న ఒక కానిస్టేబుల్ సైకిల్ మింద నా అవతారం చూసి. అతన్తో ఒక్క మాటా మాట్లాడ్డం అనవసరం అనిపించి, ‘‘ఈ వెయ్యీ తీసుకోండి. నేను వాచ్‌మన్‌ని కాను, ఆ అపార్ట్‌మెంట్‌లో బాడిక్కి వుండేవాణ్ని. అపార్ట్‌మెంట్ వాళ్ల తృప్తికోసం అక్కడికొచ్చి (ఆమెని కొట్టకుండా) నోటికొచ్చినట్టు తిట్టి వొదిలేయండి.’’ అనేసి సెల్లార్ కొచ్చేసినా.

పూజ్యనీయురాలైన ఆ నల్లటి భరతమాతకు కట్టిన కట్లు తెగిపొయ్‌నాయి.
అంత రాగి జావ తాగేసి నిజంగానే మా వూరికి సైకిల్ మింద పోయి దింపుడుకళ్లం దగ్గిర ఆగి, ఆ రాతి మింద మూడుసార్లు ఎంగిలూంచి మళ్లా సైకిలెక్కేసినా, నా కండ్లల్లో చెమ్మ కూడా లేదు!

ఇప్పుడు శిష్ట్లా ఉమామహేశ్వరరావు గుంయి గుంయి గురివి కత.
ఈ కత నా ముక్య చేహితురాలు గురివిది! అని ఉమ్మయ్య ఈ కతని ఆరంబం జేస్తాడు. అంటే చదివే వాళ్లని వుద్దేశించి జాగర్తగా చదవండ్రా లమ్డీకె లచ్చన్నల్లారా అని అర్తం. గురివి 19 ఏండ్లకంతా సైన్యంలో చేరింది, నర్సు ట్రైనింగుకు.

అప్పట్లో జపాన్ సేనల్ని ఎదుర్కొనడానికీ, బ్రిటిషు సైనికులకు అండగా నిలవడానికీ బీదా బిక్కీ లక్షలాదిగా సైన్యంలో చేరిపోయినారు. గుంటూరు జిల్లా పిల్ల అస్సాం పరిసరాల్లోకి సైన్యంలో చేరడానికి పోయిందంటే వుండూర్లో బతుకు తెరువు లేకే గదా. ఇదేదీ ఉమ్మయ్య చెప్పడు. నేనెందుకు చెప్పాల?

గురివికి ట్రైనింగయ్యింది. అయితే వెంటనే డిశ్చార్జి అయ్యింది. కారణం ఆమెకెప్పుడూ చెవుల్లో గుంయి గుంయిమంటుంటాది. ఒకసారి డాక్టరు దగ్గిర చూపించుకుంటే, ‘‘నీ చెవుల్లో శేర్ల కొద్దీ ఫేసు పౌడరుంది’’ అని అదంతా తీసి పారేసినాడు. అయినా గురివికి చెవుల్లో గుంయి గుంయిమంటానే ఉంది. ఒక రోజు డాక్టరు ఆపరేషను చేస్తుంటాడు. ఈ గుంయి గుంయి బాద పళ్లేక చేతిలో వున్న పళ్లాన్ని విసిరి పారేసి గురివి అదే పోతా. ఫలితం సైన్యం నుంచి డిశ్చార్జి.

ఒకసారి ఉమ్మయ్య బెటాలియన్‌తో పాటు సికింద్రాబాదు వచ్చి వుంటే అక్కడ తేలి వుంటాది గురివి. ఇద్దరూ పార్కులో కూర్చున్నారు. ఆ కబురూ ఈ కబురూ చెబుతున్నదల్లా వున్నట్టుండి ‘‘అరెరే’’ అనింది గురివి. ‘‘సెప్పడానికి సిగ్గవుతుందోయి’’ అంది మళ్లా. ‘‘నీకు సిగ్గేంటి గురివీ!’’ అని ఉమ్మయ్య అనడంతో చెప్పేసింది. ‘‘రైక లోపల బాడీ బనీను పగిలింది!’’ అని.

ఇద్దరూ బట్టల కొట్లోకి పోరుునారు. సెజైంతో చెప్పమన్నాడు కొట్టు కుర్రాడు. 32 అని చెప్పింది పిచ్చి నా గురివి.
‘‘మేడంకు 36 సైజు అని నా వుద్దేశం’’ అన్నాడు షాపు కుర్రాడు.
ఎక్కడ రగలాల్నో అక్కడ రగిలిన గురివి, ‘‘నో, నాకు 32 సైజే కావాల.’’ అంది.
‘‘మీకు 36 సైజే ఫిట్’’ అంటాడు మళ్లా కుర్రాడు.

‘‘నా సైజు నాకే తెలీదంటావా?’’ అని కుర్రాడి మిందికి ఎడంకాలెత్తుకోని పోతుంది గురివి.
‘‘ఏడేండ్ల నుంచి లోబాడీలమ్మతా వుండా. ఏ ఆడదానికి ఏ సైజో నాకు తెల్దా? 36 సైజు వాళ్లు 32 యేసుకుంటే చెవుల్లో గుంయి గుంయి మంటూ వుంటాది!’’ అని షాపు కుర్రాడు అనడంతో కత ముగిసిపోతుంది. 1990 ప్రాంతంలో ఈ కత చదవడం ముగించగానే నేను బోల పొనుకోని, ఎంత ఏడుపు ఏడ్చినానో చెప్పలేను. సభ్య సమాజానికి ఈ కత రొమ్ముల మిందా, బ్రాల మిందా అనిపించి, ఈ కత చదవంగానే తల దించుకోవచ్చు. సభ్య సమాజానికి ఇంకేం పనుండదు, చీటికి మాటికి తల దించుకోవడమే దాని పని.

ఈ కత చదివి నేనెందుకేడ్చినానో చెప్తే నా ఉమ్మయ్యకి నేను ద్రోహం చేసినట్టు కాబట్టి చెప్పను!
నేను 1998లో హైద్రాబాద్‌లో ఆంధ్రజ్యోతి వీక్లీకి ఎడిటర్‌గా వున్నప్పుడు ‘పాత బంగారం’ పేరిట లబ్ధప్రతిష్ఠులైన రచయితల పాత కథలతో దీపావళి ప్రత్యేక సంచిక తెచ్చినాను. అందులో మొదటి కథ గుంయి గుంయి గురివినే వేసి నేను పుట్టకముందెప్పుడో చచ్చిపోయిన ఆయనకు జేజేలు పలికినాను.

అనుకుంటే నా ఉద్యోగాన్ని వూడగొట్టే సత్తావున్న ఒకాయనఆ సంచికలో గుంయిగుంయి గురివి కథ చదివి, అందునా తొలి కథగా వెయ్యడం చూసి ఫోనులో నాతో రచ్చకు దిగి,‘‘నువ్వూ మాండలికం ముసుగులో ఇట్టా బూతు మాటల్తో కతల్రాసే వాడివేగదా’’అని ఫోను పెట్టకుండా బూతులు తిట్టినాడు. ఆ పెద్దాయన సభ్య సమాజంలోని సభ్యుడు. ఆయనతో ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ.

నేనూ నా తలకొవ్వుకొద్దీ ఈమాదిరిగా మాట్లాడినాను ‘‘అయ్యా! శిష్ట్లా ఉమామహేశాన్ని బతికుండంగా పచ్చి తాగుబోతన్నారు. వ్యభిచారి అన్నారు. ఇంకా హోమోసెక్సువల్ అని కూడా బొక్కలాడి 40 ఏండ్ల వయసుకే ఆయన్ను చంపుకుతిన్నారు. మీకు తెలిసినంత వరకూ నేనూ పచ్చి తాగుబోతునే, వ్యభిచారినే. నా మాదిరి తాగుబోతుకీ ఎప్సేరికీ ఏడవాలంటే జీవితానికి ఒక్క గుంయిగుంయి గురివి చాలు. సభ్య సమాజంలో వున్న మిమ్మల్ని ఏడిపించడానికి గురివి చాలదు. గ్లిజరిన్ కావాలి. నా దగ్గర అది లేదు!’’

--- నామిని సుబ్రమణ్యం నాయుడు

05-12-10, ఆదివారం అనుబంధం నుండి..



Read More !

మనిషి కాసేపు మారిపోతాడు...

దేవుడా... శ్రీనివాసుడా... తండ్రీ... అనుకున్నారు చైర్మన్‌గారు. ఆ తర్వాత దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలియక బిక్కముఖం వేశారు. అలాగని ఆయన గుడికి వెళ్లడని కాదు. దేవుడంటే నమ్మకం లేకా కాదు. కాని, భక్తి కంటే ఎక్కువగా ముక్తికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ముక్తి దేని వల్ల వస్తుంది? ఇంక దేని వల్ల? డబ్బు వల్ల. పైసా వల్ల. కరెన్సీ వల్ల. కాసుల వల్ల. ఇవి ఉంటే లోకం మాట వింటుందని నమ్ముతారు చైర్మన్‌గారు. అందుకోసమే ఆ డబ్బును పులిలా వేటాడుతారాయన. ఇవాళ ఆయనకు ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క లేదు. ఎన్ని సంస్థలు ఉన్నాయో గుర్తు లేదు. ఎన్ని భవంతులు ఉన్నాయో అంచనా లేదు.

అయితే- దురదృష్టం ఏమిటంటే- అవన్నీ- ఈ క్షణం ఆయనకు ఏ కోశానా పనికి రావడం లేదు.
ప్రస్తుతం ఆయన తన ఆఫీసు బాత్‌రూమ్‌లో చిక్కుబడి ఉన్నారు. ఎంతో ఖరీదైన బాత్‌రూమ్ అది. చైర్మన్‌గారి స్నానపానాల కోసమే ప్రత్యేకించి కట్టిన బాత్‌రూమ్. ప్రస్తుతం అదే ఆయనకు గోరీలా మారబోతోంది. డోర్ లాకై రావడం లేదు. ఆటోమాటిక్ లాక్. ఎంత లాగినా తలుపు తెరుచుకోవడం లేదు. లోపలి నుంచి అరిస్తే ఎవరికీ వినబడే అవకాశం లేదు. వెంటిలేటర్ నుంచి చూద్దామన్నా ఏమీ కనిపించే వీలు లేదు.

దబ్బపండులాంటి రంగు కలిగిన చైర్మన్‌గారి శరీరం చెమటతో భయంతో తడిసి ముద్దయిపోయింది. అసలే ఆయన జబ్బు మనిషి. ఇటీవలే రెండున్నర లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకు వచ్చారు. డబ్బున్నవాళ్లకు ఆమాత్రం చికాకులేవో వస్తాయని ఆయనకు తెలుసు. వాటిని ఇలాగే ఖర్చు పెట్టుకొని సరి చేసుకుంటారనీ తెలుసు. పేదవాళ్లకు ఈ గొడవలూ ఇంత ఖరీదైన జబ్బులూ ఉండవు కదా ఒకరకంగా ధనవంతుల కంటే పేదవాళ్లే నయం కదా అని ఆయన అభిప్రాయం.

ఆ.. ఏం నయమండీ... ఆకలితో చస్తుంటారు శుంఠలు... ఇవాళ్టి ప్రాణానికి రేపు గ్యారంటీ లేదు.. ఎలాగూ మీరు వైద్యానికి అమెరికాకు వెళుతున్నారు... వెళ్లే ముందు ఏవైనా మంచి కార్యాలు చేయండి... పేదవాళ్లకు నాలుగు ఇళ్లన్నా కట్టించిపోండి... అన్నాడో మిత్రుడు చైర్మన్‌గారితో.
మళ్లీ వస్తావో చస్తావో అని మిత్రుడి ఉద్దేశం.

కాని, చైర్మన్‌గారికి ఇలాంటి డొల్ల మాటల్లో విశ్వాసం లేదు. ఎవరికీ ఏదీ అయాచితంగా ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. ఇదంతా తాను కష్టపడి సంపాదించిన ఆస్తి. అందులోంచి కొంచెమైనా సరే పంచి పెట్టడమా? ఇంపాజిబుల్!
అదంతా ఇప్పుడు చైర్మన్‌గారికి గుర్తుకొస్తూ ఉంది. తాను ఈ బాత్‌రూమ్‌లోనే పోబోతున్నాడా? ఇక్కడే చావబోతున్నాడా? ఆయన అనుమతి లేకుండా ఛాంబర్‌లో అడుగుపెట్టే సాహసం ఎవరికీ లేదు. ఇక బాత్‌రూమ్‌లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది?

దేవుడా... వేంకట రమణ... నన్ను బతికించవయ్యా.. అనుకున్నారు చైర్మనుగారు దీనంగా. ఆ తత్తరుపాటులోనే కమోడ్ మీద నుంచి జారి పడ్డారు. కమోడ్‌కూ గోడకూ మధ్య ఉన్న స్థలంలో సోలిపోయారు. నడుముకున్న టవల్ ఊడిపోయింది. కదల్లేక, మెదల్లేక, తల్లి కడుపులోని శిశువు వలే, నగ్నంగా పడి ఉన్నాడాయన.

ఆ క్షణంలో ఆయన మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు. ఎంతలా మారిపోవాలో అంతలా మారిపోయాడు. దేవుడా... బుద్ధి వచ్చింది... ఈ క్షణం నేను బతికి బట్టగట్టగలిగితే చాలు మారిపోతాను. నన్ను ఎవరైనా కాపాడితే చాలు వాళ్లకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. నా సంపద ఇచ్చేస్తాను. నా సర్వస్వం ఇచ్చేస్తాను. ఇది తథ్యం. ఇది ఖాయం.
దేవుడు ఆయన మొర ఆలకించాడు. అప్పుడు పాకీ మనిషి పార్వతి అక్కడికి వచ్చింది. చైర్మన్‌గారంటే హరిహరాదులకు భయం. కాని పార్వతికి చనువు. ఆయన చాంబర్‌లో ఆయన అనుమతి లేకుండా అడుగుపెట్టే ఏకైక వ్యక్తి పార్వతే. అరమరికలు లేకుండా మాట్లాడగలిగే వ్యక్తి కూడా పార్వతే.
ఏటి బాబూ... పైదేశానికి వెళుతున్నావా వైద్యానికి అని అడిగింది పార్వతి- చైర్మన్‌గారు అమెరికాకు వెళ్లే ముందు.

అవునే... గుండె నొప్పి అన్నాడాయన వెళుతున్న కారణం చెప్తూ.
నీది బలే సిన్ని గుండె బాబూ... ఏదీ తట్టుకోలేదు... అంది పార్వతి ఎంతో దయగా, మరెంతో అపేక్షగా.
ఆ చిన్ని గుండె మనిషి, చైర్మన్‌గారు, ఇలా బాత్‌రూమ్‌లో చిక్కుకుపోయిన సంగతి పార్వతి గ్రహించింది. అత్యవసరంగా కదిలింది. ఏవో చువ్వలు, కడ్డీలు తెచ్చి ప్రయత్నించి క్షణాల్లో డోర్ లాక్ తీసింది.
ఆమె- చైర్మన్‌గారి అవస్థ చూసి ఆశ్చర్యపోయిందా? ఏమీ లేదు. ఇది అందరికీ సంభవించే ప్రమాదంలాంటిదే అన్నట్టుగా నిబ్బరంగా
ఆయనను లేవదీసింది. నడుముకు బట్ట కట్టింది. ఆ తర్వాత ఆయనను ఆయన గదిలోకి తీసుకొని వచ్చి, మంచం మీద పరుండబెట్టి బలేవారే బాబూ... బాత్‌రూమ్‌లో ఇరుక్కు
పోయినారా... నయమే... నేను రావడం ఆలస్యమైంది కాదు... అని ఆ తర్వాత బాత్‌రూమ్ కడగడానికి వెళ్లిపోయింది.
పార్వతికి సంబంధించినంత వరకూ ఆ ఉదంతం అంతటితో
ముగిసింది.
కాని- మరెందుకనో- ఆ మరుసటి రోజే చైర్మన్‌గారు పార్వతిని పనిలో నుంచి తీసేశారు.
కథ ముగిసింది.

రచయిత పురాణం సుబ్రహ్మణ్యశర్మ 1980లలో రాసిన కథ ఇది.
మనుషుల పేగుల్లో ఉండే కుళ్లు, మనుషుల్లో నిలువెల్లా ఉండే అహము, మనుషుల్లో ఏరు దాటి తెప్ప తగలేసే హీనత్వము, మనుషుల్లో చేసిన మేలు మర్చిపోయే మతిమరుపుగుణమూ, మనుషుల్లో అవసరం తీరాక ముఖం చాటేసే కుటిల బుద్ధీ.... ఇవన్నీ కలిపి చూపిన కథ ఇది.
చరిత్ర రెండు రకాలు.
ఒకటి- కృతజ్ఞత మీద నిర్మితమైనది. రెండు- కృతఘ్నత మీద నిర్మితమైనది.
ఒకటి వెలుగు. రెండు చీకటి.
వెలుగు గెలవాలంటే చీకటి ఉండక తప్పదు. మంచి నిర్మితం కావాలంటే చెడు నిర్మితం కాక తప్పదు. ఈ చెడును చూపి మనలోని మంచిని టికిల్ చేసే కథ ఇది.
గొప్ప కథ. పూజగదిలాంటి కథ.
- సాక్షి ఫ్యామిలీ

పురాణం సుబ్రహ్మణ్యశర్మ: రచయితగా, సంపాదకునిగా సవ్యసాచి. తెలుగు మేగజైన్ జర్నలిజమ్‌లో ప్రమాణాలు స్థిరపరిచారు. ‘నీలి’ వీరి ప్రసిద్ధ కథాసంపుటి. పురాణం సీత పేరుతో వీరు రాసిన ‘ఇల్లాలి ముచ్చట్లు’ పెద్ద హిట్. స్వస్థలం పిఠాపురం. 1996లో మృతి చెందారు. ఇతర వివరాలకు వారబ్బాయి శ్రీనివాసశాస్ర్తి నంబర్: 9293186031


సాక్షి, డైలీస్టోరీ, ప్రతి రోజూ కథా పరిచయం నుంచి..
Read More !

1, డిసెంబర్ 2010, బుధవారం

సమానం

వి. రాజారామమోహనరావు

ఆ జీవితం అంత బావుంటుందనుకోలేదు ఈశ్వరి.పునర్వివాహం జరిగి ఆరు నెలలు దాటింది. ఆరు నెలల క్రితం అకస్మాత్తుగా మేనత్త సువర్చల ఈశ్వరి దగ్గరికి వచ్చింది. ఆవిడ స్నేహితురాలు వేదవతీ వచ్చింది. అరగంట దాటకముందే విషయం సూటిగా చెప్పింది వేదవతి.

"నా తమ్ముడు రవీంద్రకి నలభై ఏళ్లు. ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పను కానీ, నిన్ను చూశాక ... మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుందనిపిస్తోంది. ఇప్పటి కన్నా నీ జీవితం బావుంటుందే తప్ప దిగజారదని నేను గట్టిగా చెప్పగలను. మావాడి ఇంటికి ఒకసారి వచ్చి మంచీ చెడూ నువ్వే చూసుకో. ఆ తర్వాత నీ ఇష్టం''.
ఆవిడ మాటలు సూటిగానే కాదు, నిజాయితీగా కూడా అనిపించాయి ఈశ్వరికి.
రవీంద్రకి పదిహేనేళ్ల కొడుకున్నాడు. పేరు కృష్ణ. ఈశ్వరికి పదమూడేళ్ల కూతురు ... జాహ్నవి.
మేనత్తతో వేదవతితో కలిసే వెళ్లింది ఈశ్వరి. ఓ గంటో రెండు గంటలో కాదు. రవీంద్ర వాళ్లింట్లో రెండు రోజులు వుంది.
ఆ ఇల్లు, వాళ్ల జీవితం ఈశ్వరి ఊహించని లోకం. ఇంట్లోని వ్యక్తులందరికీ తలో కారు కాకుండా అదనపు అవసరాలకి మరో రెండు కార్లున్నాయి. అలాగే అదనపు సామాన్లు, పడక గదులు ... ఆ ఇంట్లో అంగుళం, అంగుళం ఐశ్వర్యం కనిపిస్తోంది. కేవలం డబ్బుకోసమని కాదుగానీ, రవీంద్ర చెప్పిన ఒకమాట ఎంతగానో నచ్చి ఈశ్వరి పెళ్లికి ఒప్పుకుంది.
"అసలు మళ్లీ పెళ్లి అన్న ఉద్దేశమే లేదు నాకు. కానీ వేదవతి అక్కయ్య ఒప్పించింది. ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ నా ఉద్దేశం మాత్రం నాలాంటి ... అంటే నాలా సంతానం వుండి భాగస్వామి లేని స్త్రీ అయితే ఇద్దరికీ నయం అనిపించింది. మీరు నాకు నచ్చారు. మనం ఒకళ్లకొకరం నచ్చటమే కాదు మన పిల్లలకీ మనం నచ్చాలి... ఆ తర్వాతే పెళ్లి ...'' అన్నాడు. అతనన్నట్టుగానే పిల్లలతో కలిసే, వారికి చెప్పే పెళ్లి చేసుకున్నారు. పిల్లలిద్దరికీ విషయం పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అలా అని అస్సలు అర్థం కాకపోవటం కూడా లేదు.

పెళ్లయిన పదిహేను రోజుల తర్వా త, ఓ వారంరోజులు పిల్లలిద్దరితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లివచ్చారు. అక్కడ మం చు, చలి కొత్తదనంతో పాటు, ఆప్యాయతగా వుండే తోడులోని వెచ్చదనపు కొత్తరుచి ఈశ్వరి అనుభవంలోకి వచ్చింది. ఆ వారం పూర్తయ్యేలోపే ఈశ్వరి రవీంద్ర కుటుంబానికి తనని తాను మానసికంగా పూర్తిగా అర్పించుకుంది.
రవీంద్ర కుటుంబంలో అన్ని రకాల పనులకి పనివాళ్లు వున్నారు. ఈశ్వరి ప్రత్యేకంగా చెయ్యాల్సిన పనులేం లేవు. అలా అని, చెయ్యాలనుకుంటే పనులకేం లోటులేదు. ఇంటి వ్యవహారాలు, కొన్ని వ్యాపారపు పనులు ఈశ్వరి ఇష్టంగానే కల్పించుకుంది. కుటుంబంలో మంచిస్థానం, అధికారం, ఆర్థికబలం, పై వర్గపు జీవిత సుఖం ... ఇవన్నీ వచ్చాక ఈశ్వరి ఒక కొత్త ఉత్సాహంలా మారింది.

కృష్ణ ఎప్పట్నించో రెసిడెన్షియల్ స్కూల్లో వున్నాడు. ఇప్పుడు జాహ్నవిని కూడా మరో రెసిడెన్షియల్‌లో చేర్చారు.
పరిస్థితులు బావుంటే చేసే పనులు కూడా ఉత్సాహంగా వుంటాయి. కుటుంబంలోని అందరికీ ఈశ్వరి, ఈశ్వరి పను లూ అనుకూలంగా వున్నాయి. ముఖ్యంగా కృష్ణ విషయంలో ఆమె చూపించే శ్రద్ధ అందరికీ అపురూపంగా వుంది. రవీంద్ర విషయం చెప్పనే అక్కర్లేదు. కొంచెం తీరుబడిగా కూర్చున్నప్పుడూ, గతం గుర్తొచ్చినప్పుడూ, ఈశ్వరికి ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు ఇంత ధైర్యం ఉండేది కాదు. జాహ్నవి తండ్రి పోయినప్పుడు కూతురు తనతోటే వుంటుందని బంధువులతో గట్టిగా చెప్పటానికి జంకింది. అత్తింటివేపు దగ్గరి బంధువులు ఎవ్వరూ లేరు. దూరపు బంధువులు అవకాశం చూసుకుని పెత్తనం చెయ్యాలనుకున్నారు. అయ్యో భర్త పోయాడే, కూతురు భవిష్యత్తేమిటన్న దిగులులో ఆమె వుంటుందన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. సొంతిల్లుంది. తల్లీ కూతురు వుంటే ఏదో చాకిరీ అప్పచెప్పొచ్చు. ఎప్పటికైనా ఇల్లు స్వాధీనం చేసుకోవచ్చన్న ఆలోచనే అందరిదీ.

చివరికి ఎలాగైతేనేం కూతురి మీద, తన మీద మరెవ్వరి నీడ పడకుండా జాగ్రత్త పడగలిగింది ఈశ్వరి. ఇప్పుడున్న ధైర్యం అప్పుడుంటే అసలు జంకేది కాదేమో ... ఏ పరిస్థితినైనా ఎదిరించగల ధైర్యం దానంతట అదే తనకి వచ్చేసినట్టుంది. బతుకు సజావుగా వుండటమంటే ఇదే కాబోలు. చీరలు, నగలు ఏమైనా కావాలంటే కొనుక్కోమని నాలుగైదుసార్లు అన్నాడు రవీంద్ర. వద్దంది ఈశ్వరి. పెళ్లికి రవీంద్ర, అతని ఇంటివాళ్లు కొన్నవే చాలా వున్నాయి. నాలుగు చీరలతో సర్దుకోటం అలవాటున్న ఈశ్వరికి ఇంకేం కావాలనిపించలేదు. ఇంట్లో దేనికీ లోటు లేదు. ఈశ్వరి ఆ ఇంటికి వచ్చేటప్పటికే ఆమె కోసం ఒక కారు, డ్రైవరు సిద్ధంగా ఉన్నాయి. ఆమె బేంక్ ఎకౌంటులో డబ్బులోటు లేకుండా చూస్తున్నాడు రవీంద్ర. అన్నిటికీ మించి ఎవరూ దేనికీ ఏమీ అనని స్వతంత్రం వుంది.

కృష్ణ చదువుకుంటున్న స్కూలు వంద కిలోమీటర్ల దూరం. వీలున్నప్పుడల్లా వెళ్లి ఆ పిల్లాడి బాగోగులు కనుక్కొస్తోంది ఈశ్వరి. కావల్సినవి తీసికెళ్లి స్వయంగా ఇవ్వటం, కలిసి సమయం గడపటం వల్ల కృష్ణ ఈశ్వరికి బాగా మాలిమి అయ్యాడు. అలా వెళ్లి వచ్చి ఆ సంగతులన్నీ ఆ రాత్రి రవీంద్రకి పూసగుచ్చినట్టు చెపుతుంటే అతనికి ఎంతో సంతృప్తి. జాహ్నవి స్కూలుకి వెళ్లాలంటే నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి. నెల, రెండు నెలలకి ఓసారి వెడుతోంది. అలా వెళ్లిరావటమే కాక, దేనికీ వెనకాడాల్సిన అవసరం లేకుండా కూతుర్ని సకల సౌకర్యాలతో అలా చదివించగలుగుతున్నందుకు ఎంతో సంబరంగా వుంది ఈశ్వరికి. జాహ్నవి దగ్గరికి వెళ్లేముందే రవీంద్రకి చెపుతుంది. అలా వెళ్లటమే కాక, పిల్లలిద్దరితో చాలా తరచుగా ఫోన్లో మాట్లాడుతుంది. ఎప్పుడు సెలవులొస్తాయా, అందరూ కలిసి ఎప్పుడు గడుపుతామా అన్న ఉత్సాహంతో వున్నారు పిల్లలిద్దరూ. రవీంద్ర, ఈశ్వరి కలిసి ఆలోచిస్తున్నారు పిల్లల్ని ఎక్కడికి తీసుకువెడితే బావుంటుందా అని.

తాను కల్పించుకుని చేస్తున్న వ్యాపారపు పనులు రాను రాను మరింత ఆసక్తిగా వున్నాయి ఈశ్వరికి. ఖాళీ లేకుండా పని చెయ్యటంలో రుచి తెలుస్తోంది. తన శక్తి పూర్తిగా ఉపయోగపడటంలో ఎవరికైనా ఓ చిత్రమైన తృప్తి ఉంటుంది.
ఆ రోజూ ఎప్పట్లానే ఉత్సాహంగా తయారవుతోంది ఈశ్వరి ... ఆ సమయంలో వచ్చిన ఫోన్ ఒక్క క్షణంలో అంతా తల్లకిందులు చేసింది. వెంటనే కారులో ప్రయాణమైంది. తట్టుకోలేనంత కంగారు ... జాహ్నవి ఎలా వుందోనన్న బెంగ. డ్రైవర్ ఎంతో స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నా, మరింతగా తొందరపెట్టింది.

అర్జెంటుగా రమ్మనమని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి క్లుప్తంగా వివరాలు చెప్పింది.
జాహ్నవి తల్లిలాగే ఎత్తరి - పదమూడేళ్ల వయసుకి మించి కనిపిస్తుంది. ఆ కుర్రాడెవరో తెలియదు. పిల్లని ఏం చేశాడో తెలియదు. జాహ్నవి పూర్తిగా భయపడిపోయి పిచ్చిచూపులు చూస్తూ ఏడుస్తోందని ప్రిన్సిపాల్ చెప్పింది. ఎంతగా అడిగినా అంతకు మించి వివరాలేం చెప్పలేదు.
క్షణమొక యుగంలా వుంది. మనసు పరిపరి విధాల పోతోంది. ఆతృతగా కిలోమీటర్లని లెక్కపెడుతూనే వుంది ఈశ్వరి. ఇక పది కిలోమీటర్ల దూరంలో స్కూలు వుందనగా ఈశ్వరి సెల్ మోగింది - రవీంద్ర ఫోన్.
"కృష్ణ ఇంటికి వస్తానని ఫోన్ చేశాడు. ఎల్లుండి మా నాన్నగారి బర్త్‌డే కదా ... వెళ్లి తీసుకురా ...'' నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని ... "నేను వెళ్లలేనండీ ... జాహ్నవి దగ్గరికి వచ్చాను ...'' అంది. రవీంద్ర మరో మాట లేకుండా ఫోన్ కట్ చేశాడు.
ఉన్న కంగారుకి తోడు ఇది మరో ఒత్తిడి.
ఈశ్వరి వెళ్లిన తర్వాత జాహ్నవి కొద్దిగా కోలుకుంది. కూతుర్ని తరచి తరచి వివరాలడిగింది. ప్రమాదమేం జరగలేదు కానీ, జాహ్నవి బాగా భయపడిపోయింది. స్కూలు గార్డెన్‌లో తిరుగుతూ ఉండగా కాంపౌండ్ గోడ దూకి వచ్చి ఒక కుర్రాడు ఆకస్మాత్తుగా మీద పడ్డాడు. జాహ్నవి కేకలు పెట్టటంతో పారిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ వచ్చే లోపే ఇదంతా జరిగిపోయింది. జరిగిన దానికి ప్రిన్సిపాల్ ఎంతగానో బాధపడింది.

ఎంతగా ధైర్యం చెప్పినా జాహ్నవి ఇంక అక్కడ ఉండనంది. సామానంతా తీసుకుని అక్కడి తతంగం పూర్తిచేసుకుని ఈశ్వరి తిరు గు ప్రయాణం అయ్యేటప్పటికి రాత్రి పది దాటింది. తల్లి పక్కనే వున్నా దారి పొడువునా జాహ్నవి బెరుకు, బెరుకుగానే వుంది. రవీంద్ర నుంచి ఫోన్ లేదు సరికదా స్విచ్ ఆఫ్. వెళ్లేటప్పుడు ఓరకం కంగారు. తిరిగి వస్తున్నప్పుడు మరో రకం అలజడి. ఈశ్వరి ఇల్లు చేరేటప్పటికి తెల్లవారుఝాము నాలుగు దాటింది. కృష్ణ వచ్చి నిద్రపోతున్నాడు. రవీంద్ర రాత్రి నుండి ఇంటికి రానేలేదు. జాహ్నవి ఒళ్లు తెలియకుండా నిద్రపోయింది. ఈశ్వరి ఒక్కతే కూచుని తెల్లారే వరకూ గడిపింది.
ఎనిమిది ప్రాంతంలో రవి హడావిడిగా వచ్చాడు. "నిన్న ఏం జరిగిందంటే ...'' అని ఈశ్వరి వివరాలు చెప్పబోయింది. "అవన్నీ తర్వాత ... నేను అరగంటలో అర్జెంటుగా వెళ్లాలి. నిన్న నానా యాతన అయింది. కృష్ణని తీసుకురావటానికి ఎరేంజ్ చెయ్యటం పెద్ద తలనొప్పి అయింది. అయినా జాహ్నవి దగ్గరికి వెడుతున్నానని చెప్పకుండా వెళ్లటమేమిటి?'' అన్నాడు విసుగ్గా. ఆ విసుగు ఆ రకంగా రవీంద్ర దగ్గర ఈశ్వరికి కొత్త. ఒక్క దెబ్బతో రెండు రెక్కలూ విరిగిపోయినట్టు విలవిలలాడింది ఈశ్వరి. మరో మాటకి అవకాశం లేకుండా రవీంద్ర అరగంటలో వెళ్లిపోయాడు.

***

రాత్రి పదకొండు దాటింది. ఈశ్వరి ఎదురు చూస్తూనే వుంది. రవీంద్ర దగ్గర నుంచి ఫోన్ లేదు. ఈశ్వరికీ చెయ్యాలనిపించలేదు. జాహ్నవి తాలూకు దిగులుతో పాటు, రవీంద్ర దగ్గర తన స్థితి ఇలా అయిందేమిటన్న ఆందోళన. తను తట్టుకోలేనిదేదో జరిగినట్టుంది ఈశ్వరికి. తన నమ్మకం మీద అపనమ్మకం కలిగింది. దేన్నో ఎవరినో ప్రత్యేకించి నిందించటం కాదు కానీ బాధ స్పష్టంగా గుండెల్ని పిండుతోంది. రవీంద్రతో మాట్లాడితేనే గానీ తగ్గని బాధ.
మరో అరగంటకి వచ్చాడు రవీంద్ర. అతన్ని కొంచెం స్థిమితపడనిచ్చి "జాహ్నవి దగ్గరికి అకస్మాత్తుగా ఎందుకు వెళ్లానో, అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. మీ ఒత్తిడి ఏమిటో చెప్పలేదు. కానీ చాలా కేజువల్‌గా జాహ్నవి దగ్గరికి చెప్పకుండా వెళ్లటం ఏమిటన్నారు ...'' ఓ క్షణం ఆగింది.

ఈశ్వరి గొంతులో మార్దవం లేదు. అటువంటి గొంతు రవికి కొత్తగా వుంది. ఆశ్చర్యంగా చూశాడు ...
"కృష్ణ దగ్గరికి మీకు చెప్పకుండా ఎన్నోసార్లు వెళ్లాను. అప్పుడు ఎప్పుడూ చెప్పకుండా ఎందుకు వెళ్లావు అనలేదు. కాని జాహ్నవి దగ్గరికి వెళ్లిన ప్రతిసారీ మీకు చెప్పే వెళ్లాను. ఈ ఒక్కసారి తప్ప. మీకు చాలా వ్యాపకాలున్నాయి. బాధ్యతలున్నాయి. కానీ నాకున్న ఒకే ఒక్క వ్యక్తిగత బాధ్యత జాహ్నవి''.
ఈశ్వరి మాటలు స్పష్టంగా ధ్వనించాయి. ఆమె గొంతులో తల్లితనపు నిబ్బరం తెలుస్తోంది.
మరి కాసేపటికి రవీంద్రే, నిన్నటి రోజు ఆఫీసులో తను ఎదుర్కోవాల్సి వచ్చిన ఒత్తిడి గురించి చెప్పాడు. ఆ హడావిడిలో కృష్ణని తీసుకురావటానికి ఏర్పాట్లు చెయ్యటం ఎంత చికాకు కలిగించిందో చెప్పాడు.
అంతా ఓపిగ్గా విన్న ఈశ్వరి ఏం మాట్లాడలేదు. మౌనంగా అక్కడ్నించి వెళ్లిపోయి జాహ్నవి దగ్గర పడుకుంది. నిన్నటి కన్నా జాహ్నవి పరిస్థితి కొంచెం మెరుగు. ఈ పిల్ల విషయం ఏం చెయ్యాలి? సంవత్సరం మధ్యలో వేరే స్కూల్లో ఎడ్మిషన్ దొరుకుతుందా? రవీంద్రతో ఇకముందు ఎలా వుంటుంది? తను చెప్పింది అతనికి అర్థమైందా? జాహ్నవిని మించిన ప్రాముఖ్యత తనకి మరొకటి లేదని అతను గ్రహిస్తే ... ఆ తర్వాత పరిస్థితులేమిటి? ఘర్షణలు ఎదుర్కోవాల్సి వస్తుందా? మళ్లీ తన జీవితం పూర్వ స్థితికి చేరుతుందా? తన బాధ సరే ... తమ జీవితాలకి ఇన్ని చేసిన, చేస్తున్న రవీంద్ర పరిస్థితి ఏమిటి ... కృష్ణ పరిస్థితి ఏమిటి?
ఎన్నో ఆలోచనలు ... అయినా ఒక్కటే ధైర్యం ... ఒక్కటే నిర్ణయం ... జాహ్నవి తర్వాతే ఏదైనా. కలత కలతగానే గడిచింది ఆ రాత్రి ఈశ్వరికి ...
***

నాలుగు రోజులు గడిచాయి. రవీంద్ర, ఈశ్వరి పరస్పరం మాట్లాడుకుంటున్నా మధ్యలో ఏదో అడ్డు వున్నట్టే వుంది. ఎంతో హాయిగా వున్న జీవితం మసకబారినట్టు తయారైంది.
ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తున్నా ఏమిటో ఎబ్బెట్టుగా వుంది.
ఆ రోజు రాత్రి పది దాటాక ... "ఈశ్వరీ ...'' అని పిలిచాడు రవీంద్ర. ఏమిటన్నట్టు చూసింది.
"మనం ఎంత తెలివైన వాళ్లం అనుకున్నా, ఎంత సబబుగా ప్రవర్తిస్తున్నామనుకున్నా, కొన్ని విషయాలు మన ఆలోచన వరకూ కూడా రావేమో ... కారణం ఏమిటన్నది కాదు ... నువ్వన్నదీ నిజమే ... కృష్ణ విషయంలో రాని ప్రశ్న జాహ్నవి విషయంలోనూ రాకూడదు. పిల్లలిద్దరూ వేరు వేరు కాదు. ఐయామ్ సారీ ... ఇక్కడే గౌతమి స్కూల్లో జాహ్నవికి ఎడ్మిషన్ తీసుకున్నాను. రేపే వెళ్లి జాయిన్ చేద్దాం ...'' అన్నాడు.

ఈశ్వరి ఏదో చెప్పబోయింది. రవీంద్రతో హాయిగా వున్న తమ జీవితం గురించి ... నచ్చిన అతని పద్దతుల గురించి ... జాహ్నవి విషయంలో తను పడిన కంగారుతోపాటు అతని ఆ మాటలకి కలిగిన ఆవేశం గురించి చెప్పబోయింది ... కానీ అవి మాటలుగా మారలేదు.
స్థిమితపడి, ఊరట చెందాక ఈశ్వరి చూపు మారింది. గొంతూ మారింది. నవ్వుతూ రవీంద్ర చెయ్యి అందుకుంది. ఆ స్పర్శలో తల్లితనం రవీంద్రకి మరోసారి అనుభవంలోకి వచ్చింది.

...............................................
రచయిత సెల్ నెం: 093947 ౩౮౮౦౫

ఆంధ్రజ్యోతి,
28-11-2010, ఆదివారం అనుబందం
Read More !

మనస్సాక్షి

ప్రతిరోజూ వచ్చే ఆటోరిక్షా కాదది. ఎప్పుడూ వచ్చే ఆటోరిక్షా డ్రైవర్ అతడిని తనకు బదులుగా పంపించి ఉంటాడు. తన భార్యకు ఆ మాటే చెప్పి
ఆయాసపడ్డాడు రామ్మూర్తి. అతడు మంచంపట్టి నెలరోజులకు పైనే అయ్యింది. గుమ్మాలు, గోడలు పట్టుకుని వీధిగుమ్మంలో కూర్చున్నాడు.
కొత్త ఆటోరిక్షా రాగానే ఇంట్లోకి ఆ వార్తను ప్రసారం చేశాడు.

కమలమ్మకు ఆయన మాటలు స్పష్టంగానే వినిపించాయి. కమలమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఒక షేర్ ఆటోరిక్షా ఇంటికి వచ్చి, ఆమెను ఎక్కించుకుంటుంది. ఈ రకమైన ప్రయాణ సదుపాయం అమరబట్టే కమలమ్మ అంత వృద్ధాప్యంలోనూ ఆ మాత్రం జీతం రాళ్లు తెచ్చుకుంటోంది.


రామ్మూర్తి రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా పదవీవిరమణ చేశాడు. చిన్న ఉద్యోగిగా దిగిపోవడంతో పెన్షన్ చాలడం లేదు.

‘‘నేను వెళ్లిరానా?’’ అడిగింది కమలమ్మ.
‘‘డ్రైవర్‌తో ఒకసారి నువ్వు మాట్లాడు. తన బదులుగా ఇతడిని ఎందుకు పంపించాడు? మొబైల్ ఫోన్‌లో డబ్బులున్నాయా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘డబ్బులు లేవు. అయినా ఇతడినే అడిగితే పోలేదా?’’ అంటూ కమలమ్మ ఆటోరిక్షాను సమీపించింది.

‘‘అమ్మగారూ! బయల్దేరడానికి ఆలస్యం ఉందా? ‘సరిగ్గా ఎనిమిదిన్నరకే బయలుదేరతారు టీచర్‌గారు’ అన్నాడే నన్ను పంపిన డ్రైవర్’’ చెప్పాడు కొత్త డ్రైవర్.

కమలమ్మ సంశయిస్తూ, ‘‘నిజమే, కొత్తవాడివని సంశయిస్తున్నాను. ఈ రోజుకు సిటీబస్సులో బయల్దేరతాన్లే’’ అంది.
అతడు నవ్వి, ‘‘మీ షేర్ డబ్బులు ఇచ్చెయ్యండి. వెళ్లిపోతాను. మిగతావాళ్లు బయల్దేరాలి కదా’’ అన్నాడు.

సందేహం లేదు. పాత డ్రైవర్ ఇతన్ని బెత్తాయించి ఉంటాడు. రామ్మూర్తి తన భార్యవైపు సాలోచనగా చూశాడు. కమలమ్మ తన పర్స్ వెతుక్కుంది. పర్స్‌లో ఎనిమిది రూపాయలున్నాయి. షేర్ ఆటోకి అయిదు రూపాయలు ఇచ్చేస్తే, ఇక మూడు రూపాయలు మాత్రమే మిగులుతాయి. అవి సిటీబస్సుకు చాలవు.

ఆర్టీసీ వాళ్లు చార్జీలు తెగ పెంచేశారు.
ఇక తప్పక, కమలమ్మ కొత్త డ్రైవర్ వెంట స్కూల్‌కి బయల్దేరింది. రామ్మూర్తి తమ వాకిలి అంచువరకూ జరిగి, వెళ్లిపోతున్న ఆటోరిక్షా కనిపించినంత మేరా చూస్తుండిపోయాడు. వెనక్కి తిరగబోయి ఆగాడు.

ఎప్పుడూ వచ్చే ఆటోరిక్షా తమ ఇంటివైపే వస్తోంది. దానిమీద ఉన్న పవన్‌కళ్యాణ్ బొమ్మను ఆయన గుర్తుపట్టాడు. ఆయన గుండె దడదడ లాడింది.
‘‘మరో ఆటోరిక్షాను పంపించావు కదా. తీసుకువెళ్లాడు’’ అన్నాడు రామ్మూర్తి.
విస్మయంగా చూశాడు డ్రైవర్.
‘‘అయితే నువ్వు పంపలేదా?’’ దడను మరింత పెంచుకున్నాడు రామ్మూర్తి.
‘‘ఎలా ఉంటాడండి?’’ అడిగాడు డ్రైవర్.
‘‘నువ్వు రాలేకపోయినప్పుడు ఫోన్‌చేసి చెప్పలేకపోయావా?’’ తన ధోరణిలో తానున్నాడు ముసలాయన.

‘‘ఆటోస్టాండ్ పక్కనే రోడ్డు ప్రమాదం జరిగిందండి. పోలీసులు మమ్మల్ని ఎవరినీ కదలనివ్వలేదు. వాళ్లు వదిలారంటే టీవీనాయాళ్లు పట్టుకుని, ప్రశ్న మీద ప్రశ్న వేసి చావగొట్టారు. అయినా నేను వేరెవ్వరినీ పంపనని అమ్మగారికి బాగా తెలుసు.’’

‘‘మరి, తెలిసే ఎలా వెళ్లిపోయింది?’’
‘‘ఫరవాలేదులెండీ. నా బేరాల విషయం తెలిసినవాడే వచ్చి ఉంటాడు. నాకు చెప్పడానికి కుదిరి ఉండదు.’’

‘‘అలా అయితే నువ్వు పంపించినట్టు అబద్ధం ఎందుకు చెబుతాడు?’’

రామ్మూర్తి తల ఊపి మళ్లీ, ‘‘కేవలం బేరం కోసం వచ్చి ఉంటే సమస్య లేదు. వేరే ఉద్దేశంతో వచ్చి ఉంటేనే ఇబ్బంది’’ అన్నాడు.
ఆటో డ్రైవర్ ధీమాగా తల ఎగరేసి, ‘‘మన ప్రాంతంలో అలాంటి ప్రమాదం లేదు సుమండీ!’’ అన్నాడు.
‘‘అది సరే. మిగతావాళ్లు కూడా ప్రయాణించారో లేదో?’’
‘‘నేను తెలుసుకుంటాను’’ సెలవు తీసుకుని డ్రైవర్ వెళ్లిపోయాడు.

రామ్మూర్తి తలపంకించి గోడలు, తలుపు ఆసరాతో లోపలికి నడిచి, తన వెనుక తలుపు చెక్క గడియ వేశాడు. మంచం సమీపించి వెల్లకిలా పడుకున్నాడు. అతడి పక్కనే ముక్కాలిపీట ఉంది. పీటమీద మాత్రలు, మందుల సీసాలు ఉన్నాయి.

ఒంటరితనంలో కూరుకుపోయాడు రామ్మూర్తి. కమలమ్మ పదే పదే గుర్తుకొస్తోంది. ఆమె స్కూలుకు క్షేమంగా చేరిందా? లేదా? ఎలా తెలుస్తుంది?

డ్రైవర్ దురుద్దేశంతో ఉంటే కనీసం కేకలు పెట్టగలిగే వయస్సు కూడా కాదు.

ఆమె మెడలో ఉండే మూడు తులాలతాడు గుర్తొచ్చింది. గొలుసులు తెంచుకుపోయే సంఘటనలకు భయపడి, బీరువాలోనే వదిలిపెట్టి వెళ్లింది భార్య. అంతవరకూ నయం! కాని, ఇంట్లో తానొక్కడూ...
రామ్మూర్తి గుండెలో ఆరాటం మొదలయ్యింది. గుండెలో ఏ మూలో భయం కలుగుతోంది. కలుక్కుమనే నొప్పి సైతం ప్రారంభమయ్యింది. ఈ వయసులో, తానున్న ఈ పరిస్థితిలో కమలమ్మకు ఏం జరిగినా తాను తట్టుకోలేడు.

తనది బొత్తిగా అవిటి బతుకు అయిపోయింది. తమకి పిల్లలు లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది. ప్రాణ భయంతో ఆయనకి గొంతు తడారిపోతోంది.

ఉన్నట్టుండి రామ్మూర్తి కళ్లు పెద్దవయ్యాయి. గుమ్మంలో ఒకరు నిలబడి ఉన్నాడు. మొదట, అదంతా తన భ్రమ అనుకున్నాడు. కాని కాదు.
‘‘ఏం తాతగారూ?’’ అన్నాడతడు.
‘‘నువ్వా?’’ గుండె మీద చెయ్యి వేసుకున్నాడు రామ్మూర్తి.

కొత్తగా వచ్చిన ఆటో డ్రైవర్ ఆయన్ని సమీపించి, దగ్గరలో నిలబడ్డాడు. రామ్మూర్తి గజగజ వణికిపోతున్నాడు. తాను ఊహించినదంతా నిజమే అవుతోంది. తన భార్యను వీడు ఏదో చేసి ఉంటాడు. తిరిగి తన ఇంటికెందుకు వచ్చాడు? గడియపెట్టిన తలుపులు ఎలా తెరిచాడు?


రామ్మూర్తికి తల పగిలిపోతోంది. శిరస్సులో ఒక పక్కనే వచ్చే తలనొప్పి! నొప్పి కంటే మరణం మేలనిపించే వేదన. క్లస్టర్ హెడ్ ఏక్.రామ్మూర్తి ఆ మంచం మీదే లుంగలు చుట్టుకుపోతున్నాడు. ఆ దశలోనే ముక్కాలి పీట మీద చేత్తో తడుములాట మొదలుపెట్టాడు. కొద్ది క్షణాలాగి, తల విసురుతూ, దేనికోదానికి ఢీకొట్టుకోవాలన్నట్టు ప్రయత్నించాడు.


అగ్నిపర్వతం పగులుతున్నట్టు అతని తల పగులుతోంది.

‘‘ఏమయ్యింది?’’ అడిగాడు ఆటో డ్రైవర్.
‘‘ఈ నొప్పితో ఇలాగే బాధపడితే చచ్చిపోతాను’’ మూలిగాడాయన.
‘‘మాత్రలున్నాయా?’’
‘‘ఒకే మాత్ర ఉండాలి. మామూలుగా ఇవ్వరు మందుల షాపువాళ్లు.’’
ముక్కాలిపీట మీద మాత్రల్లో అన్వేషణ ప్రారంభించి, ‘‘మాత్ర పేరేమిటి?’’ అన్నాడు ఆటో డ్రైవర్.
‘‘సుమెనెట్. వంద మిల్లీగ్రాములు.’’

వెతికాడు ఆటోడ్రైవర్.

‘‘మా ఆవిడను క్షేమంగా దింపావా?’’ గిలగిలలాడుతూ అడిగాడు రామ్మూర్తి.
గిలగిలలాడుతూ మంచం చివరికి వచ్చేశాడు.
ఆటో డ్రైవర్ కంగారుగా మాత్రల పేర్లు చదువుతున్నాడు. నిరాశగా మూలిగాడు.
గిలగిలలాడుతూ రామ్మూర్తి కిందపడ్డాడు. కుయ్యోమంటూ మూలిగాడు. మరణ వేదనతో చుట్టుకుపోతున్నాడు.

ఆటో డ్రైవర్ బంగారం తీసుకుపోదామని వచ్చాడు. బంగారం ఎక్కడ ఉందో వెతుక్కునే అవకాశం, ముసలాయన ఇవ్వడం లేదు. సుమెనెట్ దొరికి ఉంటే, దాన్ని అతడి గొంతులో వేసి, బంగారం తీసుకుని పారిపోయి ఉండేవాడు ఈపాటికే! వీధి చివర ఒక ఆస్పత్రి ఉన్నట్టు డ్రైవర్‌కి తెలుసు. ముసలాయన్ని అక్కడికి తీసుకు వెళ్లేవరకూ బతికి ఉంటాడా?


డ్రైవర్‌కి మరోవిషయం కూడా తెలుసు. ముసలాయన తన వల్లనే విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడు. తన భార్య గురించి, ఆమె క్షేమం గురించి అతడు పడిన ఆవేదనే దీనికంతటికీ కారణం. ఆయనను ఆస్పత్రికి చేర్చగలడా తాను? ఆయనకున్న తలనొప్పి ఆటో డ్రైవర్‌కి బదిలీ అయ్యింది.

రెండు నిమిషాల తర్వాత ఆటోరిక్షా ఆ ఇంటి ముందు నుండి కదిలింది. డ్రైవర్ ఆటో నడుపుతున్నాడు.

ఆస్పత్రి ముందు వాహనం ఆపాడతడు.

రెండు చేతులతో ముసలాయన్ని ఎత్తుకున్నాడు. ఆస్పత్రి వరండాలో అతడి అడుగులు బరువుగా కదుల్తున్నాయి. తలుపు గడియను తన పద్ధతిలో ఒడుపుగా తప్పించాడే కాని, గడియను తిరిగి అమర్చలేని నిస్సహాయత డ్రైవర్‌కి గుర్తొచ్చి నిట్టూర్చాడు.

ఎం.వి.వి.సత్యనారాయణ

సాక్షి, 28-11-2010, ఆదివారం, అనుబంధం
Read More !

కంపల్సరీ అప్పల్నాయుడు




కంపల్సరీ అప్పల్నాయుడంటే తెలీనోళ్ల్లు విశాపట్నం జిల్లా చోడవరం తాలూకాలో అస్సలుండరు. అలాంటోడు ఇయాల రేపూ మరికనపడ్డు. నాయుడు చేసింది బొగ్గుల సుబ్బారావు డిపోలో కూలిపనే కావచ్చు. కానీ ఊరందరికీ గొప్ప ఆప్తుడు. బట్టతలతో కర్రి కర్రిగా రివటలా ఉండీవోడు. అస్థిపంజరానికి జింకరాసి చర్మం అతికిస్తే ఎలాగుంటాడో అలాగే ఉండీవోడు. కానీ ఎంత బలమో చెప్పలేం. రెండు మూడు బొగ్గుల బస్తాల్ని అవలీలగా మోసీసి ఇళ్లకి తెచ్చి పడీసీవోడు.

ఆ రోజుల్లో గ్యాస్ పొయ్యిలెక్కడుండీవండీ బాబూ. చోడవరంలో పెద్ద్ద షావుకార్లు పూసర్ల రాజేశ్వర్రాగారింట్లోనో, విజ్జపు సోమేశ్వర్రావుగారింట్లోనో ఉండీవి. మిగిలినోళ్లంతా అప్పల్నాయుడి చుట్టూ గిరికీలు కొట్టవలసిందే. సంక్రాంతికి కొత్తల్లుడొస్తున్నాడంటే చాలు. ‘‘నాయుడు ఎక్కడున్నాడ్రోయ్!’’ అని అంతా వెతుక్కునేవోరు.

‘‘వంటకి ఇబ్బందుల్లేకుండా చూడ రోయ్!!’’ అంటూ గండికోట సీతారావమ్మ, భమిడిపాటి నరసయ్యమ్మ లాంటి చాదస్తపు బ్రాహ్మణమ్మలు అతగాణ్ణి అదిలించీవారు.
‘‘అదేటమ్మా మీ ఇంటికి సుట్టాలొస్తే నా ఇంటికొచ్చినట్టు కాదేటి’’ గౌరవంగా మాట్లాడీవోడు.

‘‘నాకేటీ ఎగస్ట్రా ఇవ్వొద్ద్దు. మా బొగ్గుల సుబ్బారావుకి బస్తా కిచ్చే రూపాయే చాలు. మీ ఇంట్లో ఆవకాయుంటే మాత్రం రెండు ముక్కలెట్టండి’’ ప్రాధేయపడీవోడు. ఆడికి ఆవకాయ డొక్కలంటే అంతపిచ్చి. ఆడికి మరో పిచ్చి కూడా ఉందనుకునేవారంతా. అదేటంటే పక్కవారికి చేతనయినంత సేవచేసేయాలనే తాపత్రయం.

‘‘ఈడికేం పిచ్చా.. ఈడికొచ్చే ముస్టి మూడణాళ కూలి కూడా పక్కోరి కోసం ఖర్చెట్టెస్తున్నాడే..ఇల్లు పిల్లల్లేని బ్రహ్మచారిగోడు గాబట్టి సరిపోయింది. నేపోతే ఈడి పేరు చెప్పుకుని సంసారం చేటమూలకొచ్చీసీది’’ బొగ్గుల సుబ్బారావు తిట్లు అన్నదానపువారి వీధంతా రోజూ వినబడుతూనే ఉండీవి.
సుబ్బారావు తిట్టాడని కాదుగానీ అప్పల్నాయుడు అలాటోడే. ఎవుడైనా ఆకలంటే చాలు. నాయుడు కదిలిపోయీవోడు. జేబులో కాణీ లేకపోయినా ఆకలితో ఉన్నోడికి అగ్గాల సన్నాసి టీకొట్టో అరువు టీ పోయించీసీవోడు. ఊళ్లో పెళ్లయినా, పేరంటవయినా పిలవకుండానే వచ్చే కూలీ అప్పల్నాయుడే.

పందిర్రాట పాతడం నుంచీ ఎంగిలాకులు ఎత్తడం వరకూ అన్నింట్లోనూ కలుగజేసుకునీవోడు. ఇక చావయితే కొరివిపెట్టే కొడుకులయినా రాడం ఆలస్యమోమో గానీ ఈడు మాత్రం పీనుగ దగ్గర రెడీ. ఏడిచీ వోళ్లతో ఏడిచీ వోడు. ఆఖర్న శంఖం ఊదుకుంటూ శవాన్ని రుద్రభూమికి తీసుకుపోయీవోడు. కపాలమోక్షమైతేనే గానీ తిరిగొచ్చీవాడు కాదు. ఆడున్నాడన్న భరోసాతో కాలుతున్న కాయాన్ని వదిలిపెట్టి చక్కావచ్చీసీది బంధుగణం.

నాయుడికి మరో చిత్రమైన అలవాటుండేది. రెండు చెవుల్లోనూ రెండు అర్ధరూపాయి బిళ్లలు దోపుకుని తిరుగుతుండీవోడు. భలే లాఘవంగా వాటిని చెవి కన్నం మీద మూతలేసినట్టు పెట్టుకునీవోడు. బుర్ర ఎటు తిప్పినా పడకుండా అమర్చుకుని నిమానుగా నడుస్తుండీవోడు.
‘‘బనీనుకి జేబుండగా చెవుల్లో డబ్బులేట్రా’’ అనడిగితే, ‘‘చెవుల్లో ఉంటేనే కదా. అడిగినోడికి డబ్బుల్తీసి చకాచకా ఇచ్చీవచ్చు..’’ కస్సుమనీవోడు.

అలాంటి కంపల్సరీ అప్పల్నాయుడు వయసుమీద పడ్డాక నానా కష్టాలూ పడ్డాడు. ఎవరేనా పెడితే తినీవోడు. లేదంటే పస్తే. పూసర్ల సీతారామయ్యగారి సత్రం అరుగుమీదే కాలక్షేపం చేసీవోడు.
ఒకానొకరోజు భూమ్యాకాశాలు బద్ధలయ్యేలా వాన మొదలైంది. చోడవరం సముద్రంలా మారిపోయింది. గునిశెట్టివీధి, గూనూరు వీధి, చావలి వారి వీధి, బుక్కావారి వీధి తేడా లేదు. అంతా గంగాప్రవాహమే. పిట్టలు గూళ్లు వదల్లేదు. పిట్టమనిషి ఇంట్లోంచి పైకి రాలేదు. తలుపులు బిడాయించుకుని కలిగిందేదో తిని ముసుగుతన్ని పడుక్కున్నారు. ఎవడూ అప్పల్నాయుడి సంగతే పట్టించుకోలేదు.

‘‘ఆడుంటే ఎంత. పోతే ఎంత..’’ అన్నట్టుగా మూడు రాత్రులు మూడు పగళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎరగ్రా ఎండకాసేనాటికి చూస్తే సత్రం అరుగుమీద అప్పల్నాయుడున్నాడు. ప్రాణమే లేదు.
‘‘ఎంతసేపిలా. చాకలి జంపా చినసన్నాసిని పిలవండి. మరో నలుగుర్ని వెంటతెచ్చుకోమనండి.
దహనం కానీండి.’’ కరణం బాబు నరసింహ సిద్ధాంతి గారి పెద్దగొంతు హడావుడి చేసింది.కందర్ప అశోక్ రంపపు మిల్లు వెనకాలున్న శ్మశానానికి నాయుడి శవాన్ని మోసుకుంటూ పోయారు. నా అన్న వారు లేని నాయుడికి సన్నాసే కొరివిపెట్టాడు. మెల్లగా కరమ్రుక్కలు కిరసనాయులు కలిసి మంట మొదలైంది. చిత్రంగా అర్ధగంటయినా శవం మాత్రం కాల్లేదు. సన్నాసి తన శవదహనం సీనియార్టీ అంతా ఉపయోగించినా అప్పల్నాయుడు బుగ్గవడం లేదు.

‘‘పిల్లా జెల్లా లేనోడు. ఈడికి తీరని కోరికలేం ఉంటాయి’’ అంటూ తమలో తామే ఆర్గ్యుమెంటు చేసుకున్నారు. సన్నాసికి అప్పుడు బురల్రో ఆలోచన మెరిసింది.
‘‘ఒరేయి ఎవరిదగ్గరయినా రెండు అర్ధరూపాయి కాసులున్నాయేట్రా..’’ అరిచాడు.
నాయుడితో కరస్రాము చేసీ కన్నయ్యగాడో రూపాయి, నూకయ్యగాడో రూపాయీ తీసిచ్చారు. డబ్బు బిళ్లలు చెవుల్లో పదిలంగా దూరాయో లేదో పెఠీల్ పెఠీల్మంటూ చితి అంటుకుపోయింది.

- చింతకింది శ్రీనివాసరావు


సాక్షి, 28-11-2010, ఆదివారం, అనుబంధం
Read More !

సమయస్ఫూర్తి

అవంతీదేశ శూరసేన చక్రవర్తికి భానుమతి అనే లోకోత్తర సుందరి ఏకైక కుమార్తె. తన కుమార్తెకు స్వయంవరాన్ని చాటించాడు చక్రవర్తి.

భానుమతి అందచందాల గురించి విన్న ఎందరో రాకుమారులు స్వయంవరానికి విచ్చేశారు.
చక్రవర్తి పెట్టిన అన్ని పరీక్షల్లోనూ హర్షవర్ధనుడు, విక్రమార్కుడు అనే ఇద్దరు రాకుమారులు సరిసమానంగా నిలిచారు. ఇద్దరూ చక్కటి అందగాళ్లు, స్ఫురద్రూపులు.

చక్రవర్తికి ఏం చేయాలో పాలుపోక, యుగంధర అమాత్యుల వారివైపు దృష్టి సారించాడు. యుగంధర అమాత్యులు వయోవృద్ధుడు, శూరసేన చక్రవర్తి తండ్రి కాలము నుండీ మహామంత్రి పదవి నిర్వహిస్తున్నవాడు. యుగంధరుడు చిరునవ్వు నవ్వి, ‘‘మహారాజా! ఆందోళన చెందకండి. రాకుమారు లిద్దరిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఎవరు సమయస్ఫూర్తిగా సమాధానమి స్తారో వారికి రాకుమారినిచ్చి వివాహం చేద్దాం’’ అన్నాడు.

ఇద్దరు రాకుమారులను ఒక గదిలోకి పిలిపించాడు యుగంధరుడు.
‘‘రాకుమారులారా! వీర పరీక్షల్లో మీరిద్దరూ ఒకే శ్రేణిలో నిలిచారు. నేను అడిగే ప్రశ్నలకు ఎవరు సరియైన సమాధానమిస్తారో వారినే రాకుమార్తె వరిస్తుంది. మీకు ఇష్టమేనా?’’ అన్నాడు.
రాకుమారులిద్దరూ తలలూపారు.

‘‘1. మీరు వచ్చిన గదిలోకి ఎన్ని మెట్లు ఉన్నాయో ముప్పది ఘడియల్లో చెప్పాలి?
2. రాకుమారి శయన మందిరాన్ని ఎన్ని రకాల పుష్పాలతో అలంకరణ చేశారో నలుగురు నచ్చునట్లు చెప్పాలి?

3. రాకుమారికి ఇష్టమైన రంగు ఏమిటో తేటతెల్లం చేయండి’’ అని అడిగాడు మహామంత్రి.
యుగంధరుడు అడిగిన మూడు ప్రశ్నలకు హర్షవర్ధనుడు, విక్రమార్కుడు ఆలోచనలో పడ్డారు. కొంతసేపటికి విక్రమార్కుడు ‘‘మీరడిగిన మూడు ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను’’ అని, ‘‘మొదటిది - ముప్పది మెట్లు ఎక్కి వచ్చాం.

రెండోది - నాలుగు రకాల పుష్ప జాతులతో శయన మందిరాన్ని అలంకరించారు. మూడోది - రాకుమారి ఇష్టపడే రంగు తెలుపు’’ అన్నాడు. యుగంధరుడు ఆప్యాయంగా విక్రమార్కుడిని కౌగిలించుకున్నాడు. హర్షవర్ధనుడు ఓటమి భారంతో నిష్ర్కమించాడు.

భానుమతిని దక్కించుకొన్న విక్రమార్కుడిని యువరాణి, ‘‘ఏమండీ! మీకు మాయామంత్ర విద్యలేమైనా వచ్చా? అమాత్యులవారు అడిగిన ప్రశ్నలకు అంత చక్కగా సెలవిచ్చారు’’ అంది.
విక్రమార్కుడు నవ్వుతూ, ‘‘యువరాణి! మీ అమాత్యులవారు అడిగిన ప్రశ్నల్లోనే సమాధానముంది.

కొంచెం మెదడుకు పదును పెడితే సరి!’’ అన్నాడు.
భర్త సమయస్ఫూర్తికి భానుమతి మురిసిపోయింది.


- ప్రతాపురం రామానుజాచారి

సాక్షి, 28-11-2010, ఆదివారం, అనుబంధం
Read More !

ఒకానొక కలంస్నేహ

పదాలు పెదాలు
అదేమిటో, కొన్ని పనులు నేను ఎప్పటికీ చేయలేను. ‘కలంస్నేహం’ అందులో ఒకటి.
‘చాలా ఏళ్ల తర్వాత నా కలం స్నేహితుడిని కలిశాను’
‘మా కలం స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది’
‘పెళ్లి చేసుకోవడానికి ముందు, వాళ్లిద్దరూ కలం స్నేహితులట’
... ఇలాంటివి అరుదుగానైనా మన చెవిన పడకుండా ఉండవు. పైగా ప్రపంచమంతా స్ర్తీలు, పూలు తప్ప ఇంకేమీ లేవని నమ్మే వయసులో పడితే!

అదుగో అలాంటి ఏదో ఒక క్షణంలో నాకూ ఆ తెగులు సోకింది. దిగులు మొద లైంది. నాకెందుకుండవీ కలం స్నేహాలు?

అర్జెంటుగా నేనిప్పుడు ఒక కలంస్నేహం సంపాదించుకోవాలి. దానికి నేను పెట్టుకున్న నిబంధనలు మూడు.

1. కచ్చితంగా అమ్మాయితోనే చేయాలి.

2. ఆమె పేరు అందంగా ఉండాలి (పేరు అందంగా ఉంటే, మనిషీ అందంగా ఉంటుందేమోనన్న భ్రమ.).
3. ఆమె నాకంటే చిన్నదై ఉండాలి (ఎలాగూ రేప్పొద్దున ప్రేమలో పడతాము, పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ఇబ్బంది రాకుండానన్నమాట.).

సిద్దిపేట డిగ్రీ కాలేజీలోని రీడింగ్ రూమ్‌లోని న్యూస్‌పేపర్లూ, మ్యాగజైన్లలోని కలంస్నేహాల శీర్షికలన్నీ గాలించి, వడగట్టి, ఒకట్రెండు పేర్ల దగ్గర కాస్త మీమాంస పడి, చిట్టచివరకు తేల్చిన అమ్మాయి...

సుభాషిణి.
వయసు 18. గోవా.
గోవాలో ఉండే అమ్మాయికి తెలుగొచ్చి ఉంటుందా?
తెలుగు పేపర్లో పడింది కాబట్టి, వచ్చే ఉండాలి.

ఇక, ఆమెకో సుదీర్ఘ ఉత్తరం రాశాను. బహుశా, ఏ మగవాడూ ఇంకో అమ్మాయికి అలా రాయకూడదు, కనీసం మొదటి ‘పరిచయం’లో. చారిత్రక తప్పిదం!

సారాంశం ఏమిటంటే: నేను ఫలానా. ఒక అమ్మాయితో కలంస్నేహం చేయాలనుకోవడం తప్పే కావొచ్చు. అయినా నీతో నేను ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నానంటే, అపోజిట్ సెక్స్ పట్ల ఉండే ఆకర్షణ వల్ల.

... ఆ అమ్మాయికి ఆ ఉత్తరం చేరిందో లేదో తెలియదు. ఆమె ఒకవేళ చదివుంటే ఏమనుకుందో తెలియదు. ఫలితం మాత్రం, రాని ప్రత్యుత్తరం.

ఎదురుచూసీ చూసీ... విసిగీ విసిగీ...
కారణం ఏదైనా, జవాబివ్వనంత పొగరు- ఏ అమ్మాయికీ, ఆ మాటకొస్తే ఏ మనిషికీ ఉండకూడదనుకుంటాను.
ఇంకంతే!
అక్కడితో ఆ అధ్యాయం సమాప్తం.

సుమారు ఓ పదేళ్ల తర్వాత కలిగిన జ్ఞానోదయం ఏమిటంటే:

(కలిగినా చేసిందేమీ లేదనుకోండి.)
అసలు నిన్ను అంత ‘ఓపెన్’గా ఎవడు ఉండమన్నాడూ!
నీ నిజాయితీ తగలెయ్య!
జీవితంలో ఏ విషయంలోనూ లేని స్పష్టత, నాకు అమ్మాయిలతో స్నేహాల విషయంలో ఉండింది. అందువల్లే అన్యాయమైపోయాను.

ఎందుకు వీళ్లకు చేరువ కావడానికి కొంత హిడెన్ ఎజెండా అవసరం అవుతోంది? ఎందుకు వీళ్లు కొంత మాయ చేయాల్సిన పరిస్థితి కల్పిస్తారు?

నువ్వేమీ వినట్లేదుకదా, సుభాషిణీ!
- పూడూరి రాజిరెడ్డి
(జి.శ్రీనివాసరావు ‘ద మ్యాజిక్ ఆఫ్ ద మిడిల్స్’ చదువుతుండగా...)
Read More !

నీ పుట్టుక కూడా నీ రియల్ ఎస్టేటే...

లెక్చరర్ మల్లయ్య కూతురు ఒకరోజు సాయంత్రం వాళ్ల కాలనీలోనే ఉన్న ఫ్రెండ్ను కలవడానికి వెళ్లింది. చీకట్లో తిరిగివచ్చేటప్పుడు అదే కాలనీలో ఉండే ఒక కుర్రాడు పిల్ల జడ లాగాడు. బదులుగా పిల్ల చెప్పుతీసుకొని వాడి చెంప మీద కొట్టింది. ప్రతీకారంగా వాడు ఆమె బుగ్గ కొరికి పారిపోయాడు. ఇదితెలిసి మల్లయ్య కొడుకు తన ఫ్రెండ్స్ను తీసుకొని కుర్రాడి ఇంటికి పోయి మొత్తంతుక్కుతుక్కు చేశాడు. కుర్రాడు హాస్పిటల్ పాలయ్యాడు. కుర్రాడి తల్లిదండ్రులు వెంటనే మల్లయ్యకొడుకు మీద కేసు పెట్టారు. దీనికి విరుగుడిగా మల్లయ్యవాళ్లు కుర్రాడి మీద రేప్ అటెంప్ట్ కేసుపెట్టారు.

ఇదీ జరిగింది.
‌ ‌ ఇందులో ఇక మీదట జరగాల్సిందంతా లీగల్ బ్యాటిలే. కాని మన దేశంలో అలా జరగదు. వెంటనే కథ వ్యక్తుల దగ్గరకువస్తుంది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే కులం దగ్గరకు వస్తుంది.
చూశారా- కులం తక్కువ వాళ్లు కాబట్టే తమ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగిందని కేసు పెట్టారు. అదే మనమైతేపెడతామా? అని అవతలి పక్షం వాళ్లు అనడం మొదలెట్టారు. కాలనీ రెండు వర్గాలుగా
చీలిపోయింది. మల్లయ్య మనసు నీరు అయిపోయింది.
అరె.... ఇంతా చేసి తిరిగి కులం దగ్గరకే వచ్చి చేరామే అని బాధ పడ్డాడు.
పాతికేళ్ల
క్రితం కాలనీలో ఏమీ ఏర్పడక ముందు స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు మల్లయ్య. అతడి భార్య టీచరు. ఇద్దరూ కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అక్కడ చేరాక, ఇరుగుపొరుగు వారితో స్నేహం చేశారు. పిల్లలు కూడా కాలనీవారికి దగ్గరయ్యారు. కాని ఇప్పుడీ గొడవ వల్ల ఎడం పెరిగింది.

ఒకప్పుడు మల్లయ్య దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల అంతా ఉంది. ఆస్తి ఉంది.
అయినప్పటికీ
- చాలా విషయాలు నిర్ణయిస్తున్నది కులమే అని అతనికి అర్థమవుతూ ఉంది. నిన్న మొన్నటి దాకా అదేకాలనీలోని ఒక మిత్రుడు మల్లయ్యతో ఎంతో సఖ్యంగా మెలిగేవాడు. అతడు బిల్డర్. రియల్ ఎస్టేట్ రంగం బాగాఉన్నప్పుడు బిల్డర్ కూతురికీ, మల్లయ్య కొడుక్కీ పెళ్లి జరిగితే బాగుంటుందని
ఇరువర్గాల
వాళ్లూ అనుకున్నారు. కాని ఈలోపు బిల్డర్ దెబ్బ తిన్నాడు. తేడా వచ్చింది డబ్బు విషయంలో మాత్రమే. కాని కులం రోల్ ప్లే చేసింది.

ఎలాగూ ఆస్తి చెడింది, నీ కూతురిని కులం తక్కువ వాళ్ల అబ్బాయికే ఇచ్చి కులం కూడా చెడు అని ఇరుగుపొరుగువాళ్లు అనడం మొదలెట్టారు.
బిల్డర్
కి అహం అడ్డం వచ్చింది. ధైర్యం లేకపోయింది. కుర్రాడికేం చాలా మంచి అబ్బాయి అని చెప్పలేకపోయాడు. మల్లయ్యను తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. తక్కువకులం వాడికి డబ్బు ఎక్కువై ఎక్కువ కులం వాడికిడబ్బు తక్కువైనా సరే ఎక్కువ కులం వాడిదే పైచేయి!
లోపల కాలనీలోని చుట్టుపక్కల స్థలాలన్నీ రేటు పెరిగిపోయాయి.
మల్లయ్య కట్టుకున్న ఇల్లు మాత్రం అలాగే ఉంది.

రియల్ ఎస్టేట్లో గమ్మత్తేమిటంటే ఖాళీ జాగాకు ఉన్న డిమాండు కట్టిన భవంతికి ఉండదు. ఖాళీ జాగా ఉంటే లోన్లుసులభంగా దొరుకుతాయి. వీలుని బట్టి కట్టుకోవచ్చు. ఇష్టమైనట్టుగా కట్టుకోవచ్చు. అదే కట్టిన ఇల్లయితే ఇప్పుడు లైఫ్ఎంత ఉంది, ఇక మీదట ఎంత ఉంటుంది, వాస్తు ఉందా లేదా అని ఒకటే గొడవలు.

పాపం మల్లయ్య ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నాడు. అతడి ఇంట్లో వేయని మొక్క లేదు. పెంచని
కూరగాయ లేదు. పూలతో కాయలతో అతడు కాలనీలో ఎన్నో అనుబంధాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మల్లయ్యఏమంటాడంటే- శ్రమ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్లకు భూమి వ్యాపార వస్తువు కాదు. భూమిని వ్యాపారంగా చూసేవాడుదానిని కొని తనకు సంబంధం లేదన్నట్టుగా పడేస్తాడు. దాని రేటు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రేటు వచ్చాకఅమ్మేసి ఇంకోచోట మళ్లీ ఇంకో స్థలం కొని పడేస్తాడు. సోమరిపోతుల పని అది.

మల్లయ్య అలా చేయలేకపోయాడు. అతడి దృష్టిలో భూమి అంటే ఇల్లు. లేదంటేపంటలు పండే పొలం. అందుకే అతడు ఇంకొన్ని చోట్ల కొన్ని ప్లాట్లు కొని పడేయలేదు. ఇప్పుడు ఇంటిని అమ్మేసి వేరే చోటుకు వెళదామంటే ఇంటికి అనుకున్న రేటురావడం లేదు. తాము కొనాలనుకున్న చోట స్థలమూ రావడం లేదు. పెద్ద ఇరకాటం.
మల్లయ్య ఆలోచించాడు.
దీనికి విరుగుడు ఏమిటి? ఇల్లు మారడమా; ఇంకో చోటుకు వెళ్లడమా? అనేది తర్వాతవిషయం. తన మానవసంబంధాలు పునరిద్ధరింప
బడాలంటే
, పైకులం వాళ్లయినా సరే- వారితో సరిసమానంగా తాను ఉండాలంటే, తనపిల్లలూ ఉండాలంటే తమకు తప్పనిసరిగా ఉండాల్సిన రియల్ ఎస్టేట్ ఏమిటి? కాలనీలో అయినా ఉండేలా తమకు అర్హత కలిగించే రియల్ ఎస్టేట్ ఏమిటి?
చదువే!

చదువు- కింద కులాల వాళ్లకి అతి పెద్ద రియల్ ఎస్టేట్. చదువుకున్నవాడినే సమాజం కులానికి అతీతంగాగౌరవిస్తుంది. హోదా ఇస్తుంది. అధికారం ఇస్తుంది. అతడితో సంబంధాలు కలుపుకోజూస్తుంది. ఇంకా చెప్పాలంటే అతణ్ణిమనిషిగా కన్సిడర్ చేస్తుంది. అదే పెద్ద కులాల వారికైతే? వారికి వారి కులమే ఒక రియల్ ఎస్టేట్. తరతరాల ఆస్తి. అదివారికి ఏదో ఒక విధంగా వడ్డీ చెల్లిస్తూనే ఉంటుంది.

అవును. కులం చెరిగిపోవాలంటే చదువు పెరగాలి అనుకున్నాడు మల్లయ్య. ఇంతవరకూ అతడు తన సొంత పిల్లలచదువు గురించే శ్రద్ధ వహించాడు. ఇక మీదట అలా ఉండడు. తమ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరూ బాగా చదువుకునేలాచూస్తాడు. అందుకు అవసరమైన సహాయం చేస్తాడు. గట్టిగా ప్రయత్నిస్తాడు.

కొత్త అవగాహనతో మల్లయ్య ప్రయాణం మళ్లీ మొదలయ్యింది.
కథ ముగిసింది.
రచయిత బిఎస్ రాములు రాసిన ఆలోచనాత్మక కథరియల్ ఎస్టేట్’. బాధ తెలిసిన వాడు నొప్పి
తెలిసేలా రాసిన కథ ఇది. బహుశా పాఠకులను ఉలికిపాటుకు గురి చేసే కథ. దీనిని చదివిన పాఠకుడు పక్కనఉన్నవారితో చర్చకు దిగక మానడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారెవరో.
కాని, భారతదేశంలో మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే.
వాటి నడుమ ఉన్న ఘర్షణను రియల్ ఎస్టేట్ రంగంతో ముడిపెట్టి విశదపరిచిన గట్టి కథ, రియల్ కథరియల్ ఎస్టేట్’.
- సాక్షి ఫ్యామిలీ

బిఎస్ రాములు: కథను వెర్రిగా అభిమానించి భుజాన వేసుకొని తిరిగే ప్రముఖ రచయిత. చాలామంది శిష్యులనుతయారు చేశారు. లెక్కకు మించి కథలు రాశారు. స్వస్థలం కరీంనగర్ జిల్లా జగిత్యాల. ‘పాలువీరి తొలి కథా సంపుటి. ఇంకో అరడజను పుస్తకాలున్నాయి. నివాసం హైద్రాబాద్. ఫోన్: ౯౩౯౧౦౩౬౯౮౭


సాక్షి, డైలీస్టోరీ, ప్రతి రోజూ కథా పరిచయం నుంచి
గురువారం :
02/12/2010
Read More !